Vaccine War : వ్యాక్సిన్ వార్ : కరోనా వ్యాక్సిన్లపై ప్రపంచ దేశాల మధ్య కొత్త రగడ

ప్రపంచం మొత్తం కరోనా సంక్షోభంలో కూరుకుపోయింది. ఇప్పుడీ క్రైసిస్ నుంచి అన్ని దేశాలను బయటపడేసిది ఒక్క వ్యాక్సిన్ మాత్రమే. ప్రపంచం అంచుల్లో ఉన్న వాళ్ల దాకా వ్యాక్సిన్ చేరినప్పుడే.. మహమ్మారిని గెలవగలం. కానీ.. కోవిడ్ టీకాలపై ప్రపంచ దేశాల మధ్య కొత్త రగడ మొదలైంది.

Vaccine War : వ్యాక్సిన్ వార్ : కరోనా వ్యాక్సిన్లపై ప్రపంచ దేశాల మధ్య కొత్త రగడ

A New War Among The Nations Of The World On Corona Vaccine Patent Rights

Vaccine War  : ప్రపంచం మొత్తం కరోనా సంక్షోభంలో కూరుకుపోయింది. ఇప్పుడీ క్రైసిస్ నుంచి అన్ని దేశాలను బయటపడేసిది ఒక్క వ్యాక్సిన్ మాత్రమే. ప్రపంచం అంచుల్లో ఉన్న వాళ్ల దాకా వ్యాక్సిన్ చేరినప్పుడే.. మహమ్మారిని గెలవగలం. కానీ.. కోవిడ్ టీకాలపై ప్రపంచ దేశాల మధ్య కొత్త రగడ మొదలైంది. వ్యాక్సిన్లపై పేటెంట్ల విషయంలో.. రెండు వర్గాలుగా విడిపోయాయ్. కొన్ని దేశాలు.. తమ టీకాలపై పేటెంట్ వదులుకోలేమని చెబుతున్నాయ్. ఈ కష్టకాలంలో.. వ్యాక్సిన్ తయారీకి సంబంధించి టెక్నాలజీ ట్రాన్స్‌ఫర్ కాకపోతే.. మిగతా దేశాల పరిస్థితేంటి? ఇలాగైతే.. ప్రపంచంలోని ప్రతి మూలకు వ్యాక్సిన్ చేరేదెప్పుడు?

2019 డిసెంబర్ ముందు వరకు ప్రపంచంలోని ఒక్కో దేశంలో.. ఒక్కో రకమైన క్రైసిస్ ఉండేది. కానీ.. కోవిడ్-19 ఎంటరయ్యాక కొద్ది నెలల్లోనే అన్ని దేశాలను కరోనా కమ్మేసింది. ప్రపంచ దేశాలన్నీ ఒకే సంక్షోభంలో కూరుకుపోయాయ్. కోవిడ్ మహమ్మారి నుంచి బయట పడేందుకు ఎన్నో ప్రయత్నాలు చేశాయ్. వైరస్ కట్టడికి మరెన్నో చర్యలు తీసుకున్నాయ్. అయిప్పటికీ.. కరోనాకు చెక్ పెట్టలేకపోయారు. దానికోసం ప్రత్యేకంగా మెడిసిన్ కనిపెట్టలేకపోయారు. మహమ్మారిని ఎదుర్కోవాలన్నా.. కేసులు పెరగకుండా చెక్ పెట్టాలన్నా.. మందు కంటే ముందు.. వ్యాక్సిన్ కనిపెట్టాలని నిర్ణయించుకున్నారు. ప్రపంచంలోని అగ్ర దేశాలు, అభివృద్ధి చెందిన దేశాలన్నీ.. సొంతంగా వ్యాక్సిన్ మీద ప్రయోగాలు, ట్రయల్స్ పూర్తి చేశాయ్. మొత్తానికి భారత్‌తో సహా అగ్రదేశాలన్నీ సొంతంగా వ్యాక్సిన్ డెవలప్ చేసుకోగలిగాయి.

వ్యాక్సిన్ ఒక్కటే సంజీవని 
కరోనాను కట్టడి చేయలన్నా.. ప్రపంచంలోని ప్రజల ప్రాణాలు నిలబడాలన్నా.. ఇప్పుడందరి ముందు కనిపిస్తున్న సంజీవని.. వ్యాక్సిన్ ఒక్కటే. ప్రపంచం అంచుల్లో ఉన్న వాళ్లకు కూడా వ్యాక్సిన్ డోసులు వేసినప్పుడే.. ఈ మహమ్మారిని జయించినట్లు లెక్క. అప్పుడు మాత్రమే ఈ సంక్షోభం నుంచి తేరుకోగలం. ఇది జరగాలంటే అన్ని రకాల వ్యాక్సిన్లు.. అన్ని దేశాల ప్రజలకు అందుబాటులోకి రావాలి. ప్రతి దేశంలో ఒకటి, రెండు వ్యాక్సిన్లు మాత్రమే ఉత్పత్తి అవుతుండటం వల్ల.. డిమాండ్ పెరిగి సప్లై చాలా తక్కువగా ఉంటోంది. వ్యాక్సిన్ ధరలు కూడా సామాన్య జనం కొనే స్థాయిలో లేవు. అందుకే.. కామన్ పబ్లిక్ ఆర్థిక స్థోమతకు తగ్గట్లుగా.. ప్రతి ఒక్కరూ సొంతంగా వ్యాక్సిన్ కొనుక్కునే స్థాయిలో ప్రొడక్షన్ పెరగాలి. ధరలు కూడా అందుబాటులో ఉండాలి. కానీ.. ఇదంతా.. అగ్రదేశాలు తమ వ్యాక్సిన్లపై పేటెంట్లు వదులుకున్నప్పుడే.. సాధ్యమవుతుంది.

వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్‌లో  చర్చ
కోవిడ్-19 వ్యాక్సిన్లపై ఇటీవలే వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్‌లో పెద్ద చర్చ జరిగింది. వ్యాక్సిన్లపై.. మేధో సంపత్తి హక్కులను, పేటెంట్ నిబంధనలను తాత్కాలికంగా రద్దు చేయాలని.. డబ్ల్యూటీవోలో భారత్, సౌతాఫ్రికా ఓ ప్రతిపాదన తీసుకొచ్చాయ్. దీనికి అమెరికా కూడా ఓకే చెప్పింది. దీని వల్ల టీకాల సప్లై పెరగడంతో పాటు అభివృద్ధి చెందుతున్న దేశాలు, పేద దేశాలకు.. తక్కువ ధరలో వ్యాక్సిన్లు అందుబాటులోకి వస్తాయ్.

భారత్ ప్రపోజల్‌పై.. చైనా కూడా సానుకూల సంకేతాలిచ్చింది. 27 దేశాల కూటమి అయిన యూరోపియన్ యూనియన్ కూడా దీనిపై రియాక్ట్ అయ్యింది. పేటెంట్ వదులుకోవడంపై.. నిర్ణయం తీసుకోవడానికి తక్షణమే చర్చలు ప్రారంభిస్తామని చెప్పింది. ప్రస్తుతం.. ప్రపంచంలో పేటెంట్ కలిగిన కంపెనీలకే కోవిడ్ వ్యాక్సిన్లు తయారుచేయడానికి వీలుంది.

ఈ రూల్స్ నుంచి మినహాయింపు ఇవ్వడం వల్ల.. వ్యాక్సిన్ ఫార్ములాలను ఇతర సంస్థలతో పంచుకునేందుకు వీలుంటుంది. ఇదే గనక జరిగితే.. మరింత చౌకగా వ్యాక్సిన్లు మార్కెట్లోకి అందుబాటులోకి వస్తాయ్. అప్పుడు టీకాల సరఫరా పెరుగుతుంది. సామాన్యుడు కూడా కొనుగోలు చేసేందుకు వీలుగా ధరలు తగ్గుతాయ్.

కరోనా మహమ్మారి కొనసాగినంత కాలం.. కోవిడ్ టీకాలపై పేటెంట్ రైట్స్‌కు సంబంధించిన రూల్స్ తొలగించాలని.. గతేడాది అక్టోబర్‌లోనే భారత్, సౌతాఫ్రికా.. వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్‌ ముందు ప్రతిపాదన పెట్టాయి. దీనికి.. వందకు పైగా పేద, అభివృద్ధి చెందుతున్న దేశాలు మద్దతు పలికాయి. కొన్ని అగ్రదేశాలు మాత్రం వ్యతిరేకిస్తూ వచ్చాయి. ఇందులో అమెరికా కూడా ఉంది. అప్పటి ట్రంప్ ప్రభుత్వం.. పేటెంట్స్ రైట్స్ వదులుకోవడంపై వ్యతిరేకత వ్యక్తం చేసింది.

ఓకే చెప్పిన అమెరికా
కానీ.. తాజాగా అమెరికా కూడా ఇందుకు ఓకే చెప్పింది. జో బైడెన్ ప్రభుత్వం.. భారత్ ప్రతిపాదనకు మద్దతు తెలిపింది. ఈ విషయాన్ని అమెరికా ట్రేడ్ ప్రతినిధి కేథరిన్ టాయ్ తెలిపారు. అమెరికా డెసిషన్‌తో.. డబ్ల్యూటీవో జనరల్ కౌన్సిల్‌లో.. భారత్ ప్రతిపాదనకు గ్రీన్ సిగ్నల్ రావడం ఈజీ అవుతుంది. బైడెన్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని.. ఇండియా కూడా స్వాగతించింది. కరోనాపై పోరులో.. ఇది కీలక ఘట్టమని.. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అధిపతి టెడ్రోస్ అన్నారు.

వ్యతిరేకిస్తున్న  దేశాలు 
కోవిడ్ టీకాలపై పేటెంట్లు మినహాయించాలన్న భారత్, సౌతాఫ్రికా ప్రతిపాదనకు.. పేద, మధ్య ఆదాయ దేశాలు మద్దతు పలికాయ్. ఇందులో.. కెన్యా, పాకిస్తాన్, బొలివియా, వెనిజులా, జింబాబ్వే, ఈజిప్ట్, ఆఫ్రికన్ గ్రూప్, ఎల్డీసీ గ్రూప్ ఉన్నాయి. ఇక.. యూరోపియన్ యూనియన్, కెనడా, న్యూజిలాండ్ మాత్రం.. ఈ ప్రపోజల్‌పై చర్చించి నిర్ణయం తీసుకుంటామని తెలిపాయి. అభివృద్ధి చెందిన కొన్ని దేశాలు మాత్రం.. ఇండియా ప్రపోజల్‌ని వ్యతిరేకిస్తున్నాయి. జర్మనీ, స్విట్జర్లాండ్, ఆస్ట్రేలియా, బ్రిటన్, బ్రెజిల్, జపాన్ మాత్రం.. తమ వ్యాక్సిన్లపై పేటెంట్లు వదులుకోవడానికి సిద్ధంగా లేవు. ఇదే.. ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.

కోవిడ్ మహమ్మారి ముగిసేంత వరకే.. టీకాలపై పేటెంట్లు వదులుకోవాలని భారత్ కోరింది. దీనికి కూడా కొన్ని అగ్రదేశాలు ముందుకు రావడం లేదు. ప్రపంచానికి ఓ సమస్య వచ్చినప్పుడు.. ప్రపంచదేశాలన్నీ కలిసి ఎదుర్కోవాలి. అభివృద్ధి చెందిన దేశాలు.. అభివృద్ధి చెందుతున్న దేశాలను, పేద దేశాలను ఆదుకునేందుకు స్వచ్ఛంధంగా ముందుకురావాలి. అప్పుడు మాత్రమే.. పాండమిక్ నుంచి అన్ని దేశాలు బయటపడతాయ్. పరిస్థితులు చక్కబడతాయ్. అంతేగానీ.. వ్యాక్సిన్ ఫార్ములా ట్రాన్స్‌ఫర్ కాకపోతే.. ప్రపంచం ఇంకొన్నేళ్లపాటు ఇలాగే ఉండిపోవాల్సి వస్తుంది.

సంక్షోభ సమయంలోనూ వ్యాపారాలేనా…
సంక్షోభ సమయంలోనూ.. కొన్ని దేశాలు వ్యాక్సిన్ అంటే బిజినెస్ యాంగిల్‌లోనే ఆలోచిస్తున్నాయ్. పేటెంట్ వదులుకుంటే.. తమ కంపెనీలకు నష్టం జరుగుతుందని.. తమ దేశ ఎకానమీలో మార్పులు వస్తాయని భావిస్తున్నాయ్. కానీ.. ఇప్పుడు కూడా వ్యాపారాలే కావాలనుకుంటే.. ప్రపంచం ముందుకెళ్లే పరిస్థితులు ఉండవు. జనం పిట్టల్లా రాలిపోతున్నా.. లాభాలే ముఖ్యమనుకుంటే.. అది ఏ దేశానికి మంచిది కాదు. అన్ని దేశాలు ఒకదానికొకటి సహకరించుకున్నప్పుడు మాత్రమే.. ఈ సంక్షోభం నుంచి బయటపడే అవకాశం ఉంటుంది. లేకపోతే.. ఈ క్రైసిస్ ఇలాగే కంటిన్యూ అయితే.. ఊహించని స్థాయిలో లాస్ జరుగుతుంది. అప్పుడు ఇంకేమీ చేయలేని పరిస్థితులు తలెత్తుతాయని విశ్లేషకులు చెబుతున్నారు.

వ్యాక్సిన్ తయారీ పేటెంట్ హక్కులను మాఫీ చేయడం వల్ల.. ప్రపంచదేశాలకు కలిగే లాభమేంటి? అగ్రదేశాలకు వచ్చే నష్టాలేంటి? పేటెంట్లను తాత్కాలికంగా వదులుకునేందుకు.. ధనిక దేశాలు ఎందుకు ఒప్పుకోవడం లేదు? అసలు.. మేధో సంపత్తి హక్కులంటే ఏమిటి? పేటెంట్లను పక్కనబెడితే.. వ్యాక్సిన్ ఉత్పత్తి పెంచడానికి, సరఫరా చేయడానికి ఉన్న అడ్డంకులేంటి?

పేటెంట్ హక్కులు వరల్డ్ వైడ్ హాట్ టాపిక్‌
కోవిడ్ వ్యాక్సిన్ల పేటెంట్లను కొన్నాళ్ల పాటు మాఫీ చేయాలని వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్‌లో.. భారత్, సౌతాఫ్రికా పెట్టిన ప్రపోజల్.. ఇప్పుడు వరల్డ్ వైడ్ హాట్ టాపిక్‌గా మారింది. ఈ విషయంలో ధనిక దేశాలన్నీ ఓ గ్రూప్‌గా విడిపోతే.. అభివృద్ధి చెందుతున్న దేశాలు, పేద, మధ్య ఆదాయ దేశాలు మరో గ్రూప్‌గా ఉన్నాయ్.  అయితే.. గతేడాది సెప్టెంబర్ నుంచి ఈ ఇష్యూ.. డబ్ల్యూటీవోలో నానుతూ వస్తోంది. భారత్-సౌతాఫ్రికా పేటెంట్ మాఫీ ప్రతిపాదనకు.. ప్రపంచ వాణిజ్య సంస్థలోని ఉన్న 164 సభ్య దేశాలు ఓకే చెబితేనే.. వ్యాక్సిన్లపై పేటెంట్లు తాత్కాలికంగా మాఫీ అవుతాయ్. అందులో.. ఏ ఒక్క దేశమైనా వీటో అధికారం ప్రయోగిస్తే.. మొత్తం మళ్లీ మొదటికొస్తుంది. మొన్నటిదాకా.. భారత్‌ ప్రపోజల్‌ని వ్యతిరేకించిన దేశాల లిస్టులో..యూరోపియన్ యూనియన్ కూడా ఉండేది. కానీ.. ఇప్పుడు అమెరికా మద్దతు తెలపడంతో.. ఈయూ కూడా దీనిపై ఆలోచించి నిర్ణయం తీసుకుంటామని చెప్పింది.

కోవిడ్ వ్యాక్సిన్ మేధో సంపత్తి హక్కులు మాఫీ చేయడం వల్ల.. ప్రపంచ దేశాల్లో.. చాలా వరకు వ్యాక్సిన్ సప్లై పెరగటానికి అవకాశం ఉంది. దీని వల్ల.. అత్యవసర వినియోగ అధికారాలతో వ్యాక్సిన్లు ఉత్పత్తి చేయటానికి అవకాశం కలుగుతుంది. ఫైజర్, మోడెర్నా, ఆస్ట్రాజెనెకా, నోవావాక్స్, జాన్సన్ అండ్ జాన్సన్, కోవాగ్జిన్ లాంటివి.. మిడిల్ ఇన్‌కమ్ కంట్రీస్‌లో.. ఎక్కువగా ఉత్పత్తి చేసేందుకు వీలు కలుగుతుంది.  ప్రస్తుతం.. అభివృద్ధి చెందిన దేశాలు, అగ్రదేశాల్లో మాత్రమే.. అధిక మొత్తంలో వ్యాక్సిన్ ఉత్పత్తి కేంద్రీకృతమై ఉంది. మధ్య ఆదాయ దేశాల్లో.. టీకాల ఉత్పత్తి లైసెన్సింగ్, టెక్నాలజీ ట్రాన్స్‌ఫర్ అగ్రిమెంట్ల ద్వారానే జరుగుతోంది. దీనివల్ల.. వ్యాక్సిన్ ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచడం సుదీర్ఘమైన ప్రక్రియగా మారింది.

మేధో సంపత్తి హక్కులను మాఫీ చేసే ప్రతిపాదనలో.. ఇంకా చాలా విషయాలను ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. వ్యాక్సిన్ల ఉత్పత్తిని సాధ్యమైనంత పెంచడానికి.. ధనిక దేశాలు అభివృద్ధి చెందుతున్న, మధ్య ఆదాయ దేశాలకు సహకరించాలంటున్నారు. అదేవిధంగా.. వ్యాక్సిన్ల తయారీకి ముడిసరుకును కూడా విస్తృతంగా సప్లై చేయాలని సూచిస్తున్నారు. పేటెంట్లు మాఫీ చేస్తే.. మిగతా దేశాలతో పాటు కెనడా, సౌత్ కొరియా, బంగ్లాదేశ్ కూడా వ్యాక్సిన్లు తయారుచేసేందుకు సిద్ధంగా ఉన్నాయ్.

పేటెంట్ రైట్స్ వదులుకోడానికి అడ్డంకులు
పేటెంట్లు మాఫీ చేయడానికి డబ్ల్యూటీవోకు కొన్ని అడ్డంకులున్నాయి. మేధో సంపత్తి హక్కులను వదులుకోవడాన్ని వ్యతిరేకిస్తూ.. ఫైజర్, ఆస్ట్రాజెనెకాతో సహా ఫార్మా కంపెనీలన్నీ.. మార్చిలో అమెరికా ప్రెసిడెంట్ జో బైడెన్‌కి ఓ లెటర్ రాశాయ్. పేటెంట్ హక్కులను వదులుకోవడం వల్ల మహమ్మారిని ఎదుర్కొనే విషయంలో.. ప్రపంచదేశాలు స్పందించే తీరును బలహీనమవుతుందని తెలిపాయి. అదే విధంగా.. కొత్త వేరియంట్లను టాకిల్ చేసేందుకు జరుగుతున్న ప్రయత్నాలకు కూడా బ్రేక్ వస్తుందని రాశారు. పేటెంట్ల మాఫీ వల్ల.. టీకాల తయారీలో గందరగోళం నెలకొంటుందని.. వ్యాక్సిన్ భద్రతపై ప్రజల విశ్వాసం దెబ్బతింటుందని లేఖలో చెప్పారు. అలాగే.. సమాచార భాగస్వామ్యానికి అడ్డంకులు ఎదురవుతాయన్నారు. మరీ ముఖ్యంగా.. పేటెంట్ హక్కులను తొలగించడం వల్ల.. వ్యాక్సిన్ ఉత్పత్తి వేగవంతం కాదని చెప్పాయ్ ఫార్మా కంపెనీలు.

ఇదంతా పక్కనబెడితే.. ముఖ్యంగా పేటెంట్ రైట్స్ మాఫీని వ్యతిరేకిస్తున్న దేశాలు.. అభివృద్ధి చెందుతున్న దేశాల సామర్థ్యాన్ని తక్కువగా అంచనా వేస్తున్నాయ్. వ్యాక్సిన్ ఉత్పత్తిని వేగవంతం చేయడం.. అభివృద్ధి చెందుతున్న దేశాలు, మధ్య ఆదాయ దేశాల వల్ల కాదని తేల్చేశాయ్. కానీ.. చాలా దేశాలు వ్యాక్సిన్లను ఉత్పత్తి చేసేందుకు ఇంట్రస్ట్ చూపిస్తున్నాయ్. భారత్ లాంటి దేశాల్లోని ఫార్మా కంపెనీలకు.. వ్యాక్సిన్ వేగంగా ఉత్పత్తి చేయడం తెలుసు. క్వాలిటీ మెయింటైన్ చేయడమూ తెలుసు. ఇప్పటికే.. చాలా దేశాలు తమ వ్యాక్సిన్‌ను ఉత్పత్తి చేయాలని ఇండియాని అప్రోచ్ అయ్యాయ్. అలాంటప్పుడు.. సొంతంగా ఉత్పత్తి చేసే శక్తి,సామర్థ్యాలు లేవని ఎలా చెప్పగలరని విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు.

ఇంతకీ.. పేటెంట్, ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ అంటే ఏమిటి?
పేటెంట్ అనేది శక్తివంతమైన మేధో సంపత్తి హక్కుకు సంబంధించింది. కొత్తగా ఏదైనా ఉత్పత్తిని తయారుచేసిన ఆవిష్కర్త.. తనలాంటి ఉత్పత్తిని వేరొకరు తయారు చేయడానికి వీల్లేకుండా ప్రభుత్వం నుంచి పొందే హక్కే పేటెంట్. ప్రభుత్వం ముందుగానే ఆవిష్కర్తకు.. కొంతకాలం పాటు ఆ ఉత్పత్తిపై గుత్తాధిపత్యం కల్పిస్తుంది. ఈ పేటెంట్ హక్కులు.. మరొకరు ఆ ఉత్పత్తిని కాపీ చేయకుండా నిరోధిస్తాయి. ఒక వేళ అలాంటిది జరిగితే.. వాళ్లపై చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు.. పేటెంట్ వీలు కల్పిస్తుంది. పేటెంట్స్.. రెండు రకాలుగా ఉంటాయ్. ఒకటి.. ప్రాసెస్ పేటెంట్స్.. రెండోది ప్రొడక్ట్ పేటెంట్స్.

ఇదిలా ఉంటే.. వ్యాక్సిన్ ఉత్పత్తి పెంచడానికి మరికొన్ని అడ్డంకులున్నాయ్. ఇంటర్నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ మాన్యూఫాక్చరర్స్ అండ్ అసోసియేషన్స్.. వ్యాక్సిన్ ఉత్పత్తి పెంచడం, సరఫరా చేయడంలో ఎదురయ్యే నిజమైన సవాళ్లను ఎత్తి చూపింది. వాణిజ్యపరమైన అవరోధాలు, సప్లై చైన్‌లో ఉన్న అడ్డంకులు, ముడిపదార్థాలతో పాటు సప్లై చైన్‌లో ఉన్న పదార్థాల కొరత.. వ్యాక్సిన్ ప్రొడక్షన్‌కి అడ్డంకిగా మారుతుందని ఫార్మా కంపెనీలు చెబుతున్నాయ్. వీటన్నింటికంటే ముఖ్యంగా.. ధనిక దేశాలు తమ వ్యాక్సిన్లను.. పేద దేశాలతో పంచుకునేందుకు ఇష్టపడటం లేదు. ఇదే.. అసలైన కారణమని.. ఇది నేరుగా చెప్పలేకే.. కుంటిసాకులన్నీ చెబుతున్నారని విశ్లేషకులు అంటున్నారు.

వ్యాక్సిన్ తయారీలో ముడి పదార్ధాల కొరత
ప్రస్తుత పరిస్థితుల్లో.. ముడిపదార్థాల కొరత వ్యాకిన్ ఉత్పత్తిలో ప్రధానమైన సమస్యగా మారింది. వ్యాక్సిన్ తయారుచేసే చాలా ఫార్మా కంపెనీలు.. మిగతా సప్లై కంపెనీలపై ఆధారపడుతున్నాయి. ఈ విషయంలో వారికున్న ఆల్టర్నేటివ్స్‌ కూడా చాలా తక్కువ. ఇప్పటికే.. అమెరికా లాంటి దేశాలు అమెరికన్ డిఫెన్స్ ప్రొటెక్షన్ యాక్ట్‌ పేరుతో.. కోవిడ్ వ్యాక్సిన్ల ఉత్పత్తిలో ఉపయోగించే కీలకమైన ముడి పదార్థాల ఎగుమతులను నిరోధించాయి. దీని ఎఫెక్ట్.. ఇండియాలో వ్యాక్సిన్లు తయారుచేస్తున్న కంపెనీలపైనా పడింది. ఇది.. ఆయా కంపెనీల వ్యాక్సిన్ ఉత్పత్తిలో ఆలస్యానికి కారణమైంది.

భారత్‌లో.. జాన్సన్ అండ్ జాన్సన్ వ్యాక్సిన్ తయారుచేస్తున్న బయాలాజికల్ ఈ కంపెనీపైనా ఎఫెక్ట్ పడింది. యూఎస్ డిఫెన్స్ ప్రొటెక్షన్ యాక్ట్ కారణంగా.. అమెరికా సప్లయర్స్.. గ్లోబల్ క్లయింట్లకు.. ముడిపదార్థాలు సప్లై చేయలేకపోతున్నారని ఆ కంపెనీ ఎండీ తెలిపారు. ఇక.. కోవిషీల్డ్ ఉత్పత్తి చేసే సీరం ఇనిస్టిట్యూట్ పైనా యూఎస్ ఎఫెక్ట్ పడింది. అమెరికా డిఫెన్స్ యాక్ట్ వల్ల.. అక్కడి నుంచి రావాల్సిన ప్లాస్టిక్ బ్యాగ్స్, ఫిల్టర్స్‌తో పాటు వ్యాక్సిన్ తయారీలో వాడే ప్రత్యేకమైన పదార్థాలకు కొరత నెలకొందని తెలిపింది సీరం ఇనిస్టిట్యూట్. అయితే.. త్వరలోనే.. కోవిషీల్డ్ తయారీకి అవసరమైన ముడిపదార్థాలను.. అత్యవసరంగా భారత్‌కు ఎగుమతి చేస్తామని.. వైట్ హౌజ్ తెలిపింది.

వ్యాక్సిన్ కొరత తీరాలంటే ఏం చేయాలి ?
WTOలో భారత్ పెట్టిన ప్రపోజల్‌కి కన్విన్స్ అయ్యి.. పేటెంట్ రైట్స్ మాఫీకి.. ప్రపంచదేశాలన్నీ ఒప్పుకుంటే.. వ్యాక్సిన్ ఉత్పత్తి పెరుగుతుందా? కేవలం.. మేధో సంపత్తి హక్కులను వదులుకోవడం వల్ల.. ప్రపంచదేశాలకు ఉపయోగం ఉంటుందా? ఆ ఒక్క పనితో.. గ్లోబ్ వైడ్‌ వ్యాక్సిన్ ఉత్పత్తి పెరిగి.. అందరికీ టీకాలు అందుబాటులోకి వస్తాయా? ప్రపంచంలో ఇప్పుడున్న వ్యాక్సిన్ కొరతను తీర్చాలంటే.. ఇంకేం చేయాలి?

ప్రపంచంలో అగ్ర దేశాలు, ధనిక దేశాలు తప్ప.. మిగతా దేశాలన్నీ.. వ్యాక్సిన్ కోసమే పరితపిస్తున్నాయ్. మధ్య ఆదాయ, పేద దేశాల్లో వ్యాక్సిన్ డిమాండ్ ఎక్కువగా ఉండి.. సప్లై తక్కువగా ఉండటంతో.. అందరికీ సరైన టైంలో వ్యాక్సినేషన్ చేయలేకపోతున్నారు. ఇప్పుడిదే.. ప్రధాన సమస్యగా మారింది. ప్రపంచమంతా మహమ్మారితో పోరాడుతున్న సమయంలో.. ధనిక దేశాలు మిగతా దేశాల పట్ల ఈ రకంగా వ్యవహరించడం సిగ్గుపడేలా చేస్తోంది. మానవతా దృక్పథంతో ఆలోచించకుండా.. వ్యాపార ప్రయోజనాల కోసమే.. పనిచేస్తుండటం.. బాధ కలిగిస్తోంది.

అభివృద్ధి చెందుతున్న దేశాల్లో.. ఒకటి, రెండు వ్యాక్సిన్లు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. కొన్ని ఫార్మా కంపెనీలు మాత్రమే.. ఆ వ్యాక్సిన్లను తయారుచేస్తున్నాయ్. ఎంత వేగంగా ఉత్పత్తి చేసినా.. డిమాండ్‌కి తగ్గ సప్లైని అందుకోలేకపోతున్నారు. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్‌ మన ఇండియానే. మన దగ్గర తయారైన వ్యాక్సిన్లు కాబట్టి తక్కువ ధరకే ప్రభుత్వం వీటిని కొనుగోలు చేయగలుగుతోంది. ప్రపంచవ్యాప్తంగా ఇంకా చాలా వ్యాక్సిన్లు అందుబాటులోకి వచ్చాయి.

పేటెంట్ రైట్స్ కారణంగా.. వాటిని మిగతా దేశాల్లో తయారుచేయడం వీలు కావడం లేదు. పైగా వీటి ధర కూడా ఎక్కువే. అందుకే.. భారత్, సౌతాఫ్రికా కలిసి.. మహమ్మారి కాలం ముగిసేంత వరకు.. వ్యాక్సిన్ల మీద పేటెంట్ హక్కులను మాఫీ చేయాలని వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్‌ని కోరాయ్. ఇందుకు ప్రపంచంలోని వందలాది దేశాలు మద్దతు తెలిపినా.. కొన్ని ధనిక దేశాలు మాత్రం వ్యతిరేకిస్తున్నాయ్. మేధో సంపత్తి హక్కులను వదులుకోలేమని తెగేసి చెబుతున్నాయ్. పేటెంట్ మాఫీ అనే చర్య.. ఆవిష్కరణలకు ఆటంకం కలిగిస్తుందని కామెంట్ చేస్తున్నాయ్. పైగా.. ఈ కాంప్లికేటెడ్ మెడిసిన్స్ తయారుచేసే సామర్థ్యం.. మిగిలిన దేశాలకు లేవంటున్నారు. తాము తయారుచేస్తున్న వ్యాక్సిన్లు.. తమకు మాత్రమే సాధ్యమని చెబుతున్నారు.

నిజానికి.. ధనిక దేశాలు వ్యవహరిస్తున్న తీరు.. ఆందోళనకరంగా మారింది. ఇప్పుడు ఇండియా ప్రపోజల్‌కు.. అగ్రరాజ్యం అమెరికా ఓకే చెప్పింది కాబట్టి.. ఇంకొన్నాళ్లకైనా.. మిగతా దేశాలు ఒప్పుకోక తప్పని పరిస్థితులు వస్తాయ్. అప్పుడు.. ప్రపంచ దేశాల నుంచి వచ్చే విమర్శలు తట్టుకోలేక ఓకే చెప్పొచ్చు. వ్యాక్సిన్లపై తాత్కాలికంగా పేటెంట్ హక్కులను వదులుకోవచ్చు. కానీ.. మేధో సంపత్తిహక్కులను మాత్రమే వదులుకుంటే సరిపోదు. వ్యాక్సిన్ తయారీకి సంబంధించిన ఫార్ములాను, టెక్నాలజీని కూడా ట్రాన్స్‌ఫర్ చేసినప్పుడే ఫలితం ఉంటుంది.

ఇప్పుడున్న పరిస్థితుల్లో.. పేటెంట్ వదులుకొని.. వ్యాక్సిన్ తయారుచేసుకోమని చెప్పడం గొప్ప విషయమేమీ కాదు. దానికి అవసరమైన టెక్నాలజీని ట్రాన్స్‌ఫర్ చేస్తేనే.. పెద్దమొత్తంలో ప్రపంచ దేశాల్లో వ్యాక్సిన్ ఉత్పత్తికి అవకాశం ఉంటుంది. అందుకు తగ్గట్లుగా.. ముడిపదార్థాలను సప్లై చేసినప్పుడే.. వ్యాక్సిన్ ప్రొడక్షన్ పెరిగి అందరికీ అందుబాటులోకి వస్తుంది. అప్పుడే.. సామాన్యుడు కూడా కొనగలిగే రేట్లు ఉంటాయి.

ఫైజర్‌, మోడర్నా వ్యాక్సిన్లు కూడా.. మన కోవీషీల్డ్‌, కోవాగ్జిన్‌ ధరకే అందుతాయి. ఇదంతా.. జరిగితేనే.. కోవిడ్ మహమ్మారిని ప్రపంచం ఎదుర్కొంటుంది. అలాకాకుండా.. వ్యాక్సిన్ ఉత్పత్తి.. ధనిక దేశాలకే పరిమితమైతే.. కోవిడ్ మహమ్మారి ఎఫెక్ట్ కొన్నేళ్ల పాటు అలాగే ఉంటుంది. ఇప్పట్లో.. ఈ వైరస్ విలయం నుంచి ప్రపంచం బయటపడే అవకాశం ఉండదు. వ్యాక్సిన్ తయారీపై పేటెంట్ హక్కులను వదులుకోవడంతో పాటు దాని తయారీకి అవసరమైన టెక్నాలజీని ధనిక దేశాలు ట్రాన్స్‌ఫర్ చేయాలి. అప్పుడు మాత్రమే.. దీనికి ఫలితం ఉంటుందని.. విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.