ఢిల్లీ శివారులో రైతులు : అరెస్టు చేస్తే జైళ్లు చాలవు..స్టేడియాలు కావాలి – పోలీసులు

  • Published By: madhu ,Published On : November 27, 2020 / 12:46 PM IST
ఢిల్లీ శివారులో రైతులు : అరెస్టు చేస్తే జైళ్లు చాలవు..స్టేడియాలు కావాలి – పోలీసులు

AAP govt’s nod to use 9 stadiums as temporary jails : దేశ వ్యాప్తంగా అమలు చేయడానికి కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మూడు వ్యవసాయ చట్టాలకు నిరసనగా రైతులు చేపడుతున్న ఆందోళనలు తీవ్రతరమౌతున్నాయి. ఢిల్లీ చలో పేరిట సంయుక్త కిసాన్ మోర్చా, అఖిల భారత కిసాన్ సంఘర్ష సమన్వయ కమిటీ భారీ ఉద్యమానికి పిలుపునిచ్చింది. తమ నిరసన గళాన్ని కేంద్రానికి వినిపించడానికై..వారంతా..దేశ రాజధాని వైపు బయలుదేరారు. ఢిల్లీ సరిహద్దుల్లో ఉద్రిక్తత కొనసాగుతోంది. రైతులను ఢిల్లీ వెళ్లకుండా అడ్డుకునేందుకు భద్రతాబలగాలు టియర్ గ్యాస్, వాటర్ కెనాన్లు ప్రయోగిస్తున్నారు.



రైతులు వాటినుంచి తప్పించుకుని..ముందుకు పోయేందుకు ప్రయత్నిస్తున్నారు. వాటర్ కెనాన్లను దాటుకుని ఓ రైతు వాహనం పై నుంచి దూకి ముందుకెళ్లారు. రైతులను పెద్ద సంఖ్యలో అదుపులోకి తీసుకుంటున్నారు. ప్రస్తుతం ఉన్న జైళ్లు సరిపోవని, తొమ్మిది స్టేడియాలను తాత్కాలిక కారాగారాలుగా మార్చడానికి అనుమతులు ఇవ్వాలని పోలీసు అధికారులు ఆప్ ప్రభుత్వాన్ని కోరారు.



వ్యవసాయ చట్టాల కారణంగా రైతులకు కలిగే నష్టాన్ని దేశప్రజలందరి దృష్టికి తీసుకెళ్లేందుకు ఈ ఆందోళనకు పిలుపునిచ్చాయి రైతు సంఘాలు. వాటి పిలుపు మేరకు ఛలో ఢిల్లీలో పాల్గొనేందుకు పంజాబ్‌, హర్యానా నుంచి లక్షలాదిగా రైతులు తరలివచ్చారు. రైతుల ఆందోళనకు అనుమతి ఇవ్వని హర్యానాలోని బీజేపీ ప్రభుత్వం వారిని అడ్డుకునేందుకు భారీ ఎత్తున సాయుధ బలగాలను పంజాబ్, హర్యానా సరిహద్దులకు తరలించింది. దీంతో అంబాలా దగ్గర నిన్నంతా తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పంజాబ్, హర్యానాలోని వివిధ ప్రాంతాల నుంచి బయలుదేరిన రైతులను ఐదు సరిహద్దుల దగ్గర భద్రతాబలగాలు అడ్డుకున్నాయి. వెల్లువలా తరలివచ్చిన రైతులను ఢిల్లీ వెళ్లకుండా నియంత్రించేందుకు వారిపై వాటర్‌ కెనాన్లు, భాష్ప వాయుగోళాలు ప్రయోగించారు.



కర్నాల్‌, రోహ్‌తక్‌తో పాటు అంబాల దగ్గర శంభు సరిహద్దుల్లో ర్యాలీగా తరలివస్తున్న రైతులను అడ్డుకున్నారు. శంభు సరిహద్దుల్లో రైతుల ఆందోళన తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. వాటర్ కెనాన్లు, భాష్ప వాయుగోళాల ప్రయోగంతో తమను అడ్డుకుంటున్న భద్రతాదళాలను రైతులు తీవ్రంగా ప్రతిఘటించారు. బారికేడ్లు విడిచి బ్రిడ్జిపై నుంచి కింద పడేశారు. భద్రతాబలగాల పైకి రాళ్లు రువ్వారు. అయినప్పటికీ రైతులను భద్రతాబలగాలు నియంత్రించాయి. వారిని ఢిల్లీలోకి ప్రవేశించకుండా అడ్డుకున్నాయి. దీంతో రాత్రంతా రైతులు ఎక్కడివారక్కడ బసచేశారు. ఉదయం నుంచి మళ్లీ ఢిల్లీ వెళ్లేందుకు ప్రయత్నాలు మొదలపెట్టారు.



సరిహద్దుల్లో భారీగా మోహరించిన సాయుధ బలగాలు వారిని అడ్డుకుంటున్నాయి. తాము నెల రోజులకు సరిపడా ఆహారం వెంట తెచ్చుకున్నామని, ఎన్ని ఆటంకాలు ఎదురైనా ఢిల్లీ వెళ్లి తీరుతామని రైతులు అంటున్నారు. మరోవైపు రైతులను చర్చలకు ఆహ్వానించారు కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్. సమస్య చర్చల ద్వారా పరిష్కారమవుతుందని, ఆందోళనల ద్వారా కాదని ఆయన అన్నారు. డిసెంబరు 3న చర్చలకు రావాలని రైతుసంఘాలను కోరారు. సరిహద్దుల్లో ట్రాఫిక్‌లో చిక్కుకుపోయిన విమాన ప్రయాణికులు టికెట్లు రీ షెడ్యూల్‌కు ఎయిర్‌ ఇండియా అవకాశం కల్పించింది.