చెన్నై సహా 4 జిల్లాలో నేడు సంపూర్ణ లాక్ డౌన్

చెన్నై సహా 4 జిల్లాలో నేడు సంపూర్ణ లాక్ డౌన్

తమిళనాడు రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న నేపధ్యంలో చెన్నై, తిరువళ్ళూరు, కాంచీపురం, చెంగల్పట్టు జిల్లాల్లో ఆదివారం జులై 5న సంపూర్ణలాక్ డౌన్ అమలు చేస్తున్నారు. నిత్యావసర వస్తువులైన పాలు కూరగాయలు మినహా మిగతా వ్యాపార సంస్ధలన్నీ మూసి ఉంచారు. జూన్ 19 నుంచి 12 రోజుల పాటు అమలు చేసిన సంపూర్ణ లాక్ డౌన్ లో సహకరించినట్లు గానే ఈ 4 జిల్లాల ప్రజలు జూలై 5,12,19,26న అమలు చేసే సంపూర్ణ లాక్ డౌన్ కు సహకరించాలని సీఎం ఎడప్పాడి పళనిస్వామి కోరారు. జూలై 15 వరకు ప్రభుత్వ రవాణా సంస్ధ బస్సు సర్వీసులను రద్దు చేసినట్లు ఆయన తెలిపారు.

ఈ రోజు చెన్నై, తిరువళ్లూరు, చెంగల్పట్టు, కాంచీపురం జిల్లాలతో పాటు మదురై జిల్లాల్లో కఠిన లాక్‌డౌన్‌ పాటిస్తున్నారు. కఠిన లాక్‌డౌన్‌ పాటించే ఈ నాలుగు జిల్లాల్లో మందుల దుకాణాలు, ఆస్పత్రులు మినహా తక్కిన షాపులన్నీ మూతపడ్డాయి. రోడ్డుపై వాహనాల రాకపోకలను, జన సంచారాన్ని కూడా నిషేధిస్తున్నట్లు గ్రేటర్‌ చెన్నై పోలీసు కమిషనర్‌ మహేష్‌కుమార్‌ అగర్వాల్‌ తెలిపారు. చెన్నై పోలీసు సర్కిల్‌ పరిధిలోకి వచ్చే నాలుగు జిల్లాలకు సంబంధించిన ప్రాంతాల్లో కఠిన నిబంధనలు కచ్చితంగా అమలు చేస్తామన్నారు.

ఇక సోమవారం నుంచి సడలింపులతో కూడిన లాక్‌డౌన్‌ కొనసాగుతుంది. టీదుకాణాలు, హోటళ్లలో ఉదయం ఆరు నుంచి రాత్రి ఎనిమిది గంటల దాకా పార్శిళ్లను మాత్రమే అనుమతిస్తారు. బట్టల కొట్లు, జ్యూయలరీ షాపులను ఏసీ వేయకుండా తెరచేందుకు అనుమతించారు. ఆటోలు, ప్రైవేటు టాక్సీలలో డ్రైవర్‌తో పాటు ఇద్దరు మాత్రమే ప్రయాణించేందుకు అనుమతించారు. కూరగాయల దుకాణాలు, కిరణా సరుకుల దుకాణాలు ఉదయం ఆరు నుంచి సాయంత్రం ఆరు దాకా తెరచి ఉంచనున్నారు.

కరోనా పాజిటివ్ కేసులు ఎక్కువ నమోదవుతున్న మదురై కార్పోరేషన్ పరిధిలో మరో వారం రోజుల పాటు సంపూర్ణ లాక్ డౌన్ అమలు చేస్తూ సీఎం ఎడుప్పాడి పళని స్వామి ఆదేశాలు జారీ చేశారు. మదురై కార్పొరేషన్‌, పరవై మున్సిపాలిటీ మదురై తూర్పు, మదురై పశ్చిమ శివారు ప్రాంతాలు, తిరుప్పరంగుండ్రం ప్రాంతాల్లో అత్యవసర పనులకు మాత్రమే ప్రజలను బయట తిరిగేందుకు అనుమతించనున్నట్టు ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాల్లో పేర్కోన్నారు.