తమిళనాడులో ఘోర ప్రమాదం : కాలువలోకి దూసుకెళ్లిన వాహనం…ఐదుగురు మహిళలు మృతి

తమిళనాడులో ఘోర ప్రమాదం : కాలువలోకి దూసుకెళ్లిన వాహనం…ఐదుగురు మహిళలు మృతి

A vehicle crashed into a canal : మధ్యప్రదేశ్‌లో బస్సు ప్రమాద ఘటన మరువకముందే త‌మిళ‌నాడులో ఘోర ప్రమాదం జ‌రిగింది. ఓ టాటా ఏస్ మినీ వ్యాన్‌ కాల్వలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఐదుగురు మ‌హిళ‌లు అక్కడికక్కడే మృతి చెందారు. మ‌రో 15 మంది తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. కొందరి పరిస్థితి విషమంగా ఉంది. 35 మంది మ‌హిళ‌ల‌తో వెళ్తున్న మినీ వ్యాన్‌ అదుపుత‌ప్పి రోడ్డు ప‌క్కనే ఉన్న కాల్వలోకి దూసుకెళ్లింది.

తూత్తుకూడి సమీపంలోని మ‌నియాచి వ‌ద్ద ప్రమాదం చోటుచేసుకుంది. మ‌హిళలంతా తాము పనిచేసే సంస్థకు చెందిన వ్యాన్‌లో విధుల‌కు వెళ్తుండగా ఈ ఘోరం జ‌రిగింది. సమాచారం అందిన వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. డ్రైవ‌ర్ మితిమీరిన వేగంతో వాహ‌నాన్ని న‌డుప‌డ‌మే ప్రమాదానికి కార‌ణ‌మ‌ని పోలీసులు ప్రాథ‌మికంగా అంచనాకు వ‌చ్చారు.

మరోవైపు మధ్యప్రదేశ్‌లో బస్సు అదుపుతప్పి కాల్వలోకి దూసుకెళ్లిన దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 45కు చేరుకుంది. సిధి నుంచి సత్నాకు వెళ్తుండగా అదుపుతప్పిన బస్సు వంతెనపై నుంచి కాల్వలోకి దూసుకెళ్లింది. ప్రమాద సమయంలో బస్సులో 54 మంది ప్రయాణికులు ఉన్నారు.

ప్రమాదం నుంచి ఏడుగురు ప్రయాణికులు మాత్రమే క్షేమంగా బయటపడ్డారు. మిగిలిన ఇద్దరు ప్రయాణికుల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. కాల్వలో పడిన బస్సు పూర్తిగా మునగడంతో భారీగా ప్రాణనష్టం జరిగింది.