అయోధ్య రామాలయానికి రూ. కోటి ఇచ్చిన సాధువు!!

అయోధ్య రామాలయానికి రూ. కోటి ఇచ్చిన సాధువు!!

1 crore for Ram temple : అయోధ్య రామ మందిరం నిర్మాణానికి విరాళాలు వెల్లువెత్తుతున్నాయి. సామాన్యుడి నుంచి మొదలుకుని ప్రముఖులు సైతం విరాళాలు ఇస్తున్నారు. నిర్మాణానికి సంబంధించి విశ్వ హిందు పరిషత్ విరాళాలు సేకరిస్తోంది. తాజాగా..83 సంవత్సరాలున్న ఓ సాధువు రూ. కోటి అందించడం విశేషం. చెక్ తో బ్యాంకుకు చేరుకున్న ఆ సాధువును చూసి..బ్యాంకు సిబ్బంది ఆశ్చర్యపోయారు. దీనికి సంబంధించి వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

షికేశ్ నీలకాంత్ రిషికేశ్ లో ఉన్న ఓ గుహలో స్వామి శంకర్ దాస్ నివాసం ఉంటున్నారు. ఇతని వయస్సు 83 ఏళ్లు. కోటి రూపాయల చెక్ తో బ్యాంకుకు చేరుకున్నారు. చెక్ చూసిన బ్యాంకు సిబ్బంది ఆశ్చర్యపోయారు. చెక్ కు సంబంధించిన వివరాలను తనిఖీ చేసిన తర్వాత..అందుకు అవసరమైన నగదు బ్యాంకులో ఉన్నట్లు నిర్ధారించుకున్నారు. ఆర్ఎస్ఎస్ జిల్లా డైరెక్టర్ సుదామా సింఘాల్ కు కోటి రూపాయలు విలువైన చెక్ ను అందచేశారు. డబ్బులను శ్రీ రామ్ ఆలయానికి మాత్రమే జమ చేయాలని స్వామి శంకర్ దాస్ కోరారు.

ఈ సమాచారం తెలుసుకున్న ఇన్ ఛార్జి రణదీప్ పొఖ్రియా దాస్ సాధువును ప్రశంసించారు. తాము ఇప్పటి వరకు రూ. 5 కోట్ల విరాళాలను సేకరించినట్లు, భక్తి ద్వారా…ముందుకు వస్తున్న వారి సంఖ్య అధికంగా పెరుగుతోందన్నారు. నైనిటాల్ లో ఉన్న పదేళ్ల బాలిక తాను దాచుకున్న కిడ్డీ బ్యాంకులో నుంచి ఆలయానికి రూ. 2500 విరాళంగా ఇచ్చింది. 14 వేల 526 గ్రామాలు, ఉత్తరాఖండ్ లోని 73 పట్టణాల్లోని 24 లక్షల కుటుంబాలను సందర్శిస్తామని వీహెచ్ పీ ప్రకటించిన సంగతి తెలిసిందే. ప్రచారంలో సేకరించిన విరాళాల వివరాలు తెలుసుకోవడానికి సంస్థ వివిధ కమిటీలను ఏర్పాటు చేసింది. సేకరించిన విరాళం డబ్బును వీహెచ్ పీ పేర్కొన్న బ్యాంకు ఖాతాకు 48 గంటల్లోగా జమ చేయాల్సి ఉంటుంది.

అర శతబ్దానికి పైగా గుహలో నివాసం ఉండడం జరుగుతోందని, గుహను సందర్శించే భక్తులు తనకు డబ్బులు ఇవ్వడం జరుగుతోందన్నారు స్వామి శంకర్ దాస్. అయోధ్యలోని రామాలయం నిర్మాణానికి వీహెచ్ పీ విరాళాలు సేకరిస్తోందనే విషయం తెలుసుకోవడం జరిగిందన్నారు. చాలాకాలంగా కలలు కంటున్న రామాలయం నిర్మాణం అవుతోందని తెలుసుకుని సంతోష పడడం జరిగిందని, తాను దాచుకున్న సొమ్మును విరాళంగా ఇవ్వాలని నిర్ణయం తీసుకోవడం జరిగిందన్నారు.