కరోనా పాజిటివ్ ఉన్నా..పీపీపీ కిట్లు ధరించి పెళ్లి చేసుకున్నారు

తమ వివాహ కలకు కరోనా వైరస్ అడ్డంకి కాబోదని ఓ జంట రుజువుచేసింది.

కరోనా పాజిటివ్ ఉన్నా..పీపీపీ కిట్లు ధరించి పెళ్లి చేసుకున్నారు

Ratlam

Ratlam తమ వివాహ కలకు కరోనా వైరస్ అడ్డంకి కాబోదని ఓ జంట రుజువుచేసింది. కరోనా మహమ్మారి తీవ్రంగా వ్యాపిస్తున్న ప్రస్తుత సంక్షోభ సమయంలో మధ్యప్రదేశ్ లోని రత్లం పట్టణంలోజరిగిన ఒక విచిత్రమైన పెళ్లి తంతు విశేషంగా నిలిచింది. పెళ్లి మండపంలో పీపీఈ కిట్లే పట్టు వస్త్రాలుగా ధరించి.. వేద మంత్రాల సాక్షిగా యువ జంట ఒక్కటైంది.

కరోనా విజృంభణ నేపథ్యంలో అన్ని రాష్ట్రాలతో పాటుగా మధ్యప్రదేశ్ లో కూడా ఆంక్షలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. అయితే, బంధువులు, స్నేహితుల మధ్య పిల్లల పెళ్లి వేడుక ఘనంగా నిర్వహించాలనుకున్న కుటుంబాలకు కరోనా షాక్‌ ఇచ్చింది. దీంతో కోవిడ్ ఆంక్షల మధ్యనే పెళ్లికి ఏర్పాటు చేస్తుండగానే వరుడికి కొవిడ్‌ పాజిటివ్‌గా తేలింది. ఈ నెల 19న వరుడు కరోనా బారినపడ్డాడు. దీంతో పెళ్లిని ఆపాలని తొలుత ఇరుకుటుంబాల వాళ్లు ప్రయత్నించారు. ఏదేమైనా ఆ యువ జంట మాత్రం అనుకున్న ముహుర్తానికే తమ పెళ్లి జరగాలని కోరుకుంది. అనుకున్నదే తడవుగా పీపీఈ కిట్లు ధరించి పెళ్లి మండపంలో.. వేద మంత్రాల సాక్షిగా ఒక్కటయ్యారు. పురోహితుడు భౌతికదూరం పాటిస్తూ వేదమంత్రాలను పఠిస్తుండగా.. వధువు మెడలో వరుడు తాళిబొట్టు కట్టాడు. అగ్నిహోత్రం చుట్టూ ఏడడుగులు వేసి వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. ఈ వివాహ వేడుకకు ముగ్గురు వ్యక్తులు హాజరయ్యారు. వీరందరూ పీపీఈ కిట్లు ధరించారు.

అనుమతి లేకుండా పెళ్లి జరుగుతుండడం వల్ల అధికారులు వివాహాన్ని ఆపేందుకు కల్యాణ మండపానికి వచ్చారు. కానీ పీపీపీ కిట్లు ధరించి పెళ్లి జరుగుతుండడం చూసి.. వారు కూడా ఆ యువ దంపతులను ఆశీర్వదించారు. వివాహం అనంతరం అప్పగింతల కార్యక్రమం కూడా జరిగింది. వరుడితో పాటు వధువు కూడా అదే కారులో అత్తారింటికి వెళ్లింది. కాగా, పీపీఈ కిట్లు, పూలదండలతో హోమగుండం చుట్టూ దంపతులు ప్రదక్షిణ చేస్తున్న వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అయితే ఇక్కడో విశేషంకూడా ఉంది. ప్రస్తుతం కరోనా కాలంలో కోవిడ్‌ మార్గదర‍్శకాలను ప్రజలు పాటించేలా ఒక వినూత్న ఐడియాను చేపట్టారు అధికారులు. కేవలం 10 లేదా అంతకంటే తక్కువ అతిథులతో వివాహం చేసుకోబోయే జంటలకు భీంద్ ఎస్‌పీ మనోజ్ కుమార్ సింగ్ బంపర్‌ ఆఫర్‌ ఇచ్చారు. ఈ నూతన దంపతులకు తన ఇంట్లో రుచికరమైన విందు ఇస్తామని ప్రకటించారు. అంతేకాదు ఆ జంటలకు మెమెంటోలు ఇస్తామన్నారు. కోవిడ్ మార్గదర్శకాలతో వారిని సురక్షితంగా ప్రభుత్వ వాహనంలో ఇంటికి సాగనంపుతామని కూడా వెల్లడించారు.

కాగా, రెండు రోజుల క్రితం కేరళ రాష్ట్రంలోని అలప్పుజ జిల్లాలోని మెడికల్ కాలేజీ ఆసుపత్రిలోని కోవిడ్‌ వార్డు ఓ జంటకు పెళ్లి వేదికగా మారిన విషయం తెలిసిందే. వధువు, వరుడు పీపీఈ కీట్లను ధరించి వివాహం చేసుకున్నారు.