ముగిసిన ‘ఆరే’ వివాదం : 800 ఎకరాలను అటవీ ప్రాంతంగా ప్రకటించిన ఉద్ధవ్

  • Published By: venkaiahnaidu ,Published On : October 11, 2020 / 09:26 PM IST
ముగిసిన ‘ఆరే’ వివాదం : 800 ఎకరాలను అటవీ ప్రాంతంగా ప్రకటించిన ఉద్ధవ్

Mumbai’s Aarey Declared Forest మెట్రో కార్ షెడ్ నిర్మించతలపెట్టిన ముంబైలోని ఆరే ప్రాంతంలోని 800 ఎకరాల భూమిని రిజర్వ్ అటవీ ప్రాంతంగా మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ థాక్రే ప్రకటించారు. మెట్రో రైల్ ప్రాజెక్టులో భాగంగా ఇక్కడ నిర్మించాలని భావించిన వివాదస్పద కార్ షెడ్‌ను కంజుర్‌ మార్గ్‌కు తరలించనున్నట్లు ఉద్దవ్ ప్రకటించారు. అది ప్రభుత్వానికి చెందిన భూమి కావడంతో ప్రాజెక్టు వ్యయం కూడా పెరుగదన్నారు. ఆరే ప్రాంతంలో ఇప్పటికే నిర్మించిన భవనాన్ని ఇతర ప్రజా ప్రయోజనాల కోసం వినియోగిస్తామని తెలిపారు. ముంబై నగరానికి ఊపిరిగా భావించే సహజమైన అడవులతో కూడిన ఆరే ప్రాంతంలోని జీవవైవిధ్యాన్ని కాపాడాల్సిన అవసరం ఉందన్నారు. ‘ఆరే రక్షించబడింది’ అంటూ ఈ సందర్భంగా ఉద్ధవ్ కుమారుడు, మహారాష్ట్ర పర్యావరణ శాఖ మంత్రి ఆదిత్య ఠాక్రే ట్వీట్ చేశారు.


కాగా, మెట్రో రైల్ కార్ షెడ్ ఏర్పాటుకోసం ముంబైకి ఊపిరిగా పేర్కొనే ఆరే ప్రాంతంలో 2,700 చెట్లను నరికివేయాలని గతంలో అప్పటి బీజేపీ ప్రభుత్వం నిర్ణయించగా..దీనికి నిరసనగా పర్యావరణ వేత్తలు, స్థానికులు గత ఏడాది సెప్టెంబర్-అక్టోబర్ మధ్యలో పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. ఆరే ప్రాంతంలోని చెట్లను నరకవద్దంటూ పర్యావరణ ప్రేమికులు, స్వచ్చంధ సంస్థలు, పలువురు బాలీవుడ్ నటీనటులు గళమెత్తారు. అప్పుడది కోర్టువరకు వెళ్లి పెను వివాదంగా మారింది.



అయితే ఆరేను అటవీ ప్రాంతంగా ప్రకటించేందుకు కోర్టు నిరాకరించింది. అలాగే చెట్లను నరికేందుకు అనుమతించాలన్న ముంబై కార్పొరేషన్ పిటిషన్‌ను కూడా తిరస్కరించలేదు. దీంతో అర్థరాత్రి వేళ బుల్డోజర్స్‌తో చెట్లను తొలగించేందుకు అధికారులు ప్రయత్నించగా విషయం తెలిసిన నిరసన కారులు భారీగా అక్కడకు చేరుకుని అడ్డుకున్నారు. మరోవైపు దీనిపై జోక్యం చేసుకోవాలని కోరుతూ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి న్యాయ విద్యార్థులు లేఖ రాశారు. స్పందించిన సుప్రీంకోర్టు చెట్ల తొలగింపుపై తాత్కాలిక స్టే విధించింది. అనంతరం దీనిని డిసెంబర్ వరకు పొడిగించింది. అయితే అప్పటికే అవసరమైనంత పరిధిలో చెట్లను తొలగించినట్లు నాటి బీజేపీ ప్రభుత్వం తెలిపింది. దీంతో చెట్లు తొలగించిన ప్రాంతంలో మెట్రో కార్ షెడ్ నిర్మాణంపై స్టే విధించలేమని కోర్టు చెప్పింది.


మరోవైపు నవంబర్‌లో జరిగిన మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అధికారం కోల్పోగా భాగస్వామ్య పార్టీ అయిన శివసేన అనంతర పరిణామాలతో ఎన్సీపీ, కాంగ్రెస్‌తో కలిసి సీఎం ఉద్ధవ్ ఠాక్రే ఆధ్వర్యంలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడింది. దీంతో ఇప్పుడు ఆరేను సంరక్షిత అటవీ ప్రాంతంగా మార్పు చేసినట్లు ఆదివారం ఉద్ధవ్ ఠాక్రే పేర్కొన్నారు. ఇప్పుడు ఈ మెట్రో కార్ షెడ్ ప్రాజెక్టుపై సందిగ్ధత తొలగిపోయిందని, ఈ కార్ షెడ్ ను కంజు మార్గ్ అనే చోటికి షిఫ్ట్ చేస్తామని థాక్రే తెలిపారు. అంతేకాకుండా, గతంలో ఆరేలోని చెట్లను తొలగించవద్దంటూ ఆందోళనలు చేసిన నిరకారులు, చెట్లను నరికేందుకు ప్రయత్నించిన అధికారులను అడ్డుకున్నవారిపై పెట్టిన పోలీసు కేసులను ఎత్తివేయాలని ఉద్ధవ్ ఆదేశించారు.