గోవా హాస్పిటల్ లో ఆక్సిజన్ కొరతతో 74మంది మృతి

గోవాలో కోవిడ్ రోగుల మరణ మృదంగం కొనసాగుతోంది. ఆక్సిజన్ అందక కరోనా బాధితులు పిట్టల్లా రాలిపోతున్నారు.

గోవా హాస్పిటల్ లో ఆక్సిజన్ కొరతతో  74మంది మృతి

74 Deaths At Goas Biggest Covid Hospital Fighting Oxygen Crisis

Goa Medical College గోవాలో కోవిడ్ రోగుల మరణ మృదంగం కొనసాగుతోంది. ఆక్సిజన్ అందక కరోనా బాధితులు పిట్టల్లా రాలిపోతున్నారు. రాజధాని పనాజీలోని గోవా మెడిక‌ల్ కాలేజీ హాస్పిటల్ లో గడిచిన నాలుగు రోజుల్లో ఆక్సిజన్​ కొరతతో 74మంది ప్రాణాలు కోల్పోయారు. మంగ‌ళ‌వారం 26 మంది,బుధ‌వారం 20 మంది, గురువారం 15 మంది,శుక్ర‌వారం ఉదయం 1గంట నుంచి 6గంటల సమయం మధ్యలో మ‌రో 13 మంది క‌రోనా రోగులు ఆక్సిజ‌న్ కొర‌త‌తో చనిపోయారు. మరోవైపు కరోనా రోగులతో గోవా మెడికల్ కాలేజీ పూర్తిగా నిండిపోయింది. కొత్త రోగులు వస్తే వారికి చోటు లేదు. నేలపైనే ట్రీట్‌మెంట్ ఇవ్వాల్సిన పరిస్థితి నెలకొంది.

గోవా ఆసుపత్రుల్లో ఆక్సిజన్​ కొరతపై విపక్షాలు తీవ్రంగా మండిపడుతున్నాయి. కోవిడ్ రోగుల మరణాలకు బాధ్యత వహిస్తూ సీఎం పదవికి ప్రమోద్​ సావంత్​ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు. గోవా ప్ర‌భుత్వం, ఆసుప‌త్రి యాజ‌మాన్యం నిర్ల‌క్ష్యంపై ప‌లువురు కోర్టును ఆశ్ర‌యించారు. బాంబే హైకోర్టు గోవా బెంచ్ ఈ పిటిష‌న్ల‌పై గ‌త నాలుగు రోజులుగా విచార‌ణ జ‌రుపుతోంది. గోవాలో ఆసుపత్రుల్లో ఆక్సిజన్​ కొరత కారణంగా ఏప్రిల్​ 30- మే 11 మధ్య 378 మంది మరణించినట్టు ప్రభుత్వం బాంబే హైకోర్టుకు గురువారం వెల్లడించింది. వ‌రుస మ‌ర‌ణాల‌పై స్పందించిన ధ‌ర్మాస‌నం గోవా ప్ర‌భుత్వంపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది. ఆక్సిజ‌న్ కొర‌త‌ను నివారించే చ‌ర్య‌లు చేప‌ట్టాల‌ని, కేంద్ర ప్ర‌భుత్వంతో సంప్ర‌దించి త‌గినంత ఆక్సిజ‌న్ స‌ర‌ఫరా అయ్యేలా చూడాల‌ని సూచించింది. ఆక్సిజ‌న్ కొర‌త వ‌ల్ల విలువైన ప్రాణాలు కోల్పోకుండా త‌గిన చ‌ర్య‌లు చేప‌ట్టాల‌ని ఆదేశించింది.

ఇక,మంగళవారం గోవా మెడిక‌ల్ కాలేజీ హాస్పిటల్ ను సందర్శించిన ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్..మెడికల్ ఆక్సిజన్ లభ్యత మరియు దాని సరఫరా మధ్య అంతరం కొన్ని సమస్యలకు కారణం కావచ్చని అన్నారు. అయితే, రాష్ట్రంలో ఆక్సిజన్ సరఫరా కొరత లేదని ఆయన నొక్కి చెప్పారు. ఆక్సిజన్ సజావుగా సరఫరా అయ్యేలా వార్డు స్థాయి వ్యవస్థను ఏర్పాటు చేస్తామని చెప్పారు. అయితే ఆక్సిజన్ లేకపోవడం వల్లే మరణాలు పెరుగుతున్నాయని గోవాకు ప్రతి రోజు 22 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ సరఫరా చేయాలని గోవా ప్రభుత్వం కేంద్రాన్ని కోరుతోంది.

మన దేశంలో గోవాలోనే అత్యధిక కరోనా పాజిటివిటీ రేటు ఉంది. దాదాపు 48.17 శాతం వరకు పాజిటివిటీ రేటు నమోదవుతోంది. అంటే అక్కడ ప్రతి ఇద్దరిలో ఒకరికి కోవిడ్ పాజిటివ్ నిర్ధారణ అవుతోంది.