5శాతం : దేశ ఆర్థికవ్యవస్థపై చిదంబరం సంచలన వ్యాఖ్యలు

  • Published By: venkaiahnaidu ,Published On : September 4, 2019 / 10:46 AM IST
5శాతం : దేశ ఆర్థికవ్యవస్థపై చిదంబరం సంచలన వ్యాఖ్యలు

మాజీ కేంద్రమంత్రి చిదంబరం సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీ ప్రభుత్వంపై తనదైన స్టైల్ లో సెటైర్ వేశారు. INX మీడియా కేసులో మాజీ కేంద్రమంత్రి చిదంబరం సీబీఐ కస్టడీలో ఉన్న విషయం తెలిసిందే. మంగళవారం కోర్టు చిదంబరం కస్టడీని సెప్టెంబర్ 5వరకు పొడగిస్తూ తీర్పునిచ్చిన తర్వాత.. కోర్టు బయట రిపోర్టర్స్ ఆయన్ను పలుకరించగారు. సీబీఐ కస్టడీ వివరాల గురించి రిపోర్టర్స్ ఆరా తీయగా.. చిదంబరం ‘5 శాతం.. మీకు తెలుసా 5శాతం  ఏంటో అంటూ పరోక్షంగా బీజేపీ ప్రభుత్వ పాలనపై సెటైర్ వేశారు. భారత్ ఆర్థిక మాంద్యం వైపు పయనిస్తోందన్న ఆందోళన వ్యక్తమవుతోన్న సమయంలో భారత్ ప్రస్తుత జీడీపీని తెలియపరచడానికి చిదంబరం తన ఐదు వేళ్లను చూపిస్తూ 5 పర్సెంట్ అంటూ పరోక్షంగా బీజేపీని టార్గెట్ చేశారు..

ప్రపంచంలో వేగంగా పురోగమిస్తున్న ఆర్థికశక్తిగా పేరు తెచ్చుకున్న భారత్.. ఈ ఏడాది ప్రారంభంలోనే ఆ ట్యాగ్ లైన్‌ను కోల్పోయింది. ఏప్రిల్-జూన్ నెలల్లో భారత్ జీడీపీ వృద్దిరేటు చైనా 6.2శాతం వృద్ది రేటు కంటే వెనుకబడిపోయింది. గడిచిన 27 ఏళ్లలో అత్యంత కనిష్ట జీడీపీ నమోదైంది. ప్రస్తుతం భారత జీడీపీ 5శాతానికి పడిపోయిందన్న ప్రచారం జరుగుతోంది. ఈ సమయంలో చిదంబరం పరోక్షంగా బీజేపీని విమర్శించడానికి ఫైవ్ పర్సెంట్ అంటూ టార్గెట్ చేశారు.

అయితే చిద్దూ వ్యాఖ్యలను బీజేపీ ఖండించింది. చిదంబరం ఆర్థికమంత్రిగా ఉన్న సమయంలో దేశ జీడీపీ 5కంటే తక్కువ శాతానికి పడిపోయిందని బీజేపీ ఎంపీ సుబ్రమణ్యస్వామి అన్నారు. అధికారంలో ఉన్నప్పుడు 5శాతం కమీషన్ కు అలవాటు పడిన చిదంబరం ఇప్పుడు సీబీఐ కస్టడీలో ఉండేసరికి మతిస్థిమితం కోల్పోయి మాట్లాడుతున్నారని అన్నారు.

మరోవైపు ఇప్పటికే మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కూడా దేశం ఆర్థికమాంద్యం వైపు పయనిస్తోందని ఆందోళన వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. దేశవ్యాప్తంగా పలు రంగాల్లో ఉద్యోగాలు కోల్పోతున్నారని అన్నారు. ఇప్పటికే ఆటోమొబైల్‌ రంగంలో 3.5లక్షల మంది ఉద్యోగాలు కోల్పోయారని మన్మోహన్ అన్నారు. మోడీ సర్కార్ చేతకానితనం వల్లే ఆర్థికమాంద్యం వచ్చిందని ఆయన అన్నారు. ఇప్పటికైనా కక్షపూరిత రాజకీయాలు మాని ఆర్థికవ్యవస్థపై ప్రభుత్వం దృష్టి సారించాలని ఆయన సూచించారు.