నాడు ఛీ కొట్టిన వారే నేడు జేజేలు పలుకుతున్నారు.. ఇండియా తొలి ట్రాన్స్ జెండర్ బ్యాండ్ మెంబర్ కోమల్ జగ్తాప్ సక్సెస్ స్టోరీ

నాడు ఛీ కొట్టిన వారే నేడు జేజేలు పలుకుతున్నారు.. ఇండియా తొలి ట్రాన్స్ జెండర్ బ్యాండ్ మెంబర్ కోమల్ జగ్తాప్ సక్సెస్ స్టోరీ

A Braveheart’s Journey to India’s 1st Transgender Band: 6 ప్యాక్ బ్యాండ్ (6 Pack Band). దేశంలోనే తొలి ట్రాన్స్ జెండర్ బ్యాండ్(Transgender Band). షమీర్ టాండన్ ఆధ్వర్యంలో రూపుదిద్దుకుంది. యష్ రాజ్ ఫిలిమ్స్ ప్రైవేట్ లిమిటెడ్ కి చెందిన వై ఫిలిమ్స్ ఈ బ్యాండ్ ని 2016లో లాంచ్ చేసింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఈ బ్యాండ్ తమకంటూ ఓ గుర్తింపు తెచ్చుకుంది. ఈ బ్యాండ్ ఆధ్వర్యంలో వచ్చిన సాంగ్స్ పాపులర్ అయ్యాయి.

ఈ గ్రూప్ లో మొత్తం ఆరు మంది సభ్యులు అన్నారు. అందుకే 6 బ్యాండ్ అనే పేరు వచ్చింది. ఫిదా ఖాన్, రవీనా జగ్తాప్, ఆశా జగ్తాప్, చాందిని సువర్ణాకర్, భవికా పటేల్, కోమల్ జగ్తాప్.. ఇప్పటికే వీరి బృందం 5 మ్యూజిక్ వీడియోలు చేసింది. సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖులు హృతిక్ రోషన్, అర్జున్ రాంపాల్, సింగర్ సోనూ నిగమ్ లాంటి వాళ్లతో కలిసి మ్యూజిక్ వీడియోస్ రూపొందించారు.

ఈ బృందంలో ప్రముఖంగా చెప్పుకోవాల్సింది కోమల్ జగ్తాప్ గురించే. బాల్యంలోనే ఆమె ఎన్నో బాధలు అనుభవించింది. ఇంట్లోనే నిరాదరణ ఎదురైంది. అయినవాళ్లే ఛీ కొట్టారు. చీదరించుకున్నారు, అవమానించారు. కోమల్ జగ్తాప్ తన గతాన్ని గుర్తు చేసుకున్నారు. పదేళ్ల వయసులో కుటుంబసభ్యులే తనను ఛీకొట్టి ఇంట్లో నుంచి తరిమేశారని వాపోయింది. తన హావభావాలు తన కుటుంబసభ్యులనే ఇబ్బందికి గురి చేశాయని చెప్పింది. అబ్బాయిలతోనే ఆడుకోవాలని తనపై కుటుంబసభ్యులు ఒత్తిడి చేసేవారంది. మగపిల్లలు తనను వేధించే వారిని, ఎగతాళి చేసేవారని, ఆట పట్టించేవారని చెప్పింది.

కుటుంబసభ్యులు, చుట్టుపక్కల వారి నుంచి నిరాదరణ ఎదురుకావడంతో విసిగిపోయిన కోమల్ జగ్తాప్, పదేళ్ల వయసులో ఇంట్లో నుంచి బయటకు వచ్చేసింది. ఒట్టి చేతులతో రైల్వే స్టేషన్ కి వెళ్లింది. అక్కడ పుణె వెళ్లే రైలు కోసం వేచి చూసింది. ‘ఆ వయసులో ఇంటి నుంచి బయటకు వచ్చేయడం, బయట బతకడం అంత సులువు కాదని తెలుసు. కానీ ధైర్యం చేసింది. ట్రాన్స్ జెండర్ల కోసం పుణెలో ఏర్పాటు చేసిన ఎన్జీవో గురించి తెలుసుకున్నాను. వారి దగ్గరికి వెళ్లాలని అనుకున్నా. అందుకే పుణె వెళ్లే ట్రైన్ కోసం గంటల తరబడి వేచి చూశాను. చివరికి ఓ ట్రాన్స్ జెండర్ నా దగ్గరికి వచ్చింది. నన్ను నా గురువు దగ్గరికి తీసుకెళ్లింది. అలా నా కొత్త జీవితం ప్రారంభమైంది’ అని కోమల్ జగ్తాప్ తన గతాన్ని గుర్తు చేసుకుంది.

కోమల్ 9వ తరగతి వరకు చదువుకుంది. ఆ తర్వాత బంధువుల ఇళ్లలో జరిగే వేడుకలు, పెళ్లిల్లో పాటలు పాడటం, డ్యాన్స్ చేయడం మొదలు పెట్టింది. అది మాత్రమే ఆమెకు ఆదాయ మార్గం. ఏదైనా వేడుక జరిగినప్పుడు ఎవరైనా తనను ఆహ్వానిస్తే చాలా ఆనందపడేది. అదే సమయంలో కొందరి ప్రవర్తన తనను బాధించేదంది.

”పిల్లలు మమ్మల్ని చూసి పారిపోయేవారు. యువత అసలు మావైపు చూసే వాళ్లే కాదు. కొంతమంది మగవాళ్లు చాలా నీచమైన కామెంట్స్ చేసేవాళ్లు. టీజింగ్ చేసేవాళ్లు. మేము తీవ్రమైన వివక్ష ఎదుర్కొన్నాం. మాకు ఎవరూ ఉద్యోగం ఇచ్చే వారు కాదు. సామాజిక భద్రత లేదు. అసలు మేము చేసిన తప్పు ఏంటి? అనేది ఇప్పటికీ నాకు అర్థం కాదు” అని కోమల్ వాపోతారు.

బ్యాండ్ ని స్టార్ట్ చేయాలనే ఆలోచన రావడానికి ముందు పలు హిందీ చిత్రాల్లో ట్రాన్స్ వుమెన్ గా కోమల్ నటించింది. అలాగే భూత్ నాత్ రిటర్న్స్, సావధాన్ ఇండియా లాంటి సీరియల్స్ లోనూ నటించింది. పాటలు పాడటం, నటించడం వంటి టాలెంట్ ఉన్నా ఆమెకు పరిమిత పాత్రలే ఇచ్చేవారు.

”2015లో బ్యాండ్ కోసం ఆడిషన్స్ జరుగుతున్నాయని నాకు తెలిసింది. డబ్బు సంపాదన కోసం ఆడిషన్స్ కు వెళ్లా. ట్రాన్స్ జెండర్స్ కోసం బ్యాండ్ ఏర్పాటు చేస్తున్నారని తెలిసింది. కానీ నమ్మలేదు. చివరికి 250మంది ట్రాన్స్ జెండర్స్ ను సెలెక్ట్ చేయగా, అందులో నేను ఒకదాన్ని. నా పర్సనాలిటీ, పాటలు పాడే ప్యాషన్, కెమెరా ప్రెజన్స్.. మేకర్స్ ని ఇంప్రెస్ చేశాయి. ఇతరుల కన్నా భిన్నంగా ఉన్న నా గాత్రం వారిని అట్రాక్ట్ చేసింది. అలా ఇండియాలోనే తొలి ట్రాన్స్ జెండర్స్ బ్యాండ్ తయారైంది” అని కోమల్ గుర్తు చేసుకున్నారు.

”ట్రాన్స్ జెండర్ కమ్యూనిటీకి ఓ ప్లాట్ ఫామ్ తీసుకురావాలి. మ్యూజిక్, ఎంటర్ టైన్ మెంట్ లో వారి టాలెంట్ ని ప్రపంచానికి చాటాలి. సమాజంలో ప్రతి ఒక్కరినీ సమానంగా చూసినప్పుడే, ఈ ప్రపంచం జీవించడానికి మంచి ప్రదేశంగా మారుతుంది, ” అని షమీర్ అంటారు.

6 ప్యాక్ బ్యాండ్ తొలి పాట హమ్ హై హ్యాపీ(Hum Hain Happy). బాలీవుడ్ నటి అనుష్క శర్మ నెరేషన్ తో ఈ పాట మొదలవుతుంది. ఆ తర్వాత సబ్ రబ్ దే బందే(Sab rab de bande), hil pori hila(అర్జున్ కపూర్), Ae raju(హృతిక్ రోషన్). ఈ పాటలు మ్యూజిక్ చానల్స్, రేడియాలో లో ప్రసారం అయ్యాయి. సోషల్ మీడియా వేదికల్లో పాపులర్ అయ్యాయి.

అనతి కాలంలోనే 6 ప్యాక్ బ్యాండ్ పాపులర్ అయ్యింది. వారి టాలెంట్ ని, శ్రమని అంతా గుర్తించారు. మిర్చి మ్యూజిక్ అవార్డ్స్, కపిల్ శర్మ షో, ఎకనామిక్ టైమ్స్ ఉమెన్స్ ఫోరమ్, టుమారోస్ ఇండియా గ్లోబల్ సమ్మిట్, హైదరాబాద్ లిటరరీ ఫెస్టివల్ వంటి చోట్ల పెర్ఫార్మెన్సులు ఇచ్చే వరకు వెళ్లింది. కాగా, రబ్ దే బందే.. పాట బాగా పాపులర్ అయ్యింది. యూట్యూబ్ లో 2కోట్ల 50లక్షల వ్యూస్ వచ్చాయి.

”ఈ బ్యాండ్ పెద్ద వేదికలపై ఎన్నో అవార్డులు అందుకుంది. చివరికి నా జీవితం మారింది. జనాలు నన్ను అంగీకరించారు. ఓసారి షాపింగ్ కి వెళ్లినప్పుడు ఓ కుటుంబం నా దగ్గరికి వచ్చి సెల్ఫీ తీసుకోవడం నేను జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేను. అంతేకాదు లంచ్ కి వాళ్ల ఇంటికి ఆహ్వానించారు కూడా. మా కమ్యూనిటీ నాయకులు హోర్డింగ్స్ పెడుతున్నారు. కన్సర్ట్స్ ఏర్పాటు చేస్తున్నారు. చివరికి ఆమె కుటుంబం కూడా దగ్గరికి వచ్చింది. నన్ను దగ్గరికి తీసుకుంది. మమ్మల్ని గర్వపడేలా చేశావు అని నా తమ్ముడు అంటుంటే చాలా ఆనందంగా ఉంది. ఇప్పుడు నేను నా కుటుంబంతో కలిసి పండుగలు జరుపుకుంటున్నా” అని కోమల్ జగ్తాప్ ఆనందంగా చెప్పింది.

”తల్లిదండ్రులకు నాదో విన్నపం. ట్రాన్స్ జెండర్ అని తెలిస్తే మీ పిల్లలను చీదరించకండి. దూరంగా పెట్టకండి. వారిని ప్రేమించండి. వారిని ఆదరించండి. మేము కూడా మనుషులమే అని గుర్తించండి. మాకు కూడా నైపుణ్యం, జ్ఞానం ఉంటుందని గ్రహించండి” – కోమల్ జగ్తాప్.