కేరళ ఎన్నికల్లో కొత్త ట్రెండ్..పార్టీల చూపు వారివైపే..విజయన్ రికార్డు సృష్టిస్తారా?

కేరళ ఎన్నికల్లో కొత్త ట్రెండ్..పార్టీల చూపు వారివైపే..విజయన్ రికార్డు సృష్టిస్తారా?

kerala కేరళ ఎన్నికల్లో ఇప్పుడు కొత్త ట్రెండ్ కనిపిస్తోంది. పాత తరానికి స్వస్తి చెప్పి..కొత్త తరానికి ప్రాధాన్యమిస్తున్నాయి ప్రధాన పార్టీలు. ఈ సారి అసెంబ్లీ ఎన్నికల్లో సీనియర్లను పక్కనబెట్టి..యువతనే ఎక్కువగా బరిలోకి దించాలని ప్రధాన పార్టీలు నిర్ణయిస్తున్నాయి. 50శాతం అసెంబ్లీ స్థానాల్లో యువత లేదా ఒక్కసారి కూడా పోటీచేయని వారినే బరిలోకి దించుతామని కాంగ్రెస్ రాష్ట్ర ఎన్నికల కమిటీ నేత ఊమెన్‌ చాందీ శుక్రవారం ప్రకటించడం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఒకప్పుడు జాతీయస్థాయిలో సైతం చక్రం తిప్పిన కాంగ్రెస్‌ నేతలు పీజే కురియన్‌, పీసీ చాకో, వీఎం సుధీరన్‌, ముళ్లపల్లి రామచంద్రన్‌.. ఈ ఎన్నికల్లో పోటీచేయబోమని ఇప్పటికే ప్రకటించారు. 70 ఏళ్లు పైబడ్డ వారెవరినీ బరిలో దింపవద్దని మరో సీనియర్‌ నేత కేవీ థామస్‌ ఏఐసీసీ నాయకత్వాన్ని కోరారు. దీంతో ఈసారి ఎన్నికల్లో సగం సీట్లు యువతకేనని ఉమెన్ చాందీ ప్రకటించారు.

ఇక, సీపీఎం కూడా రెండు, అంతకంటే ఎక్కువసార్లు పోటీచేసిన వారికి ఈసారి అవకాశం లేదని చెప్పేసింది. కొద్ది మందికి మాత్రం నిర్ధిష్ట కారణాల వల్ల ఛాన్సిస్తోంది. ఈ టూ-టర్మ్‌ నిబంధన వల్ల థామస్‌ ఐజాక్‌, రవీంద్రనాథ్‌, జయరాజన్‌లాంటి ఎనిమిది మంది కీలక మంత్రులు, స్పీకర్‌‌ ఈసారి బరిలో దిగలేని స్థితి ఏర్పడింది. ఇటీవలి పంచాయతీ ఎన్నికల్లో ఓడిపోయిన పార్టీ అభ్యర్థులను గెలిపించలేకపోయినవారికి కూడా అవకాశం ఇవ్వలేదు. అటు సీపీఐ కూడా మూడుసార్లు కంటే ఎక్కువ పోటీచేసిన వారిని, గతంలో ఓడినవారిని ఈసారి పరిగణించేది లేదని ప్రకటించింది. పాత తరానికి స్వస్తి పలకడం సాధారణంగా లెఫ్ట్‌లో కనిపించదు. తొలిసారిగా ట్రెండ్‌ మారుతోంది. గతేడాది డిసెంబర్ లో తిరువనంతపురం మేయర్ స్థానంలో 21ఏళ్ల యువతిని కూర్చోబెట్టి..యువతారానికి తాము ఇచ్చే ప్రాధాన్యం గురించి చెప్పక్కనే సీపీఐ(ఎం) చెప్పింది.

ముస్లింలు కాంగ్రెస్ తోనే ఉంటారా

కేరళ ఓటర్లు విద్యాధికులు. తమ ప్రతినిధులను ఎంపిక చేసుకునే విషయంలో చాలా లోతుగా ఆలోచిస్తారని పేరు. వర్గ సమీకరణాలు కూడా కీలక పాత్ర పోషిస్తాయి. కేరళ జనాభాలో… 54.73% హిందువులు, 26.56% ముస్లింలు, 18.38% క్రైస్తవులు ఉన్నారు. జనాభాలో అధికశాతం ఉన్నప్పటికీ రాజకీయాల్లో హిందువులది క్రియాశీల భూమిక కాదు. కాంగ్రెస్‌, వామపక్షాలకు సమానంగా ఓటేస్తుంటారు. గుంపగుత్తగా ఓటేసేది ముస్లింలేననే విశ్లేషణలు వినిపిస్తుంటాయి. అందుకే ఇండియన్‌ యూనియన్‌ ముస్లింలీగ్‌తో జట్టుకట్టిన కాంగ్రెస్‌.. 2019లోక్ సభ ఎన్నికల్లో తమ కూటమి యూడీఎఫ్‌ తరఫున 20 సీట్లకు గాను 19 స్థానాలను గెల్చుకున్న విషయం తెలిసిందే. అప్పటి కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉన్న రాహుల్ గాంధీ కూడా కేరళలోని వయనాడ్ నుంచి పోటీచేసి రాకార్డు మెజార్టీతో విజయం సాధించారు.

అయితే, గతేడాది డిసెంబర్ లో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో వామపక్ష కూటమి ఘనవిజయం సాధించింది. దీంతో కాంగ్రెస్ కూటమి మరింత అలర్ట్ అయ్యింది. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఇటీవల కేరళలో పర్యటించి..గతానికి భిన్నంగా ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. మత్యకారులతో కలిసి సముద్రంలో వేటుకు వెళ్లడమే కాక..నడిసముద్రంలో వారితో కలిసి ఈత కూడా కొట్టారు. కేరళ పర్యటనలో ఉత్తరాది వాళ్లను కేరళ వాళ్లతో పోల్చుతూ రాహుల్ చేసిన నార్త్-సౌత్ వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపిన విషయం తెలిసిందే. రాహుల్ వ్యాఖ్యలను బీజేపీ తీవ్రంగా ఖండించింది. ఇక, శబరిమల వివాదంతో, హిందూ ఓట్ల సంఘటితంతో రాష్ట్ర రాజకీయాల్లో పైకెదుగుదామని భావించిన బీజేపీ ఇప్పటికీ శక్తిగా రూపాంతరం చెందలేకపోయింది. అయితే బీజేపీ తన ఓటు షేరుని మాత్రం గతం కంటే పెంచుకోగలిగింది. ఈ ఎన్నికల్లో సీఎం అభ్యర్థిగా మెట్రో మ్యాన్ శ్రీధరన్ ని ప్రకటించి ఎన్నికల బరిలోకి దిగింది బీజేపీ. అయితే,ప్రధాన పోటీ యూడీఎఫ్-ఎల్డీఎఫ్ మధ్యనే ఉండబోతున్నదనేది సృష్టంగా తెలుస్తోంది.

అదే జరిగితే విజయన్ రికార్డు సృష్టించినట్లే

140 స్థానాలున్న కేరళ అసెంబ్లీకి ఏప్రిల్-6న ఒకే దశలో ఎన్నికలు జరగనున్నాయి. మే-2న ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. అయితే గత నాలుగున్నర దశాబ్దాల్లో కేరళలో ప్రధాన కూటముల్లో ఏ ఒకటీ వరుసగా రెండోసారి అధికారంలోకి రాలేదు. ఐదేళ్లు వామపక్ష కూటమి ఎల్డీఎఫ్‌ పాలిస్తే తదుపరి ఐదేళ్లూ కాంగ్రెస్‌ నేతృత్వంలోని యూడీఎఫ్‌ పాలించేది. ఆ లెక్కన ఈ సారి యూడీఎఫ్‌ గెలవాలి. కానీ పరిస్థితి అలా కనబడడం లేదు. ప్రీపోల్‌ సర్వేలన్నీ ఎల్డీఎఫ్ కూటమికే విజయావకాశాలు మెండుగా ఉన్నట్లు చెబుతున్నాయి. ఇదే నిజమైతే సీఎం పినరయి విజయన్‌ చరిత్ర సృష్టించినట్లే. మరోవైపు, కేరళలో గెలవడం కమ్యూనిస్టులకు అత్యావశ్యకం. దేశంలో వేరెక్కడా కమ్యూనిస్ట్ పార్టీ అధికారంలో లేదు. బెంగాల్‌లో బలహీనపడింది. త్రిపురనూ కోల్పోయింది. జాతీయ స్థాయిలోనూ సీట్లు గణనీయంగా తగ్గాయి. ఈ సమయంలో అస్తిత్వం నిలపుకోవాలంటే కేరళలో గెలవడం వారికి అత్యావశ్యకం.