రైతుల ఆందోళన…సింఘూ బోర్డర్ లో సిక్కు మత బోధకుడు ఆత్మహత్య

రైతుల ఆందోళన…సింఘూ బోర్డర్ లో సిక్కు మత బోధకుడు ఆత్మహత్య

నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా దేశ రాజధాని సరిహద్దుల్లో రైతులు చేస్తున్న ఆందోళనలు 21రోజూ కొనసాగుతున్నాయి. అయితే,బుధవారం(డిసెంబర్-16,2020)సాయంత్రం ఢిల్లీ- సింఘూ సరిహద్దులో 65ఏళ్ల వయస్సున్న ఓ సిక్కు మత ప్రచారకర్త తనను తాను కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఆందోళన చేస్తోన్న రైతులకు సంఘీభావం తెలుపుతూ చనిపోతున్నట్లు ఆయన సూసైడ్ లెటర్ లో పేర్కొన్నారు. చనిపోయిన వ్యక్తిని హర్యానాలోని కర్నాల్ జిల్లాలోని సింగ్రా గ్రామానికి చెందిన బాబా రామ్ సింగ్ గా గుర్తించారు.

వారి హక్కులను కోసం పోరాడుతున్న రైతుల బాధను నేను అర్థంచేసుకోగలను… ప్రభుత్వం వారికి న్యాయం చేయనందున నేను వారి బాధను పంచుకుంటాను. అన్యాయం చేయటం పాపం, కానీ అన్యాయాన్ని సహించడం కూడా పాపం. రైతులకు మద్దతుగా, కొందరు తమ అవార్డులను ప్రభుత్వానికి తిరిగి ఇచ్చారు. నేను త్యాగం చేయాలని నిర్ణయించుకున్నాను అని సూసైడ్ లెటర్ లో బాబా రామ్ సింగ్ పేర్కొన్నారు.మృతదేహాన్ని స్వగ్రామానికి తరలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

మరోవైపు, ఆందోళనను ఉదృతం చేసిన రైతులు చిల్లా సరిహద్దు దిగ్బంధంతో ఢిల్లీ-నోయిడా జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్​ స్తంభించింది. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. అయితే, వ్యవసాయ చట్టాలను ఉపసంహరించుకోకుంటే.. ఆందోళనలు మరింత తీవ్రతరం చేయనున్నట్లు నినాదాలు చేశారు రైతులు. ఇన్ని రోజులుగా నిరసన చేస్తున్నా తమ డిమాండ్లపై కేంద్రానికి ఏమాత్రం చిత్తశుద్ధి లేదని రైతు సంఘాలు విమర్శలు చేస్తున్నాయి. కొత్త వ్యవసాయ చట్టాలను రద్దు చేయకపోతే ఈ నెల 19 నుంచి ఆమరణ నిరాహార దీక్ష చేస్తామని రైతులు ఇప్పటికే హెచ్చరించారు.

కాగా,సాగు చట్టాల్లో సంస్కరణలతో దేశవ్యాప్తంగా సానుకూల వాతావరణం నెలకొందని, దిల్లీ సరిహద్దులో చేస్తోన్న రైతుల నిరసనలు మాత్రం అందుకు మినహాయింపని కేంద్ర వ్యవసాయమంత్రి తోమర్ అన్నారు. రైతుల నిరసనలు ఒక రాష్ట్రానికే పరిమితమైనవి చెప్పారు. రైతు సంఘాలతో ప్రభుత్వం చర్చలు కొనసాగిస్తున్న క్రమంలో త్వరగా పరిష్కారం లభిస్తుందనే నమ్మకం ఉందన్నారు. అసోచామ్​ నిర్వహించిన ఓ సదస్సులో పాల్గొన్న సందర్భంగా రైతుల ఆందోళనలపై తోమర్ ఈమేరకు స్పందించారు.

అయితే, ఢిల్లీ సరిహద్దుల్లో ధర్నా చేస్తున్న రైతులను ఖాళీ చేయించాలని ఢిల్లీ వాసి రిషబ్ శర్మ వేసిన పిటిషన్‌ పై బుధవారం విచారణ జరిపిన సుప్రీంకోర్టు…కేంద్ర ప్రభుత్వం, రైతుసంఘాలకు నోటీసులు జారీచేసింది. రేపటిలోగా సమాధానం ఇవ్వాలని ఆదేశించింది. వివాద పరిష్కారానికి రైతులు, ప్రభుత్వ ప్రతినిధులతో ప్యానెల్‌ను ఏర్పాటు చేయాలని సుప్రీం కోర్టు సూచించింది. రైతుల ఆందోళన జాతీయ సమస్యగా మారే అవకాశం ఉందని సుప్రీం కోర్టు ధర్మాసనం అభిప్రాయపడింది. రైతుల ఆందోళనకు సంబంధించిన అన్ని పిటిషన్లను కలిపి విచారిస్తామని సుప్రీం పేర్కొంది.