Moderna Vaccine : భారత్‌కు త్వరలో 75లక్షల మోడెర్నా టీకా డోసులు

కరోనా థర్డ్ వేవ్ ముప్పు పొంచి ఉన్న వేళ ఈ వార్త భారత్ కు గుడ్ న్యూస్ అనే చెప్పాలి. త్వరలోనే మోడెర్నా వ్యాక్సిన్‌ భారత్‌లో పంపిణీ కానుంది. భారత్‌కు 75లక్షల మోడెర్నా టీకాలు రానున్నట్లు తెలుస్తోంది.

Moderna Vaccine : భారత్‌కు త్వరలో 75లక్షల మోడెర్నా టీకా డోసులు

Moderna Vaccine

Moderna Vaccine : కరోనా థర్డ్ వేవ్ ముప్పు పొంచి ఉన్న వేళ ఈ వార్త భారత్ కు గుడ్ న్యూస్ అనే చెప్పాలి. త్వరలోనే మోడెర్నా వ్యాక్సిన్‌ భారత్‌లో పంపిణీ కానుంది. భారత్‌కు 75లక్షల మోడెర్నా టీకాలు రానున్నట్లు తెలుస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా వ్యాక్సిన్‌ పంపిణీలో అసమానతలు తలెత్తకుండా ఉండేలా చూసేందుకు డబ్ల్యుహెచ్‌ఒ రూపొందించిన కోవ్యాక్స్‌ ప్రోగ్రాం కింద.. భారత్‌కు 75 లక్షల మోడెర్నా వ్యాక్సిన్‌ డోసులను అందజేయనున్నట్లు డబ్ల్యుహెచ్‌ఒ సౌత్ ఈస్ట్ ఆసియా రీజనల్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ పూనమ్‌ ఖేత్రపాల్‌ సింగ్‌ తెలిపారు.

అయితే ఇవి దేశానికి ఎప్పుడు చేరుకుంటాయన్న విషయంపై ఇంకా స్పష్టత లేదు. ఎందుకంటే విదేశీ టీకా సంస్థలకు ఇండెమ్నిటీ అంశంపై కేంద్రం ఇంతవరకూ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. దీనిపై వ్యాక్సిన్‌ తయారీ సంస్థలు, ప్రభుత్వం మధ్య చర్చలు కొనసాగుతున్నాయి. ఇండెమ్నిటీ క్లాజ్‌పై స్పష్టత వస్తేనేగానీ.. విదేశీ టీకాలు భారత్‌లో అందుబాటులోకి వచ్చే అవకాశాలు లేవు.

భారత్‌లో మోడెర్నా టీకా అత్యవసర వినియోగానికి కేంద్రం ఇటీవల ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. ఈ టీకా డోసులు దిగుమతి చేసుకునేందుకు దేశీయ ఫార్మా సంస్థ సిప్లాకు అనుమతులు మంజూరు చేసింది. మోడెర్నా డోసుల దిగుమతిపై కేంద్రం ఎప్పటికప్పుడు ఆ సంస్థతో సంప్రదింపులు జరుపుతోంది.

ప్రపంచంలో ఫైజర్‌ వ్యాక్సిన్‌ తర్వాత అత్యధికంగా వినియోగిస్తున్న వ్యాక్సిన్‌ మోడెర్నానే. మోడెర్నా వ్యాక్సిన్‌ కరోనా వైరస్‌పై 95 శాతం సమర్థవంతంగా పనిచేస్తోందని అధ్యయనాల్లో తేలింది. ప్రస్తుతం భారత్‌లో వ్యాక్సినేషన్‌ ప్రక్రియలో దేశీయ ఉత్పత్తులైన కొవాగ్జిన్‌, కొవిషీల్డ్‌లతో పాటు రష్యాకు చెందిన స్పుత్నిక్‌లను వినియోగిస్తున్న సంగతి తెలిసిందే.