ఆర్టికల్ 370 రద్దు…కాశ్మీర్ లో జాతీయజెండా ఎగరనివ్వను

  • Published By: venkaiahnaidu ,Published On : April 8, 2019 / 03:23 PM IST
ఆర్టికల్ 370 రద్దు…కాశ్మీర్ లో జాతీయజెండా ఎగరనివ్వను

జమ్మూకాశ్మీర్ కు ప్రత్యేక అధికారాలను కల్పించే ఆర్టికల్ 370ని రద్దు చేస్తామని బీజేపీ తమ ఎన్నికల మేనిఫెస్టోలో చేర్చడంపై నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు, కాశ్మీర్ మాజీ సీఎం ఫరూక్ అబ్దుల్లా తీవ్రంగా స్పందించారు.శ్రీనగర్ లోక్ సభ స్థానం నుంచి పోటీ చేస్తున్న ఫరూక్ సోమవారం ఓ ర్యాలీలో మాట్లాడుతూ…వాళ్లు ఆర్టికల్ 370ని రద్దు చేస్తే మేము చూస్తూ కూర్చుంటామని అనుకుంటున్నారా? అది తప్పు.. మేం దానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తాం. వాళ్లు దీనిని రద్దు చేయాలని చూస్తున్నారంటే బహుశా ఇది అల్లా కోరిక కూడా కావచ్చు. వాళ్లు ఆ పని చేయనీ.. అది కశ్మీర్ స్వాతంత్య్రానికి దారి తీస్తుంది. ఆర్టికల్ 370 రద్దు చేసినట్లయితే కాశ్మీర్ లో జాతీయ పతాకాన్ని ఎగరవేసేందుకు ఎవ్వరూ ఉండబోరు.కాశ్మీర్ లో జాతీయపతాకాన్ని ఎగురవేయడానికి ఎవరు సిద్దంగా ఉన్నారో నేను కూడా చూస్తాను.అందువల్ల మా హృదయాలు విరిగిపోయే ఇటువంటి నిర్ణయాలు తీసుకోవద్దు.మా హృదయాలను గెల్చుకునే ప్రయత్నం చేయండి కానీ హృదయాలను గాయపర్చే ప్రయత్నాలు వద్దని ఫరూక్ అన్నారు.

అంతేకాకుండా  ఆర్టికల్ 35Aను రద్దు చేస్తామని బీజేపీ తమ ఎన్నికల మేనిఫెస్టోలో చేర్చడంపై ఫరూక్ స్పందించారు.ఆర్టికల్ 35 (ఎ) ప్రకారం.. రాష్ట్ర పౌరులు ఎవరు, వాళ్ల హక్కులేంటి అన్నది నిర్ణయించే హక్కు స్థానిక రాష్ట్ర అసెంబ్లీకే ఉంటుంది.బయటి ప్రాంతాలకు చెందిన వ్యక్తులు కాశ్మీర్ లో ప్రాపర్టీ కొనుగోలుకు,ఉద్యోగాలకు అప్లయ్  చేసేందుకు అవకాశం ఉండదు.ఆర్టికల్ 35Aని రద్దు చేస్తామని అనటం ద్వారా బీజేపీ బలవంతంగా తమ హక్కులను లాక్కోవడానికి ప్రయత్నిస్తోందని,తాము దీన్ని వదిలిపెట్టబోమని,ఫైట్ చేస్తామని ఫరూక్ అన్నారు. ఆర్టికల్ 370, ఆర్టికల్ 35 (ఎ)ను సవాలు చేస్తూ ఇప్పటికే సుప్రీంకోర్టులో అనేక పిటిషన్లు పెండింగ్‌ లో ఉన్నాయి. 

ఫరూక్ వ్యాఖ్యలపై హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్ స్పందిస్తూ…జమ్మూకాశ్మీర్ ని సీఎంగా సుదీర్ఘకాలం పాలించిన వాళ్లు కాశ్మీర్ కు ప్రత్యేక ప్రధాని కావాలని అంటున్నారు.ప్రత్యేక ప్రధాని కావాలి ఇలాంటోళ్లు మాట్లాడుతుంటే ఆర్టికల్ 370,ఆర్టికల్ 35A రద్దు చేయడం తప్ప తమకు వేరే మార్గం లేదని రాజ్ నాథ్ అన్నారు.