EPF పై 8.15శాతం వడ్డీని ఇప్పుడే చెల్లిస్తారు, మిగతాది ఈక్విటీ రిటర్న్స్‌కు లింక్ చేస్తారు, 1977-78 తర్వాత ఇదే అతి తక్కువ వడ్డీ

  • Published By: naveen ,Published On : September 10, 2020 / 08:42 AM IST
EPF పై 8.15శాతం వడ్డీని ఇప్పుడే చెల్లిస్తారు, మిగతాది ఈక్విటీ రిటర్న్స్‌కు లింక్ చేస్తారు, 1977-78 తర్వాత ఇదే అతి తక్కువ వడ్డీ

ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్ఓ) తన ఖాతాదారులకు చెల్లించే వడ్డీ రేటును ఖరారు చేసింది. కొవిడ్ పరిస్థితుల నేపథ్యంలో 2019-20 ఆర్థిక సంవత్సరానికి ఉద్యోగుల భవిష్య నిధి (ఈపీఎఫ్)పై 8.5 శాతం వడ్డీ చెల్లించాలని నిర్ణయించింది. బుధవారం(సెప్టెంబర్ 9,2020) జరిగిన ఈపీఎఫ్ఓ సెంట్రల్ బోర్డు ట్రస్టీల సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయంతో దాదాపు 6 కోట్ల మంది ఉద్యోగులు, కార్మికులకు ప్రయోజనం చేకూరనుంది. అయితే.. మొత్తం వడ్డీ ఒకేసారి కాకుండా రెండు విడతలుగా ఖాతాల్లోకి వేస్తామని సంస్థ ప్రకటించింది. తొలి విడతగా 8.15 శాతం వడ్డీని వెంటనే చెల్లించి, మిగిలిన 0.35 శాతాన్ని డిసెంబర్ 31లోగా చెల్లిస్తామని చెప్పింది.

మిగతా వడ్డీని ఈక్విటీ ఇన్వెస్ట్ మెంట్స్ కు లింక్ చేస్తారు. ఒకవేళ అనుకున్న స్థాయిలో ఈటీఎఫ్ యూనిట్స్ రిడమ్ ప్షన్ కాకపోతే, అప్పుడు 8.15శాతం ఇంట్రస్ట్ రేటు మాత్రమే వస్తుంది. 1977-78 తర్వాత ఇదే అతి తక్కువ వడ్డీ రేటు. 1977-78లో కేవలం 8శాతం వడ్డీ రేటు చెల్లించారు.

”2019-20 ఆర్థిక సంవత్సరానికి ప్రకటించిన 8.5 శాతం వడ్డీ విషయంలో వెనక్కి తగ్గే ఆలోచన లేదు. ప్రస్తుత కరోనా పరిస్థితుల వల్ల రెండు వాయిదాల్లో వడ్డీ చెల్లించాల్సి వస్తోంది. ప్రస్తుతం మార్కెట్ పరిస్థితులు బాగాలేనందున మా పెట్టుబడుల్ని వెనక్కి తీసుకోలేకపోతున్నాం. అందుకే ఈ కొత్త ఫార్ములా ప్రకారం వడ్డీ చెల్లిస్తాం” అని ఈపీఎఫ్ఓ సెంట్రల్ బోర్డ్ ట్రస్టీ విర్జేష్ ఉపాధ్యాయ్ అన్నారు.
https://10tv.in/epfo-to-pay-interest-rate-in-two-installments-to-pf-subscribers-for-fy2020/
అంతేకాదు, నిధుల కొరతను అధిగమిచేందుకు స్టాక్ మార్కెట్ లో పెట్టుబడులు పెట్టాలన్న నిర్ణయాన్ని ఈపీఎఫ్‌వో ఎట్టకేలకు ఉపసంహరించుకుంది. కరోనా మహమ్మారి నేపథ్యంలో మార్కెట్లు స్థిరంగా లేనందు వల్ల ఆ యోచనను విరమించుకున్నట్లు సంస్థ తెలిపింది. ఈపీఎఫ్‌వో అత్యున్నత స్థాయి వ్యవస్థ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ సమావేశం మరోసారి డిసెంబర్ లో జరుగనుంది.

ఈటీఎఫ్ అమ్మకాలు, డివిడెండ్స్ ద్వారా రూ.3వేల 500 కోట్ల నుంచి రూ.4వేల కోట్ల వరకు ఆదాయం వస్తుందని లెక్కలేశారు. కరోనా వైరస్ సంక్షోభం కారణంగా మార్చిలో ఈపీఎఫ్ఓ లాభాలు పడిపోయాయి. 2019-20 ఆర్థిక సంవత్సరంలో 8.5 శాతం వడ్డీ చెల్లిస్తే ఈపీఎఫ్ఓ దగ్గర రూ.700 కోట్లు మిగులు ఉంటుంది. అయితే గత ఆర్థిక సంవత్సరంలో ఈ లెక్కలు చూస్తే మిగులు రూ.349 కోట్లు ఉండేది. కరోనా వైరస్ సంక్షోభ కాలంలో అంటే ఏప్రిల్ నుంచి ఆగస్ట్ మధ్య 94 లక్షలకు పైగా క్లెయిమ్స్ సెటిల్ చేసింది ఈపీఎఫ్ఓ. సుమారు రూ.35వేల కోట్లకు పైనే బదిలీ చేసింది.

2019-20 ఆర్థిక సంవత్సరానికి ఈపీఎఫ్ఓ ఇస్తున్న వడ్డీ 8.5 శాతం. అయితే గత ఏడేళ్లలో చూస్తే ఇది చాలా తక్కువ. అంతకుముందు 2018-19 ఆర్థిక సంవత్సరం కన్నా 15 బేసిస్ పాయింట్స్ తక్కువ. 2018-19 ఆర్థిక సంవత్సరంలో 8.65 శాతం, 2017-18 ఆర్థిక సంవత్సరంలో 8.55 శాతం, 2016-17 సంవత్సరంలో 8.65 శాతం, 2015-16 ఆర్థిక సంవత్సరంలో 8.8 శాతం, 2013-14, 2014-15 ఆర్థిక సంవత్సరాల్లో 8.75 శాతం, 2012-13 ఆర్థిక సంవత్సరంలో 8.5 శాతం వడ్డీ చెల్లించింది ఈపీఎఫ్ఓ. అంటే 2012-13 ఆర్థిక సంవత్సరంలో ఉన్న వడ్డీనే ఇప్పుడూ చెల్లిస్తోంది.

8.15శాతం ఇంట్రెస్ట్ రేటు ఇప్పుడే చెల్లిస్తామని బోర్డు చెప్పింది. అంటే రూ.58వేల కోట్లు ఇప్పుడే చెల్లిస్తారు. లిక్విడిటీ సమస్యల కారణంగా మిగతా 0.35శాతం అంటే రూ.2వేల 700 కోట్లు పెండింగ్ లో ఉంచారు. ఆమోదం కోసం ఈ ప్రపోజల్ ని ఆర్ధిక శాఖకు పంపనున్నారు. కార్మిక శాఖ కిందకు వచ్చే ఈపీఎఫ్ఓ మార్చిలో 8.5శాతం వడ్డీ రేట్ ఇస్తామని ప్రతిపాదించింది. కాగా, ఇంతవరకు ఆర్థిక శాఖ ఆమోదం కోరలేదు. కాగా, మార్చి 5న, 2019-20 సంవత్సరానికి 8.5శాతం వడ్డీ రేటు చెల్లిస్తామని చెప్పిన బోర్డు, ఈటీఎఫ్ యూనిట్స్ రిడమ్ ప్షన్ గురించి ప్రస్తావించ లేదు.

అయితే తాజాగా బుధవారం చేసిన ప్రకటన మాత్రం భిన్నంగా ఉంది. ప్రస్తుత కరోనా పరిస్థితుల్లో 8.50శాతం వడ్డీ రేటు చెల్లించాలని బోర్డు నిర్ణయం తీసుకుంది. ఇందులో 8.15శాతం వడ్డీ రేటుని డెబ్ట్ ఇన్ కమ్ నుంచి ఇస్తారు. మిగతా 0.35 శాతం వడ్డీ రేటుని ఈటీఎఫ్ ను అమ్మడం ద్వారా వచ్చిన డబ్బుతో చెల్లిస్తారు. అది కూడా డిసెంబర్ 31లోగా.