జైల్లో బర్త్ డే వేడుకలు, ఇంకా వీడియో తీశారు

జైల్లో బర్త్ డే వేడుకలు, ఇంకా వీడియో తీశారు

accused celebrate his birthday agrahara central jail : ఓ వ్యక్తి తాపీగా..హుందాగా నడుచుకుంటూ వస్తున్నాడు. షార్ట్, టీ షర్ట్ ధరించిన ఆ వ్యక్తి..అక్కడున్న వారిని పలకరిస్తూ..వస్తున్నాడు. ఓ గదిలో అప్పటికే అతని కోసం ఫ్రెండ్స్ వేచి ఉన్నారు. అక్కడనే ఉన్న కేకు దగ్గరకు వచ్చి కట్ చేశాడు. హ్యాపీ బర్త్ డే అంటూ..అందరూ గ్రీటింగ్స్ చెప్పారు. ఇందులో ఏం విశేషం ఉంది అంటారు. కదా..అతను బర్త్ డే చేసుకుంది..ఓ జైలులో.

మర్డర్ చేశాడు. జైలులో శిక్ష అనుభవిస్తున్నాడు. ఇతని పుట్టిన రోజు రావడంతో..ఫ్రెండ్స్ మధ్య జైలులోనే ఆ వేడుకలను జరుపుకున్నాడు. దీనికి సంబంధించిన దృశ్యాలన్నీ..సెల్ ఫోన్‌లో చిత్రీకరించాడు. దీనికి బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అటాచ్ చేస్తూ..సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. సీన్ కట్ చేస్తే..అసలు అతడికి సెల్ ఫోన్ ఎలా వచ్చిందనే దానిపై పోలీసు అధికారులు ఆరా తీస్తున్నారు. ఈ ఘటన బెంగళూరు నగరంలో చోటు చేసుకుంది.

సుబ్రమణియపుర పీఎస్ పరిధిలో రిజ్వాన్ అలియాస్ రౌడీ కుల్లా..ఓ మర్డర్ కేసులో పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం అగ్రహార జైలుకు తరలించారు. కొంతమంది అనుచరులు కూడా అదే జైలులో ఉన్నారు. బర్త్ డే రావడంతో..స్నేహితులతో కలిసి జైలులోనే వేడుకలు జరుపుకున్నాడు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో వివాదాస్పదంగా మారింది. బర్త్ డే ఘటనపై విచారణ జరుపుతున్నట్లు, రిజ్వాన్‌కు ఫోన్ ఎలా వచ్చిందనే కోణంలో దర్యాప్తు చేస్తున్నామన్నారు జైలు ఉన్నతాధికారులు. రెండు సంవత్సరాల క్రితం..అగ్రహార జైలులో అధికారులు డబ్బులు తీసుకుని..నిబంధనలు ఉల్లంఘిస్తూ…ఖైదీలకు వివిధ ప్రోత్సాహాకాలు ఇస్తున్నారనే ఆరోపణలు చర్చనీయాంశమయ్యాయి.