టిక్రి సరిహద్దులో మరో రైతు ఆత్మహత్య

టిక్రి సరిహద్దులో మరో రైతు ఆత్మహత్య

farmer suicide నూతన వ్యవసాయ చట్టాలపై ప్రతిష్టంభన మరో రైతును బలితీసుకుంది. చట్టాలకు వ్యతిరేకంగా నిరసన చేస్తోన్న ఓ అన్నదాత ఆత్మహత్య చేసుకున్నాడు. టిక్రీ సరిహద్దుకు రెండు కిలోమీటర్ల దూరంలోని ఓ చెట్టుకు ఉరేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డాడు.

ఆత్మహత్య చేసుకున్న రైతుని హర్యాణాలోని జింద్ ప్రాంతానికి చెందిన కరమ్​వీర్ సింగ్​(52)గా పోలీసులు గుర్తించారు. ఆదివారం ఉదయం కరమ్​వీర్ మృతదేహాన్ని కనుగొన్నట్లు వెల్లడించారు. ఘటనాస్థలంలో ఓ సూసైడ్ నోట్​ను స్వాధీనం చేసుకున్నామని..దాన్ని నిర్ధరించాల్సి ఉందని పోలీసులు తెలిపారు. రైతు సోదరులారా.. మోడీ ప్రభుత్వం చర్చల కోసం తేదీల మీద తేదీలను ప్రకటిస్తోంది. ఈ నల్ల సాగు చట్టాలను ఎప్పటికి వెనక్కి తీసుకుంటారో ఎవరికీ తెలీదు అని నోట్ లో రాసి ఉంది.

కాగా,టిక్రి సరిహద్దులో ఇదే మొదటి రైతు ఆత్మహత్య కాదు. రెండు నెలలకు పైగా చట్టాల రద్దు డిమాండ్ తో నిరసన చేస్తున్నవారిలో పలువురు రైతులు ఆత్మహత్యలు చేసుకున్న విషయం తెలిసిందే. గత నెలలో హర్యాణాకు చెందిన ఓ రైతు కూడా టిక్రీ సరిహద్దు సమీపంలో విషం తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. అంతకుముందు పంజాబ్​కు చెందిన ఓ న్యాయవాది, సిక్కు మతగురువు సంత్ రామ్ సింగ్ కూడా సాగు చట్టాల ఉపసంహరణపై ప్రతిష్టంభన నేపథ్యంలో ఆత్మహత్య చేసుకున్నాడు. ఇక కొంతమంది రైతులు గడ్డకట్టే చలిని తట్టుకోలేక మరణించారు.