రాజ్యసభలో అగ్రి మంటలు.. 8మంది ఎంపీలపై వేటు, వారం పాటు సస్పెన్షన్

  • Published By: naveen ,Published On : September 21, 2020 / 10:56 AM IST
రాజ్యసభలో అగ్రి మంటలు.. 8మంది ఎంపీలపై వేటు, వారం పాటు సస్పెన్షన్

వ్యవసాయ బిల్లుపై చర్చ సందర్భంగా ఛైర్మన్‌ పోడియం దగ్గర నిరసన తెలిపిన రాజ్యసభ ఎంపీలపై వేటు పడింది. సభలో అనుచితంగా వ్యవహరించారంటూ 8మంది ఎంపీలను వారం రోజుల పాటు సస్పెండ్ చేశారు. మంత్రి ప్రహ్లాద్‌ జోషి సస్పెన్షన్‌ తీర్మానాన్ని ప్రవేశపెట్టగా రాజ్యసభ ఛైర్మన్‌ వెంకయ్యనాయుడు దాన్ని ఆమోదించారు. సస్పెన్షన్‌ను వ్యతిరేకిస్తూ ఎంపీలు నినాదాలు చేశారు. దీంతో సభలో కాసేపు గందరగోళం నెలకొంది. వివేక్‌ ఓబ్రెయిన్‌, నాసిర్‌ హుస్సేన్‌, సంజయ్‌సింగ్‌, రుపిన్‌ బోరా, డోలాసేన్‌, రాజీవ్‌ వాస్తవ్‌, కేకే రాజేశ్‌, కరీమ్‌లు వేటు పడిన వారిలో ఉన్నారు.

వివాదాస్పద వ్యవసాయ రంగ బిల్లులపై రాజ్యసభలో రభస జరిగింది. విపక్ష సభ్యులపై వేటు పడింది. ఇవాళ(సెప్టెంబర్ 21,2020) ఉదయం సభ ప్రారంభమైన కాసేపటికే 8మంది ఎంపీలను వారం రోజుల పాటు సభ నుంచి బహిష్కరిస్తున్నట్టు వెంకయ్యనాయుడు ప్రకటించారు. ప్రతిపక్ష సభ్యులపై చర్యలు తీసుకోవాలంటూ బీజేపీ ఎంపీలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు చైర్మన్ ఈ నిర్ణయం తీసుకున్నారు.

రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరివంశ్ పట్ల విపక్ష సభ్యులు ‘‘అనుచితంగా’’ వ్యవహరించారని… దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నానని చైర్మన్ వెంకయ్య అన్నారు. ఆదివారం(సెప్టెంబర్ 20,2020) రాజ్యసభలో వ్యవసాయ రంగ బిల్లులను ప్రవేశపెట్టిన సందర్భంగా ప్రతిపక్షాలు తీవ్ర నిరసన వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. సభలో తగిన సంఖ్యాబలం ఉన్నప్పటికీ.. మూజువాణి ఓటుద్వారా వ్యవసాయ బిల్లులను ఆమోదించుకునేందుకు కేంద్రం ప్రయత్నించడంపై ప్రతిపక్షాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి.