India Covid19 Cases : లాక్‌డౌన్ తప్పదా? దేశంలో 40వేలు దాటిన కరోనా కొత్త కేసులు, ఒక్క ఆ రాష్ట్రంలోనే 25వేలకు పైగా బాధితులు

దేశంలో కరోనావైరస్ తీవ్ర రూపం దాల్చింది. రోజురోజుకి కొత్త కేసులు రికార్డ్ స్థాయిలో పెరుగుతున్నాయి. తాజాగా కరోనా కొత్త కేసులు 40వేలు దాటాయి. గడిచిన 24 గంటల్లో 40వేల 953 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

India Covid19 Cases : లాక్‌డౌన్ తప్పదా? దేశంలో 40వేలు దాటిన కరోనా కొత్త కేసులు, ఒక్క ఆ రాష్ట్రంలోనే 25వేలకు పైగా బాధితులు

India Covid19 Cases

40,953 New Covid Cases In India : దేశంలో కరోనావైరస్ తీవ్ర రూపం దాల్చింది. రోజురోజుకి కొత్త కేసులు రికార్డ్ స్థాయిలో పెరుగుతున్నాయి. తాజాగా కరోనా కొత్త కేసులు 40వేలు దాటాయి. గడిచిన 24 గంటల్లో 40వేల 953 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. సుమారు నాలుగు నెలల తర్వాత ఈ స్థాయిలో రోజువారీ కేసులు బయటపడ్డాయి. దాంతో మొత్తం కేసుల సంఖ్య కోటి 15లక్షలు(1,15,55,284) దాటింది. మరణాలు సంఖ్యలో కూడా పెరుగుదల కనిపిస్తోంది. తాజాగా 188 మంది కరోనాకు బలయ్యారు. మొత్తం మరణాల సంఖ్య లక్షా 59వేల 558కి చేరింది. దేశంలో 30వేలకు పైగా కరోనా కేసులు నమోదవడం వరుసగా ఇది మూడవ రోజు. క్రితం రోజు 39వేల 726 పాజిటివ్ కేసులు నమోదైన సంగతి తెలిసిందే. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 10లక్షల 60వేల 971 మందికి కొవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు.

సెకండ్ వేవ్ లో మరింత ఉధృతి:
దేశంలో కరోనా మహమ్మారి తీవ్రత ఆందోళనకు గురి చేస్తోంది. సెకండ్ వేవ్ లో కొత్త కేసులు భారీగా పెరుగుతున్నాయి. ఇక యాక్టివ్ కేసులు 2లక్షల 88వేల 394కి పెరిగాయి. నిన్న ఒక్కరోజే 23వేల 653 మంది వైరస్ నుంచి కోలుకున్నారు. మొత్తంగా వైరస్‌ను జయించిన వారి సంఖ్య 1,11,07,332కి చేరగా..రికవరీ రేటు 96.26 శాతంగా ఉంది. శనివారం(మార్చి 20,2021) కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వివరాలు తెలిపింది.

ఈ 5 రాష్ట్రాల నుంచి అధిక కేసులు:
మహారాష్ట్రలో కరోనా ఉగ్రరూపం చూపిస్తోంది. ఫస్ట్ వేవ్ కంటే సెకండ్ వేవ్ లో వైరస్ ఉద్ధృతి తీవ్రంగా ఉంది. గడిచిన 24గంటల్లో రాష్ట్రంలో రికార్డు స్థాయిలో 25వేల681 కరోనా కొత్త కేసులు నమోదయ్యాయి. వాటిలో మూడు వేలకు పైగా కేసులు ముంబైలోనే బయటపడ్డాయి. 2020 అక్టోబర్ 7న అత్యధికంగా ముంబైలో ఒక్కరోజే 2వేల 848 కొత్త కేసులు వెలుగుచూడగా..సెకండ్ వేవ్(రెండో దశ)లో ఆ సంఖ్య మరింత ఎక్కువగా ఉండటం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది.

మార్చి 14 నుంచి ఆరు రోజుల వ్యవధిలో ఒక్క ఆర్థిక రాజధానిలోనే 13వేల 912 మందికి వైరస్ పాజిటివ్‌గా తేలింది. దాంతో మహమ్మారి తీవ్రతను కట్టడి చేసే క్రమంలో కంటైన్‌మెంట్ జోన్లు, సీల్‌ చేసిన భవనాల సంఖ్య గణనీయంగా పెరిగింది. మార్చి 18 నాటికి 34 కంటైన్‌మెంట్‌ జోన్లు ఉండగా, 305 భవనాలను బీఎంసీ సీల్ చేసింది.

గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 40వేలకుపైగా కొత్త కేసులు నమోదవడగా, అందులో 60శాతం ఒక్క మహారాష్ట్రలోనే ఉండటం గమనార్హం. మహారాష్ట్ర, పంజాబ్, కేరళ, కర్నాటక, గుజరాత్ రాష్ట్రాల్లో రోజువారీ కేసులు ఎక్కువగా ఉంటున్నాయి.

4.20 కోట్ల మందికి అందిన వ్యాక్సిన్:
జనవరి 16 కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం సాగుతోంది. మార్చి 1న రెండో దశను కూడా ప్రారంభించింది. మార్చి 19 నాటికి 4కోట్ల 20లక్షల 63వేల 392 మందికి ప్రభుత్వం వ్యాక్సిన్లు వేసింది. నిన్న ఒక్కరోజే 27,23,575 మంది టీకాలు వేయించుకున్నారు.

తెలంగాణలో కరోనా విజృంభణ:
తెలంగాణలో కరోనా ఉధృతి కొనసాగుతోంది. గడిచిన 24గంటల్లో కొత్తగా 364 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 3,02,724కి చేరింది. రాష్ట్రంలో నిన్న(మార్చి 19,2021) రాత్రి 8 గంటల వరకు 66వేల 036 కరోనా నిర్ధరణ పరీక్షలు నిర్వహించారు. నిన్న కొవిడ్‌తో ఇద్దరు మృతిచెందారు. దీంతో ఇప్పటి వరకు మృతిచెందిన వారి సంఖ్య 1666కి చేరింది. కరోనా బారి నుంచి నిన్న 189 మంది కోలుకున్నారు.

ఇప్పటి వరకు కోలుకున్న వారి సంఖ్య 2,98,451కి చేరింది. రాష్ట్రంలో ప్రస్తుతం యాక్టివ్‌ కేసుల సంఖ్య 2,607 ఉండగా.. వీరిలో 980 మంది హోం ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో కొత్తగా 75 కేసులు నమోదయ్యాయి. తెలంగాణలో ఇప్పటి వరకు నిర్వహించిన కరోనా పరీక్షల సంఖ్య 95,48,685కి చేరింది. ఈ మేరకు వైద్య ఆరోగ్య శాఖ శనివారం(మార్చి 20,2021) ఉదయం బులిటెన్‌ విడుదల చేసింది.