కరోనా నుంచి కోలుకున్నా, 90శాతం మందిలో ఊపిరితిత్తుల సమస్యలు, స్టడీ

  • Published By: naveen ,Published On : August 6, 2020 / 11:42 AM IST
కరోనా నుంచి కోలుకున్నా, 90శాతం మందిలో ఊపిరితిత్తుల సమస్యలు, స్టడీ

”హమ్మయ్య, మాయదారి రోగం నుంచి కోలుకున్నాం. ప్రాణ గండం తప్పింది. ఇక భయం లేదు. హాయిగా మిగతా జీవితం బతికేయొచ్చు” అని కరోనా నుంచి కోలుకున్న తర్వాత రిలాక్స్ అవుతున్నారా? ఇక ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేవని భావిస్తున్నారా? అలాంటి వారికి ఇది షాకింగ్ న్యూస్ అనే చెప్పాలి. కరోనా నుంచి కోలుకున్నవారిలో ఇప్పటికే గుండె సమస్యలు బయటపడ్డాయి. తాజాగా మరో బ్యాడ్ న్యూస్ వెలుగుచూసింది. కరోనా నుంచి కోలుకున్న తర్వాత 90శాతం మందిలో ఊపిరితిత్తుల సమస్యలు గుర్తించారు. వారిలో ఊపిరితిత్తులు దెబ్బతిన్నాయి. శ్వాసకోశ వ్యవస్థ పూర్తిగా మెరుగుపడలేదు. అంతేకాదు మరోసారి కొవిడ్ బారిన కూడా పడ్డారు. చైనాలోని వుహాన్ సిటీలో నిపుణుల అధ్యయనంలో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.



90శాతం మందిలో లంగ్ డ్యామేజ్:
స్థానిక మీడియా కథనాల ప్రకారం, కొవిడ్ నుంచి కోలుకున్న వారిలో 90శాతం మంది లంగ్ డ్యామేజ్ తో బాధపడుతున్నట్టు గుర్తించారు. అలాగే వారిలో 5శాతం మంది రెండోసారి కరోనా బారిన పడినట్టు తెలిసింది. వుహాన్ యూనివర్సిటీకి చెందిన జోంగాల్ ఆసుపత్రి బృందం, ప్రొఫెసర్ పెంగ్ జియాంగ్ నేతృత్వంలో కరోనా నుంచి కోలుకున్న 100మంది వ్యక్తులపై అధ్యయనం చేశారు. ఏప్రిల్ నెల నుంచి ఈ స్టడీ జరిగింది. దీనికి సంబంధించిన తొలి ఏడాది కార్యక్రమం జూలై నెలతో ముగిసింది.

ఇంకా పూర్తిగా కోలుకోని ఊపిరితిత్తులు:
59ఏళ్ల వయసున్న వారిపై అధ్యయనం చేశారు. తొలి దశ స్టడీ రిజల్ట్స్ ప్రకారం కరోనా నుంచి కోలుకున్న 90శాతం మందిలో ఇంకా ఊపిరితిత్తులు దెబ్బతిన్న స్థితిలోనే ఉన్నాయి. లంగ్ డ్యామేజ్, అంటే, ఊపిరితిత్తుల్లో వెంటిలేషన్, గ్యాస్ మార్పిడి వ్యవస్థలు ఇంకా పూర్తిగా కోలుకోలేదు. ఆరోగ్యంగా ఉన్న వ్యక్తుల్లో ఊపిరితిత్తులు ఏ విధంగా పని చేస్తాయో ఆ విధంగా వీరిలో పని చేయడం లేదు. అలాగే ఆరు నిమిషాల వాకింగ్ టెస్ట్ కూడా పెట్టారు. కరోనా నుంచి కోలుకున్న వారు 6 నిమిషాల్లో 400 మీటర్లు మాత్రమే నడవగలుగుతున్నారు. అదే ఆరోగ్యంగా ఉన్న వారు అదే 6 నిమిషాల్లో 500 మీటర్లు నడవగలుగుతున్నారు. ఇక కొవిడ్ నుంచి కోలుకున్న వారిలో కొంతమంది ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయిన తర్వాత మూడు నెలల పాటు ఆక్సిజన్ పరికరాల మీద ఆధారపడుతున్నారు.



కోలుకున్న తర్వాత మరోసారి వైరస్ సోకింది:
లియాంగ్ బృందం కరోనా నుంచి కోలుకున్న 65ఏళ్ల వయసు ఉన్న వారిపైనా స్టడీ చేసింది. 65ఏళ్ల వయసు వారిలో 5శాతం మందిలో కొవిడ్ 19 న్యూక్లిక్ యాసిడ్ టెస్టులో నెగిటివ్ వచ్చింది. కాగా, ఇమ్యునోగ్లోబిన్ ఎం(IgM) టెస్టులో పాజిటివ్ రావడంతో మరోసారి వారందరిని క్వారంటైన్ చేయాల్సి వచ్చింది. ఇమ్యునోగ్లోబిన్(IgM) అంటే అది ఓ యాంటి బాడీ. ఏదైనా వైరస్ మన శరీరంపై దాడి చేసినప్పుడు మనలోని రోగనిరోధక వ్యవస్థ(Immune) దాన్ని ఉత్పత్తి చేస్తుంది. IgM టెస్టులో పాజిటివ్ అని రిజల్ట్ వచ్చిందంటే దాని అర్థం ఆ వ్యక్తికి వైరస్ సోకింది అని. అయితే ఆ వ్యక్తులు మరోసారి వ్యాధి బారిన పడ్డారా అనేదానిపై మాత్రం ఇంకా స్పష్టత లేదు.

పూర్తిగా కోలుకోని రోగనిరోధక వ్యవస్థ:
65ఏళ్ల వయసు వ్యక్తులపై చేసిన స్టడీలో 100మందిలో ఇంకా రోగనిరోధక వ్యవస్థ పూర్తిగా రికవరీ కాలేదని తెలిసింది. వారిలో బీ సెల్స్ చాలా తక్కువ స్తాయిలో ఉన్నట్టు గుర్తించారు. మనిషి దేహంలో ఏదైనా వైరస్ ప్రవేశిస్తే వాటిని చంపడంలో బీ సెల్స్ ప్రముఖ పాత్ర పోషిస్తాయి. దీని ద్వారా అర్థం అయ్యింది ఏంటంటే, ఆ వ్యక్తుల్లో రోగనిరోధక వ్యవస్థలు ఇంకా కోలుకునే స్థితిలో ఉన్నాయని పెంగ్ చెప్పారు.



కరోనా నుంచి కోలుకున్నాక డిప్రెషన్:
ఊపిరితిత్తుల వ్యవస్థ డ్యామేజ్ కావడంతో పాటు వారిలో డిప్రెషన్ కూడా గుర్తించారు. దీనికి కారణం కుటుంబసభ్యుల ప్రవర్తన. కరోనా నుంచి కోలుకుని ఇంటికి వెళ్లాక కుటుంబసభ్యులు వారితో కలిసి భోజనం చేయడానికి ఇష్టపడటం లేదు. ఈ కారణంగా వారు డిప్రెషన్ కు లోనవుతున్నారు. కరోనా నుంచి కోలుకున్న వారిలో సగం కంటే తక్కువ మంది మాత్రమే తిరిగి పనులకు హాజరవుతున్నారు.