Aadhaar Covid : బిగ్ రిలీఫ్… కరోనా వ్యాక్సిన్, చికిత్సకు ఆధార్ తప్పనిసరి కాదు

ఆధార్ లేకుంటే టీకాలు వెయ్యడం లేదు, ఆసుపత్రుల్లో చికిత్స కూడా చెయ్యడం లేదు. దీంతో ప్రజలు, రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ పరిస్థితుల్లో భారత విశిష్ఠ ప్రాధికార సంస్థ (యూఐడీఏఐ) కీలక నిర్ణయం తీసుకుంది. బిగ్ రిలీఫ్ ఇచ్చింది.

Aadhaar Covid : బిగ్ రిలీఫ్… కరోనా వ్యాక్సిన్, చికిత్సకు ఆధార్ తప్పనిసరి కాదు

Aadhaar Covid

Aadhaar Covid : కరోనా టీకా తీసుకోవాలన్నా, చికిత్స చేయించుకోవాలన్నా ఆధార్ వెంట తీసుకెళ్లాల్సిన పరిస్థితి ఉంది. ఆధార్ నెంబర్ తో ముందుగా కోవిన్ యాప్ లేదా ఆరోగ్య సేతు యాప్‌, కోవిన్ పోర్ట‌ల్‌లో రిజిస్ట‌ర్ చేసుకున్న తర్వాత ఆ వివ‌రాల‌తో టీకా కేంద్రాల‌కు వెళ్లి టీకాల‌ను వేయించుకోవాలి. ఆధార్ లేకుంటే టీకాలు వెయ్యడం లేదు, ఆసుపత్రుల్లో చికిత్స కూడా చెయ్యడం లేదు. దీంతో ప్రజలు, రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ పరిస్థితుల్లో భారత విశిష్ఠ ప్రాధికార సంస్థ (యూఐడీఏఐ) కీలక నిర్ణయం తీసుకుంది. ఆస్పత్రుల్లో చికిత్స, ఔషధాలు, టీకా విషయంలో ఆధార్‌ తప్పనిసరి కాదని సంస్థ తేల్చి చెప్పింది. ఆధార్ లేద‌ని చెప్పి టీకాల‌ను ఇవ్వ‌డం నిరాక‌రించరాద‌ని, అలాగే ఆధార్ లేక‌పోతే కోవిడ్ సేవ‌ల‌ను అందించ‌లేమ‌ని చెప్ప‌కూడ‌ద‌ని యూఐడీఏఐ స్ప‌ష్టం చేసింది. ఈ మేర‌కు యూఐడీఏఐ ఒక ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసింది.

ఆధార్‌ కార్డు లేని రోగులకు కొన్ని ఆస్పత్రులు చికిత్స చేయడం లేదని, టీకాలు వేయడం లేదని వస్తున్న వార్తలపై యూఐడీఏఐ స్పందించింది. ‘‘ఆధార్‌ లేదని టీకా, ఔషధాలు, ఆస్పత్రుల్లో చికిత్స నిరాకరించకూడదు’’ అని ఒక ప్రకటనలో వెల్లడించింది.

కోవిడ్ టీకాల‌ను తీసుకునేందుకు ఆధార్ అవ‌స‌ర‌మే. అయితే అది త‌ప్ప‌నిస‌రి కాదు. ఆధార్ లేద‌ని చెప్పి టీకాల‌ను ఇవ్వ‌లేం.. అని కేంద్రాల సిబ్బంది అన‌కూడ‌దు. అలాగే ఆధార్ లేక‌పోతే కోవిడ్ సేవ‌ల‌ను అందించ‌లేము.. అని కూడా సిబ్బంది చెప్ప‌రాదు. ఆధార్ లేక‌పోతే పాన్ కార్డు, ఓట‌ర్ ఐడీ, డ్రైవింగ్ లైసెన్స్, ప్రభుత్వ హెల్త్ ఇన్సూరెన్స్ కార్డు, పెన్షన్ డాక్యుమెంట్ వంటి ఫొటో ఐడెంటిటీ ప‌త్రాల‌ను కూడా ఐడీ ప్రూఫ్ కింద చూపించ‌వ‌చ్చని యూఐడీఏఐ తెలిపింది.

చాలా చోట్ల ఆధార్ లేనివారికి, ఆధార్‌ను తీసుకెళ్ల‌ని వారికి టీకాల‌ను వేయ‌డం లేద‌ని అలాగే కోవిడ్ బాధితుల‌కు వైద్య సేవ‌ల‌ను అందించ‌డం లేద‌ని యూఐడీఏఐ దృష్టికి వ‌చ్చింది. అందుక‌నే యూఐడీఏఐ ఈ ప్ర‌క‌ట‌న చేసింది. ఈ ప్రకటనతో ప్రజల ఇబ్బందులు తొలిగినట్టే. ఇకపై ఎవ‌రైనా ఆధార్ లేక‌పోయినా మిగిలిన ప‌త్రాల‌ను ఐడీ ప్రూఫ్ కింద చూపించి టీకాల‌ను వేయించుకోవ‌చ్చు. అలాగే కరోనా వైద్య సేవ‌ల‌నూ పొందొచ్చు. కరోనా కష్టకాలంలో ఈ వెసులుబాటు బిగ్ రిలీఫ్ గా భావించొచ్చు.