సూరత్ ఇచ్చిన కిక్ తో..గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలపై ఆప్ ఫోకస్

సూరత్ ఇచ్చిన కిక్ తో..గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలపై ఆప్ ఫోకస్

AAP సూరత్ కార్పొరేషన్ ఎన్నికల ఫలితాలు ఇచ్చిన కిక్ తో మంచి జోష్ మీదున్న ఆమ్ ఆద్మీ పార్టీ ఇప్పుడు తన దృష్టిని 2022లో జరుగనున్న గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల వైపు మళ్లించింది. శుక్రవారం సూరత్ లో ఆప్ అధినేత,ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ పర్యటించారు. స్థానిక ఆప్ కార్యకర్తలు, సూరత్ లో కొత్తగా ఎన్నికైన కార్పొరేటర్లతో కేజ్రీవాల్ సమావేశమయ్యారు. సూరత్ లో కొత్తగా ఎన్నికైన 27మంది ఆప్ కార్పొరేటర్ల పనితీరు ఆధారంగా వచ్చే ఏడాది జరుగనున్న గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలను ఓట్లు అడగనున్నట్లు కేజ్రీవాల్ తెలిపారు.

ఆదివారం(ఫిబ్రవరి-21,2021)సూరత్ తో సహా గుజరాత్ లోని ఆరు కార్పొరేషన్లకు ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. అహ్మదాబాద్, సూరత్, వడోదర, రాజ్‌కోట్, భావ్‌నగర్, జామ్ నగర్ కార్పొరేషన్లకు ఎన్నికలు జరగగా..అన్నింటిని బీజేపీ కైవసం చేసుకుంది. కాంగ్రెస్ పార్టీ ఆరు కార్పొరేషన్లు కలిపి 58 డివిజన్లలోనే విజయం సాధించగలిగింది. అయితే సూరత్ మున్సిపల్ కార్పోరేషన్ లో మొత్తం 120 స్థానాలుంగా…93 సీట్లు గెలిచి బీజేపీ కార్పొరేషన్ ని దక్కించుకున్నప్పటికీ, ఆప్ మిగిలిన 27 సీట్లు గెల్చుకొని జేపీ తరువాత అతిపెద్ద పార్టీగా నిలిచి రికార్డు సాధించింది. కార్పొరేషన్ ఎన్నికల్లో పోటీ చేసిన తొలిసారే సత్తా చాటిన ఆప్..ఈ ఫలితాలతో తాము ఢిల్లీకే పరిమితం కాదని చాటి చెప్పింది. సూరత్ కార్పొరేషన్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకు ఒక్క డివిజన్ కూడా దక్కకపోవడం విశేషం.

మోడీ సొంతరాష్ట్రంలో పాగా వేయడంతో ఆమ్ ఆద్మీ పార్టీ హర్షం వ్యక్తం చేస్తోంది. ఢిల్లీ పాలన గుజరాత్ రాష్ట్రానికి అవసరమంటున్నారు ఆప్ అధినేత కేజ్రీవాల్. ఈ క్రమంలో శుక్రవారం సూరత్ వెళ్లారు కేజ్రీవాల్. కొత్తగా ఎన్నికైన కార్పొరేటర్లను ఉద్దేశించి కేజ్రీవాల్ మాట్లాడుతూ..గొప్ప ఆశతో గుజరాత్ ప్రజలు మీవైపు చూస్తున్నారు. మన మొదటి ప్రయత్నంలో..ఆప్ ఢిల్లీలో 28స్థానాలును గెల్చుకొని అధికారంలో వచ్చింది. అన్నా హజారే ఆందోళనలో మనం పాల్గొన్న క్రమంలో మనమే నిజమైన దేశభక్తులమని ప్రజలకు తెలుసు కనుకను వారు మనల్ని నమ్మారు. మొదటిసారి అధికారంలో ఉన్న 49 రోజులు ప్రజల కోసం మనం చాలా చేశాం. దాని ఫలితంగా రెండోసారి ఎన్నికల్లో 67సీట్లు ఇచ్చి ప్రజలు ఆశీర్వదించారు. ఇప్పుడు 6కోట్ల గుజరాత్ ప్రజలు 27మంది ఆప్ కార్పొరేటర్ల పనితీరుని గమనిస్తారు. మీరందరూ బాగా పనిచేస్తే 2022లో గొప్ప భారీ మార్పు ఖచ్చితంగా వస్తుందని కేజ్రీవాల్ తెలిపారు.

ఆప్ కార్పొరేటర్లను బీజేపీ తమవైపుకు లాగేందుకు ప్రయత్నించే అవకాశాలు ఉన్నాయన్నారు కేజ్రీవాల్. తమ పార్టీలో చేరండి అంటూ ఆప్ కార్పొరేటర్లకు ఖచ్చితంగా బీజేపీ నేతలు ఫోన్ లు చేసి,ఓ ఆఫర్ ఇస్తారని అన్నారు. బీజేపీ నేతలు ఫోన్ లు చేస్తే ఆ విషయాన్ని వెంటనే ఆప్ పార్టీ నేతల దృష్టికి తీసుకురావాలని, మన నిజమైన సంపద ప్రజల నమ్మకమేనని కొత్త కార్పొరేట్లకు కేజ్రీవాల్ సూచించారు. ఏ ఒక్క కార్పొరేటర్ అయినా బీజేపీలోకి వెలితే..అది ఆరు కోట్ల మంది ప్రజల నమ్మకాన్ని వమ్ము చేసినట్లేనని అన్నారు. అప్పటికి ఎవరైనా బీజేపీలోకి వెళితే..ఇతర పార్టీలు,ఆప్ వేర్వేరు కాదని బీజేపీ,ఇతర పార్టీలు ప్రచారం చేసేందుకు ఓ అవకాశమిచ్చినట్లేనన్నారు.

కొత్తగా ఎన్నికైన కార్పొరేటర్లు తమ తమ వార్డుల్లోని ప్రజలకు సహాయం చేసేందుకు సిద్దంగా ఉండాలన్నారు. అంతేకాకుండా కార్పొరేటర్లు తమ ఫోన్ నెంబర్లను ప్రజలకు షేర్ చేయాలని..దాని వల్ల ప్రజలు వారిని సులభంగా కాంటాక్ట్ అవ్వగలరని కేజ్రీవాల్ తెలిపారు. వేరొకరి పని మీరు చేయలేనప్పటికీ కూడా..సహాయం కోసం వచ్చినవారిని అవమానించకూడదని కేజ్రీవాల్ సూచించారు. ఎల్లప్పుడూ ప్రజలు గౌరవించాలన్నారు. మీ పనితీరు ఆధారంగా గుజరాత్ ప్రజలను వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఓట్లు అడగబోతున్నాం అని కార్పొరేటర్లకు కేజ్రీవాల్ హితబోధ చేశారు.