బెంగాల్‌లో మళ్లీ మమత.. కేరళలో విజయన్‌ గెలుపు : ఐదు రాష్ట్రాల్లో ఏబీపీ-సీ ఓటర్ ఒపీనియన్ పోల్

బెంగాల్‌లో మళ్లీ మమత.. కేరళలో విజయన్‌ గెలుపు : ఐదు రాష్ట్రాల్లో ఏబీపీ-సీ ఓటర్ ఒపీనియన్ పోల్

ABP-C voter opinion poll : దేశంలో ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల వేళ.. ఒపీనియన్ పోల్స్ హడావుడి ప్రారంభమైంది. జాతీయ న్యూస్ ఛానెల్ ఏబీపీ, సీ-ఓటర్ సంస్థ సంయుక్తంగా నిర్వహించిన ఒపీనియన్ పోల్స్‌లో ఓటర్ల నాడి ఎలా ఉందో ఏ పార్టీని వారు ఆదరిస్తున్నారో అనే కీలక అంశాలను సర్వే చేసి వెల్లడించింది. బెంగాల్ పీఠం మరోసారి మమతదేనన్న సర్వే.. కేరళలోనూ పినరయ్‌ విజయం ఖాయమంటూ తేల్చింది. తమిళనాడులో డీఎంకే కూటమికి విజయాన్ని కట్టబెట్టింది ఏపీబీ, సీ-ఓటర్‌ సంస్థ. అస్సాం, పుదుర్చేరి రాష్ట్రాలను బీజేపీ తన ఖాతాలో వేసుకుంటుందని చెప్పింది.

ఎన్నికలకు ఏడాది ముందు నుంచే పశ్చిమ బెంగాల్‌లో వార్ మోడీ వర్సెస్ మమతాగా మారింది. పశ్చిమ బెంగాల్‌లో ముక్కోణపు పోటీ నెలకొనే అవకాశం ఉంది. ఇక్కడ తృణమూల్ కాంగ్రెస్, బీజేపీ, కాంగ్రెస్-లెఫ్ట్ పార్టీల మధ్య పోరు జరగనుంది. పశ్చిమ బెంగాల్‌లో దీదీ మళ్లీ పట్టు నిలుపుకునే అవకాశాలు మెండుగా ఉన్నాయని ఏబీపీ – సీఓటర్ సర్వే వెల్లడించింది. మోడీ – షా ద్వయాన్ని మమతా బెనర్జీ గట్టిగా ఎదుర్కొని తిరిగి ముచ్చటగా మూడోసారి బెంగాల్ పీఠాన్ని అధిష్టించనున్నట్లు ఒపీనియన్ పోల్ ద్వారా తెలుస్తోంది.

మొత్తం 294 సీట్లున్న పశ్చిమ బెంగాల్ అసెంబ్లీకి, మమతా నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ 148 నుంచి 164 సీట్లను సొంతం చేసుకునే అవకాశాలున్నట్లు ఏబీపీ – సీ ఓటర్‌ సర్వే తేల్చింది. బీజేపీ నుంచి టీఎంసీకి గట్టి పోటీ ఉంటుందని.. బీజేపీ కూడా తన అసెంబ్లీ స్థానాలను ఈసారి మరింత మెరుగు పరుచుకుంటుందని జ్యోస్యం చెప్పింది ఏబీపీ- సీఓటర్ సంస్థ. పశ్చిమ బెంగాల్‌లో బీజేపీకి 92 నుంచి 108 స్థానాలు వస్తాయంటోంది. కమ్యూనిస్టులతో జతకట్టి బరిలో దిగుతున్న కాంగ్రెస్‌కు.. ఇక్కడ 31 నుంచి 39 స్థానాల్లో విజయం సాధించే అవకాశాలున్నాయని ఏబీపీ సర్వే ద్వారా స్పష్టమవుతోంది.

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించీ.. సర్వే ఫలితాలు వెల్లడయ్యాయి. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే, కాంగ్రెస్‌లతో కూడిన యూపీఏ కూటమి 154 నుంచి 162 సీట్లు గెలుచుకోబోతున్నట్లు అంచనా వెలువడ్డాయి. మొత్తంగా 41శాతం ఓటింగ్ యూపీఏకి దక్కే అవకాశం ఉన్నట్లు వెల్లడైంది. అన్నాడీఎంకే, బీజేపీ, ఇతరులతో కూడిన ఎన్డీయే కూటమి కేవలం 28.61 శాతం ఓట్లతో 58 నుంచి 66 సీట్లకు పరిమితమయ్యే అవకాశం ఉన్నట్లు వెల్లడైంది. కమల్ హాసన్ నాయకత్వంలోని మక్కల్ నీది మయ్యమ్ పార్టీకి 2 నుంచి 6 సీట్లు వచ్చే అవకాశం ఉన్నట్లు తేలింది. 2016 అసెంబ్లీ ఎన్నికల్లో ఇదే అన్నాడీఎంకే, బీజేపీలతో కూడిన ఎన్డీయే కూటమికి మొత్తం 234 సీట్లలో 43.7శాతం ఓటింగుతో 136 సీట్లు వచ్చాయి. డీఎంకెకు 39.4 శాతం ఓట్లతో 98 సీట్లు వచ్చాయి.

ఇక కేరళ‌లో వార్ వన్‌సైడ్‌గానే ఉంటుందని ఒపీనియన్ పోల్స్ ద్వారా తెలుస్తోంది. కేరళలో అధికారిక ఎల్‌డీఎఫ్ పార్టీ తిరిగి అధికారం చేపడుతుందని ఏబీపీ, సీ-ఓటర్ సర్వే జోస్యం చెప్పింది. మొత్తం 140 అసెంబ్లీ స్థానాలున్న కేరళలో సీపీఐఎం నేతృత్వంలోని ఎల్‌డీఎఫ్ పార్టీ 83 నుంచి 91 స్థానాలను కైవసం చేసుకుంటుందని ఒపీనియన్ పోల్స్ ద్వారా వెల్లడైంది. కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్‌ కూటమికి 47 నుంచి 55 స్థానాలు దక్కే అవకాశాలు ఉన్నట్లు వెల్లడించింది. కేరళలో బీజేపీ పెద్దగా ప్రభావం చూపదని ఏబీపీ సీఓటర్ సర్వే వెల్లడించింది. బీజేపీ కేరళలో సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంటే 0 నుంచి 2 సీట్లు మాత్రమే సాధిస్తుందని సర్వే లెక్క కట్టింది.

అసోంలో మళ్లీ బీజేపీదే అధికారమంటోంది ఏబీపీ-సీ ఓటర్ సర్వే. మొత్తం 43.8 శాతం ఓట్లు, 72 సీట్లతో బీజేపీ గ్రాండ్ విక్టరీ కొట్టే అవకాశం ఉన్నట్లు సర్వేలో వెల్లడైంది. అదే సమయంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ కూటమి 41.4 శాతం ఓట్లతో కేవలం 47 సీట్లకు పరిమితమయ్యే అవకాశం ఉన్నట్లు సర్వేలో తేలింది. బీపీఎఫ్‌కు 4 సీట్లు, ఇతరులకు 3 సీట్లు వచ్చే అవకాశం ఉన్నట్లు తేల్చింది సర్వే. ఇక కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరిలో ఈసారి బీజేపీ అధికారాన్ని చేజిక్కించుకునే అవకాశం ఉన్నట్లు ఏబీపీ-సీ ఓటర్ సర్వేలో వెల్లడైంది. ఆ పార్టీ, దాని మిత్రపక్షాలకు కలిపి 17 నుంచి 21 సీట్లు, కాంగ్రెస్ దాని మిత్రపక్షాలకు కలిపి 8 నుంచి 12 సీట్లు వచ్చే అవకాశం ఉన్నట్లు తేల్చింది సర్వే.