శ్రామిక్ రైళ్లలో 80మంది మృతి.. అందులో ఒకరికి కరోనా!

  • Edited By: vamsi , May 31, 2020 / 08:05 AM IST
శ్రామిక్ రైళ్లలో 80మంది మృతి.. అందులో ఒకరికి కరోనా!

వలస కార్మికుల కోసం వేసిన ప్రత్యేక రైళ్లలో ఇప్పటివరకు 80మంది చనిపోయినట్లుగా నివేధికలు వచ్చాయి. ఈస్ట్ సెంట్రల్ రైల్వే జోన్, నార్త్ ఈస్టర్న్ రైల్వే జోన్, నార్తరన్ రైల్వే జోన్ మరియు నార్త్ సెంట్రల్ రైల్వే జోన్ సహా పలు మండలాల్లో ఈ మరణాలు సంభవించాయి.

ఈ క్రమంలోనే రైల్వే మంత్రి పియూష్ గోయల్‌ కూడా ప్రయాణీకులకు ఈమేరకు అప్పీల్ చేశారు. “తీవ్రమైన అనారోగ్యాలతో బాధపడుతున్న ప్రజలు, గర్భిణీ స్త్రీలు మరియు 65 సంవత్సరాలు మరియు 10 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్నవారు శ్రామిక్ రైళ్లలో అవసరమైతే మాత్రమే ప్రయాణించాలని విజ్ఞప్తి చేస్తున్నాను” ఆయన ప్రజలకు అప్పీల్ చేశారు.

మొత్తం 3,840 రైళ్లలో 52 లక్షల మంది వలసదారులను వారి గమ్య స్థానాలకు చేర్చగా.. రైల్వే బోర్డు చైర్మన్ వికె యాదవ్ విలేకరుల సమావేశంలో ఈ విషయాన్ని వెల్లడించారు. వలస వచ్చినవారు ఆకలితో మరణించారనే ఆరోపణలు వచ్చాయి. 

అయితే మరణించిన వారిలో ఎక్కువ మంది “దీర్ఘకాలిక రోగులు” అని రైల్వేశాఖ ఇప్పటికే స్పష్టం చేసింది. ఇప్పటివరకు 80 మంది వలస కార్మికులు చనిపోగా.. అందులో ఒకరు కరోనా వైరస్‌తో మరణించగా, మిగిలినవారి మరణాలకు అనారోగ్య సమస్యలు సహా విభిన్న కారణాలున్నట్లు ఆ వర్గాలు చెప్పాయి. మే 9 నుంచి 27 మధ్య ఈ మరణాలు సంభవించినట్లుగా రైల్వేశాఖ ప్రకటించింది.