జేబులకు చిల్లు : లీటర్ పెట్రోల్ రూ. 100

10TV Telugu News

petrol costs : చమురు కంపెనీలు వరుసగా పెట్రోల్‌, డీజిల్‌ ధరలను పెంచుతున్నాయి. ఇప్పటికే మెట్రోనగరాల్లో ఆల్‌ టైమ్‌ గరిష్ఠ స్థాయికి చమురు ధరలు చేరుకున్నాయి. పెరుగుతున్న ధరలతో సామాన్య, మధ్య తరగతి ప్రజలు బెంబేలెత్తుతున్నారు. గత మంగళవారం నుంచి దూసుకెళుతున్న ధరలు ఆదివారం కూడా అదే స్థాయిలో పెరిగిపోయాయి. వివిధ నగరాల్లో పెట్రోల్ పై 25 నుంచి 50 పైసలు, డీజిల్ పై 30 పైసల నుంచి 50 పైసల మేర పెంచుతూ…ఆయిల్ కంపెనీలు నిర్ణయించాయి.

మహారాష్ట్రలోని పర్బని జిల్లాలో పెట్రోల్ ధర ఏకంగా రూ. 100 దాటింది. ఎక్స్ట్రా ప్రీమియం పెట్రోల్‌ ధర రూ.100 దాటినట్లు పెట్రోల్‌ డీలర్స్‌ అసోసియేషన్‌ సభ్యుడు ఒకరు తెలిపారు. సాధారణ పెట్రోల్‌ ధర రూ. 97.38గా ఉంది. వాణిజ్య నగరమైన ముంబైలో పెట్రోల్ పై 28 పైసలు పెరగడంతో రూ. 95.21 చేరుకుంది. ఇక హైదరాబాద్ నగరంలో పెట్రోల్ పై 30 పైసలు, డీజిల్ పై 34 పైసలు పెరిగింది. దీంతో పెట్రోల్ ధర రూ. 92.26, డీజిల్ ధర రూ. 86.23కు చేరుకున్నాయి.

అంతర్జాతీయ మార్కెట్లో ధరలు పెరుగుతుండడంతో ఈ ప్రభావం దేశీయ ఇంధన ధరలపై భారపడుతోందని నిపుణులు పేర్కొంటున్నారు. గత 11 నెలల కాలంలో ఒక్కసారి కూడా ధరలు తగ్గలేదు. రోజురోజుకు పెరుగుతున్న ధరలతో సామాన్యులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, భారత్ పెట్రోలియం, హిందుస్థాన్ పెట్రోలియం సంస్థలు ప్రతీరోజు ఉదయం 6 గంటలకు పెట్రోలు ధరలను సడలిస్తాయి.

అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడ్ ఆయిల్ ధరను బట్టి మార్పు చేర్పులు ఉంటాయి. దేశంలో వ్యాట్, ఇతర పన్నుల వల్ల పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా పెరిగాయి. పెట్రోలు, డీజిల్‌ ధరలు కొన్ని రోజులుగా పోటాపోటీగా చుక్కలను తాకుతున్నాయి. దీంతో సామాన్యుల ఆర్థిక పరిస్థితి తలకిందులవుతోంది. నిత్యావసర ధరలు కొండెక్కడంతో కుటుంబంపై భారం పడుతోంది. అంతర్జాతీయ మార్కెట్లో ధరల పెరుగుదలతో చమురు సంస్థలు ఇక్కడా ధరలు పెంచుతున్నాయి. మరోవైపు అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు పెరిగాయి.

×