Stan Swamy : ఎల్గార్ పరిషద్ కేసు నిందితుడు స్టాన్ స్వామి కన్నుమూత

ఎల్గార్ పరిషద్ కేసులో ఉగ్రవాద వ్యతిరేక చట్టం కింద గతేడాది అరెస్ట్ అయిన ఆదివాసి హక్కుల ఉద్యమకారుడు స్టాన్ స్వామి గుండెపోటుతో మరణించారు.

Stan Swamy ఎల్గార్ పరిషద్ కేసులో ఉగ్రవాద వ్యతిరేక చట్టం కింద గతేడాది అరెస్ట్ అయిన ఆదివాసి హక్కుల ఉద్యమకారుడు స్టాన్ స్వామి గుండెపోటుతో మరణించారు. ముంబై బాంద్రాలోని హోలీ ఫ్యామిలీ హాస్పిటల్​లో ట్రీట్మెంట్ పొందుతూ సోమవారం మధ్యాహ్నం 1.30 గంటలకు స్టాన్ స్వామి తుదిశ్వాస విడిచారని హాస్పిటల్ డైరెక్టర్ డాక్టర్ ఇయాన్ డిసౌజా తెలిపారు.

మహారాష్ట్రలోని బీమా-కోరేగావ్‌లో 2018 జనవరిలో చోటుచేసుకున్న అల్లర్లలో మావోయిస్టుల కుట్ర ఉందని ఆరోపణలు ఉన్నాయి. ఈ కేసులో భాగంగా స్టాన్ స్వామిని 2020 అక్టోబర్​లో ఎన్ఐఏ అరెస్టు చేసింది. అప్పటి నుంచి ఆయన ముంబై సమీపంలోని తలోజా జైల్లోనే ఉంటున్నారు. అయితే ఆ జైలులో ఉన్న స్టాన్ స్వామి సహా ఇతర నిందితులు అక్కడ ఆరోగ్య పరమైన సౌకర్యాలు లేవని పలుమార్లు ఆరోపించారు. వైద్యసాయం, టెస్టులు, పరిశుభ్రత, సామాజిక దూరం వంటివి అమలు చేయడంలో జైలు అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తన ఆరోగ్యం రోజురోజుకు క్షీణిస్తోందని మే నెలలో బాంబే హైకోర్టుకు వీడియో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా స్టాన్ స్వామి తెలిపారు. తనకు మధ్యంతర బెయిలు ఇవ్వాలని, ఇక్కడ పరిస్థితులు ఇలాగే కొనసాగితే తాను త్వరలోనే చనిపోవడం ఖాయమని ఆవేదన వ్యక్తం చేశారు.

కోర్టు ఆదేశాలతో మే 28న హోలీ ఫ్యామిలీ హాస్పిటల్ కు తరలించి చికిత్స అందిస్తున్నారు. అయితే అనారోగ్య కారణాల రీత్యా తనకు బెయిల్ మంజూరు చేయాలని స్టాన్ స్వామి గత వారం బాంబే హైకోర్టుకి దరఖాస్తు చేసుకున్నారు. అయితే ఆదివారం నాటికి స్టాన్ స్వామి ఆరోగ్యం విషమించడంతో ఆయన మెడికల్ బెయిల్ విజ్ణప్తిపై అత్యవసర విచారణ చేపట్టాలని స్వామి తరపు లాయర్లు సోమవారం ఉదయమే బాంబే హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌పై విచారణ మధ్యాహ్నం 2.30 జరగాల్సి ఉంది. అయితే తాజాగా ఆయన మరణించినట్టు స్వామి తరపు న్యాయవాది బాంబే హైకోర్టుకు తెలిపారు. అయితే, స్వామికి సరైన చికిత్స అందించలేదని ఆయన తరఫు న్యాయవాది మిహిర్ దేశాయ్ ఆరోపించారు. ఈ విషయంలో తలోజా జైలు అధికారులు నిర్లక్ష్యం వహించారని అన్నారు. స్టాన్ స్వామి మరణం పట్ల కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాంధీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు.

ట్రెండింగ్ వార్తలు