అక్రమంగా తరలిస్తున్న రూ.3 కోట్ల విలువైన మద్యం స్వాధీనం

  • Published By: murthy ,Published On : May 2, 2020 / 03:39 PM IST
అక్రమంగా తరలిస్తున్న రూ.3 కోట్ల విలువైన మద్యం స్వాధీనం

దేశవ్యాప్తంగా లాక్ డౌన్ అమల్లో ఉండి ప్రజలంతా నిత్యావసరాలకు అల్లాడుతుంటే  అక్రమంగా లారీల్లో మద్యం తరలిస్తున్నారు ముగ్గురు వ్యక్తులు. హర్యానాలోని సోనిపట్ జిల్లాలో లారీలలో  అక్రమంగా తరలిస్తున్న 5,200 ఐఎంఎఫ్ఎల్ మద్యం బాక్సులను గుర్తించి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీటిలో 62,400 మద్యం బాటిళ్ళు ఉన్నాయి.  
 

మద్యాన్ని అక్రమంగా తరలిస్తున్నారనే ముందస్తు సమాచారంతో స్పెషల్ టాస్క్ పోర్స్ అధికారులు దాడి చేసి ఈ మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. ముర్తాల్ లోని ఒక ధాబా వద్ద ఆపి ఉంచిన కొన్ని ట్రక్కులలో  మద్యం రవాణా జరుగుతోందని విశ్వసనీయవర్గాల సమాచారం మేరకు దాడి చేసినట్లు స్పెషల్ టాస్క్ ఫోర్స్ కు చెందిన అధికారు ఒకరు చెప్పారు. ఈ మద్యం పంజాబ్ లోని డేరా బస్సీ నుంచి ఢిల్లీలోని వివిధ ప్రాంతాలలో దిగుమతి చేసేందుకు తరలిస్తున్నట్లు అధికారి తెలిపారు. 
 

మద్యం రవాణాకు సంబంధించి ముగ్గురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరిని పాటియాలాలోని అజ్రబర్ కు చెందిన మంజిత్ సింగ్, మొహాలీ లోని ముబార్కపూర్ కు చెందిన బల్విందర్ సింగ్, పంజాబ్ లోని డెరా బస్సీకి చెందిన దేవేందర్ సింగ్ లుగా గుర్తించారు. వీరిపై ముర్తల్ పోలీసు స్టేషన్లో ఎక్సైజ్ చట్టంలోని వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. పట్టుబడ్డ మద్యం విలువ బహిరంగ మార్కెట్ లో రూ. 3 కోట్లు ఉంటుందని అదికారులు తెలిపారు.