రాకేశ్ టికాయత్ హెచ్చరిక : ఈసారి పార్లమెంట్ ముట్టడి, 40 లక్షల ట్రాక్టర్లతో

రాకేశ్ టికాయత్ హెచ్చరిక : ఈసారి పార్లమెంట్ ముట్టడి, 40 లక్షల ట్రాక్టర్లతో

tractors

Farmer leader Rakesh Tikait : కొత్త అగ్రిచట్టాలకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న రైతులు పోరాటాన్ని మరింత ఉధృతం చేశాయి. కేంద్ర ప్రభుత్వం కొత్త వ్యవసాయ చట్టాలను ఉపసంహరించుకోకపోతే పార్లమెంటును ముట్టడించడానికైనా వెనుకాడబోమని భార‌తీయ కిసాన్ యూనియ‌న్ నేత రాకేశ్ టికాయత్ ప్రక‌టించారు. త్వరలోనే పార్లమెంట్ ముట్టడికి పిలుపునిస్తామ‌ని హెచ్చరించారు.

గణతంత్ర దినోత్సవం రోజు కేవలం 4 లక్షల ట్రాక్టర్లతోనే పరేడ్ నిర్వహించామని.. కేంద్రం దిగిరాకపోతే ఈసారి 40 లక్షల ట్రాక్టర్లతో ర్యాలీ తీస్తామని వార్నింగ్ ఇచ్చారు. ఇండియా గేట్‌ దగ్గర ఉన్న పార్కులను దున్ని పంటలు పండిస్తామన్నారు. ఢిల్లీ మార్చ్‌కు ఏ క్షణమైనా పిలుపురావొచ్చని, రైతులంతా సిద్ధంగా ఉండాలని టికాయత్‌ పిలుపునిచ్చారు. ఉద్యమ కార్యాచరణలో భాగంగా అన్నదాతలు దామన్‌ విరోధి దివస్ జరిపారు. ఈ నెల 26న యువ కిసాన్‌ దివస్‌, 27న మజ్దూర్‌ కిసాన్‌ ఏక్తా దివస్‌ నిర్వహించనున్నారు.

పంటలకు కనీస మద్దతు ధర అమలు చేయకపోతే బడా కంపెనీల గోదాములను రైతులు కూల్చివేస్తారని హెచ్చరించారు. గోదాముల కూల్చివేత ఏరోజు ఉంటుందనేదానిపై త్వరలోనే యునైటెడ్‌ కిసాన్‌ మోర్చా ప్రకటన చేస్తుందన్నారు బీకేయూ నేత. రైతుల సంఘాల వ్యాఖ్యలను పోలీసులు సీరియస్‌గా తీసుకున్నారు. గత ట్రాక్టర్‌ పరేడ్‌ సందర్భంగా హింసాత్మక ఘటనలు చోటు చేసుకోవడంతో ఈసారి సరిహద్దుల్లో భద్రత పెంచారు. ఎప్పటికప్పుడు పరిస్థితులను తెలుసుకుంటున్నారు.