India Covid 19 : ఇండియాకి కాస్త రిలీఫ్.. వరుసగా 4వ రోజూ 40వేలకు పైగా కొత్త కేసులు

భారత్ లో కరోనా కల్లోలం కొనసాగుతోంది. మరోసారి కరోనా పడగ విప్పింది. పల్లె, పట్నం అన్న తేడా లేకుండా విజృంభిస్తోంది. దీంతో దేశవ్యాప్తంగా రికార్డు స్థాయిలో కొత్త కేసులు నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో

India Covid 19 : ఇండియాకి కాస్త రిలీఫ్.. వరుసగా 4వ రోజూ 40వేలకు పైగా కొత్త కేసులు

Corona India

India Covid 19 Cases : భారత్ లో కరోనా కల్లోలం కొనసాగుతోంది. మరోసారి కరోనా పడగ విప్పింది. పల్లె, పట్నం అన్న తేడా లేకుండా విజృంభిస్తోంది. దీంతో దేశవ్యాప్తంగా రికార్డు స్థాయిలో కొత్త కేసులు నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 40వేల 715 పాజిటివ్ కేసులు వెలుగుచూశాయి. అయితే క్రితం రోజుతో పోలిస్తే కొత్త కేసులు 13శాతం మేర తగ్గాయి. ఇది కొంత ఊరటనిచ్చే అంశం.

దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య కోటి 16లక్షల 86వేల 796కి(1.6 కోట్లు) చేరింది. మరణాలు 1.6లక్షల మార్కును దాటినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ మంగళవారం(మార్చి 23,2021) వెల్లడించింది. గడిచిన 24 గంటల్లో 199 మంది కరోనాకు బలయ్యారు. దేశంలో కరోనా వెలుగుచూసిన తర్వాత ఇప్పటివరకు లక్షా 60వేల 166మంది కోవిడ్ తో మరణించారు. గడిచిన 24 గంటల్లో 29వేల 785మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇప్పటివరకు కోవిడ్ నుంచి కోలుకున్న వారి సంఖ్య ఒక కోటి 11లక్షల 81వేల 253కి(1,11,81,253) చేరింది. రికవరీ రేటు 95.75 శాతంగా ఉంది.

క్రితం రోజు 49వేల 951 కరోనా కేసులు వెలుగుచూసిన సంగతి తెలిసిందే. గతేడాది(2020) నవంబర్ నుంచి ఇప్పటివరకు చూస్తే రోజువారీ కేసుల్లో ఈ సంఖ్య అత్యధికం. దేశంలోని చాలా ప్రాంతాల్లో కరోనా సెకండ్ వేవ్ కనిపిస్తోంది. దీంతో అప్రమత్తమైన ప్రభుత్వాలు కరోనా కట్టడికి కఠిన చర్యలు చేపట్టాయి. పలు ప్రాంతాల్లో లాక్ డౌన్ విధించాయి. నైట్ కర్ఫ్యూ పెట్టారు.

3.5లక్షలకు చేరువలో యాక్టివ్ కేసులు:
రోజువారీ కేసులు పెరుగుతుండటంతో దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్యా పెరుగుతోంది. యాక్టివ్ కేసుల సంఖ్య 3లక్షల 45వేల 377కి(2.87శాతం) చేరింది. క్రితం రోజు యాక్టివ్ కేసుల సంఖ్య 3లక్షల 34వేల 646గా ఉంది.

మహారాష్ట్రపై కరోనా పంజా:
కాగా, మహారాష్ట్రలో కరోనా విజృంభణ కంటిన్యూ అవుతోంది. దేశంలోని ఇతర రాష్ట్రాలతో పోలిస్తే అత్యధిక కేసులు అక్కడే నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో మహారాష్ట్రలో 24వేల 645 కరోనా కొత్త కేసులు వెలుగుచూశాయి. 58మంది కరోనాతో చనిపోయారు. ఇప్పటివరకు 22,34,330 మంది కొవిడ్‌ నుంచి కోలుకోగా..2,16,540 మంది ఈ మహమ్మారితో బాధపడుతున్నారు. మహారాష్ట్ర, పంజాబ్, కర్నాటక, గుజరాత్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో అధిక కేసులు బయటపడుతున్నాయి. దేశంలోని మొత్తం కేసుల్లో 85శాతం కేసులు ఈ 5 రాష్ట్రాల నుంచే ఉన్నాయి.

మరోవైపు దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ ముమ్మరంగా సాగుతోంది. ఇప్పటివరకు 4కోట్ల 84లక్షల 94వేల 594మందికి టీకా వేశారు. నిన్న ఒక్కరోజే 32లక్షల 53వేల 095 మందికి వ్యాక్సిన్ వేశారు. 2021 జనవరి 16 నుంచి దేశంలో టీకాలు వేసే కార్యక్రమం ప్రారంభమైంది. తొలుత హెల్త్ వర్కర్స్ కు ఇచ్చారు. ఫిబ్రవరి 2 నుంచి ఫ్రంట్ లైన్ వర్కర్స్ కు టీకా ఇవ్వడం స్టార్ట్ చేశారు. మార్చి 1 నుంచి సామాన్య ప్రజలకు టీకా వేసే కార్యక్రమం ప్రారంభించారు. 60ఏళ్లు పైబడిన వారికి.. 45 నుంచి 59 వయసుండి దీర్ఘకాలిక రోగాలతో బాధపడుతున్న వారికి టీకా ఇవ్వడం ప్రారంభించారు. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 23కోట్ల 54లక్షల 13వేల 233 కరోనా నిర్ధరణ పరీక్షలు నిర్వహించారు.

తెలంగాణలో డేంజర్ బెల్స్..
తెలంగాణలో కరోనా వైరస్ మహమ్మారి డేంజర్ బెల్స్ మోగిస్తోంది. రోజురోజుకి కొత్త కేసులు పెరుగుతూనే ఉన్నాయి. తాజాగా కొత్త కేసులు 400 దాటడం
ఆందోళనకు గురి చేస్తోంది. గడిచిన 24 గంటల్లో 412 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

తెలంగాణ రాష్ట్రంలో నిన్న(మార్చి 22,2021) రాత్రి 8 గంటల వరకు 68,171 కరోనా నిర్ధరణ పరీక్షలు నిర్వహించారు. నిన్న కొవిడ్‌తో ముగ్గురు మృతిచెందారు. దీంతో ఇప్పటివరకు మృతిచెందిన వారి సంఖ్య 1,674కి చేరింది. కరోనా బారి నుంచి నిన్న 216 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం యాక్టివ్‌ కేసుల సంఖ్య 3,151 ఉండగా.. వీరిలో 1,285 మంది హోం ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో కొత్తగా 103 కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు వైద్య ఆరోగ్య శాఖ మంగళవారం(మార్చి 23,2021) ఉదయం బులిటెన్‌ విడుదల చేసింది.

మన దేశంలో 2020 అగస్టు 7న కరోనా కేసుల సంఖ్య 20లక్షలు దాటింది
అగస్టు 23న 30లక్షలు దాటింది
సెప్టెంబర్ 5న 40లక్షలు
సెప్టెంబర్ 16న 50లక్షలు
సెప్టెంబర్ 28న 60లక్షలు
అక్టోబర్ 11న 70లక్షలు
అక్టోబర్ 29న 80లక్షలు
నవంబర్ 20న 90లక్షలు
డిసెంబర్ 19న కరోనా కేసుల సంఖ్య కోటి దాటింది.