ఎర్రకోటపై సిక్కు మ‌త జెండా ఆవిష్కరణ…నటుడు దీప్ సిద్ధూ అరెస్టు

ఎర్రకోటపై సిక్కు మ‌త జెండా ఆవిష్కరణ…నటుడు దీప్ సిద్ధూ అరెస్టు

Actor Deep Sidhu arrest : పంజాబీ గాయకుడు, నటుడు దీప్ సిద్ధూను అరెస్టు చేశారు. ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జనవరి 26న అల్లర్లకు దీప్ సిద్ధూ కారణమని ఆరోపణలు ఉన్నాయి. గత నెల 26 నుంచి నటుడు దీప్ సిద్ధూ అజ్ఞాతంలో ఉన్నాడు. రైతుల ట్రాక్టర్ ర్యాలీలో అల్లర్ల తర్వాత కనిపించకుండా పోయాడు. రెండు నెలలుగా ప్రశాంతంగా సాగుతున్న రైతు ఉద్యమాన్ని మరో మలుపు తిప్పిన వ్యక్తి దీప్‌ సిద్ధూ అని తేలింది. చారిత్ర‌క ఎర్ర‌కోట‌పై నిత్యం జాతీయ జెండా రెప‌రెప‌లాడే చోట మంగ‌ళ‌వారం (జనవరి 26, 2021) సిక్కు మ‌త జెండా ఎగురేయడమే కాదు సెక్యూరిటీ పోర్స్ పై దాడికి పురికొల్పడం వెనుకు ఉన్నది కూడా సిద్ధూనే. రైతు సంఘాల నేతలకు కూడా తెలియకుండా తన ఆలోచనను పక్కాగా అమలు చేశాడతను.

ఎర్రకోటపై ‘నిషాన్ సాహిబ్’ పతాకం ఎగురవేసిన సిద్ధూ
ఎర్రకోట వద్ద ఓ ఫ్లాగ్ పోల్ పై పతాకాన్ని తానే ఎగురవేశానని దీప్ సిద్ధూ అంగీకరించాడు. ఈ స్తంభంపై ‘నిషాన్ సాహిబ్’ పతాకాన్ని తను ఎగురవేశానని, కానీ జాతీయ పతాకాన్ని మాత్రం తొలగించలేదని, అది దేశ సమైక్యత, సమగ్రతలకు చిహ్నమని ఆయన అన్నాడు. తన ఫేస్ బుక్ లో ఈ విషయాలు తెలియజేస్తూ.. మన దేశ సమగ్రత, సమైక్యతలను ఎవరూ ప్రశ్నించలేరన్నాడు. ఆ ఘటన జరిగిన సమయంలో నేను అక్కడ ఉన్నది వాస్తవమేనని పేర్కొన్నాడు. మొత్తానికి దీప్ సిద్దూపై పోలీసులు కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేప‌ట్టారు. ఎర్రకోటపై తమ జెండాను ఎగురవేసిన తరువాత ఫేస్ బుక్ ద్వారా లైవ్ లోకి వచ్చిన సిద్ధూ… ఆ దృశ్యాలను చూపిస్తూ, రైతులను మరింత రెచ్చగొట్టే ప్రయత్నం చేశారని పోలీసులు గుర్తించారు.

అసలు సిద్దూ ఎవరు?
పంజాబ్ లోని ముక్తసర్ లోని సిక్కు కుటుంబంలో ఏప్రిల్ 2, 1984లో సిక్కు కుటుంబంలో దీప్ సిద్దు జన్మించాడు. ముక్త్‌సర్‌లోని ప్రభుత్వ పాఠశాలలోనే ప్రాధమిక విద్యను అభ్యసించిన దీప్ సిద్దు.. పటియాలలోని పంజాబ్ యూనివర్సిటీలో డిగ్రీ పూర్తి చేశాడు. అనంతరం పంజాబ్ యూనివర్సిటీ నుంచి లా పట్టా సాధించి.. మోడల్, గాయకుడు, నటుడు, లాయర్ గా పేరు ప్రఖ్యాతలు సంపాదించాడు. 2018లో జోరాదాస్ నంబ్రియా సినిమాలో గ్యాంగ్‌స్ట‌ర్ పాత్ర‌ను పోషించి మంచి పాపులారిటీ సంపాదించుకున్నాడు. ఇక అప్ప‌ట్నుంచి అటు తెర‌పైనే కాకుండా.. నిజ‌జీవితంలో కూడా గ్యాంగ్‌స్ట‌ర్ మాదిరిగానే సిద్దూ ఉంటున్నాడు.

హింసకు ముందు రోజు రాత్రి ఏం జ‌రిగింది?
సోమ‌వారం సాయంత్రం నుంచి ట్రాక్ట‌ర్ ర్యాలీ గురించి యునైటెడ్ కిసాన్ మోర్చా ప్ర‌తినిధులు,- ఢిల్లీ పోలీసుల‌కు మ‌ధ్య చ‌ర్చ‌లు జ‌రుగుతున్నాయి. ఆ స‌మ‌యంలో కొంత మంది యూత్ క‌ల‌గ‌జేసుకుని రూట్‌ మ్యాప్ మార్చాల‌ని ప‌ట్టుబ‌ట్టారు. ఆ యూత్‌లో గుర్తు ప‌ట్ట‌గ‌లిగిన ఒకే ఒక వ్య‌క్తి దీప్ సిద్దూ(40). ఇక అక్క‌డ ఏర్పాటు చేసిన స‌భా వేదిక‌పైకి దీప్ సిద్దూ వెళ్లి ప్ర‌సంగం చేశాడు. మ‌న నాయ‌క‌త్వం తీవ్ర ఒత్తిడికి లోన‌వుతుంది. వారిని ఎక్కువ‌గా ఇబ్బంది పెట్టాల్సిన అవ‌స‌రం లేదు. అంద‌రికీ ఆమోద‌యోగ్య‌మైన నిర్ణ‌యం తీసుకుని ట్రాక్ట‌ర్ ప‌రేడ్‌ను నిర్వ‌హిద్దామ‌ని పిలుపునిచ్చారు. అయితే రైతు సంఘాల ప్ర‌తినిధులను సిద్దూ వేదిక‌పైకి పిలిచాడు. ఒక వేళ వారు రాక‌పోతే మ‌న‌మే నిర్ణ‌యం తీసుకుందామ‌ని చెప్పాడు. వేలాది మంది యువ‌త రింగ్ రోడ్డు వైపుగా ట్రాక్ట‌ర్ ప‌రేడ్ నిర్వ‌హించాల‌ని కోరుకుంటోంది. కిసాన్ మ‌జ్దూర్ సంఘ‌ర్ష్ స‌మితి కూడా రింగ్ రోడ్డువైపు వెళ్తుంది. వారిని అనుస‌రిద్దామ‌ని సిద్దూ ఆ వేదిక‌పై నుంచి కోరాడు.

రెచ్చ‌గొట్టి.. ఎర్ర‌కోట‌పై జెండా
రైతుల ర్యాలీలో యువ‌త‌ను రెచ్చ‌గొట్టిన దీప్ సిద్దూ.. ఎర్ర‌కోట వైపు వెళ్లేలా ప్ర‌ణాళిక ర‌చించాడు. దాంతో అంద‌రూ అటు వైపు వెళ్లారు. ఏకంగా ఎర్ర‌కోట‌పై సిక్కు జెండాను ప్ర‌ద‌ర్శించాడు. ఆ త‌ర్వాత అంద‌రూ అక్క‌డ జాతీయ జెండాల‌తో పాటు సిక్కు జెండాల‌ను ప్ర‌ద‌ర్శించి త‌మ నిర‌స‌న‌ను వ్య‌క్తం చేశారు.

పోలీసులు పట్టించుకోలేదు
దీప్ సిద్దును తాము ముందు నుంచి వ్యతిరేకిస్తున్నామని, ఘటన సమయంలో ఆయన ఎర్రకోట వద్దే ఉన్నారని స్వరాజ్‌ ఇండియా నేత యోగేంద్ర యాదవ్‌ ఓ టీవీ కార్యక్రమంలో తెలిపారు. ట్రాక్టర్ల ర్యాలీకి ముందు రోజు కూడా సిధు రైతులను రెచ్చగొట్టేందుకు ప్రయత్నించారని, ఈ విషయంపై తాను పోలీసులకు చెప్పినా ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆరోపించారు. ఆయన ఎర్రకోటకు ఎలా చేరుకున్నారో దర్యాప్తు జరపాలని డిమాండ్‌ చేశారు.

సిద్దూకు బీజేపీతో సంబంధాలు
సిద్దూ.. 2019 లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో బీజేపీ అభ్య‌ర్థి స‌న్ని డియోల్ త‌ర‌పున ప్ర‌చారం చేశాడు. దీంతో కొందరు బీజేపీ నాయకులతో ఆయనకు సత్ససంబంధాలు ఏర్పడ్డాయి. దీంతో బీజేపీ నేతలకు దీప్ సిద్దూ సన్నిహితుడనే ప్రచారం కూడా సాగుతోంది. అంతే కాదు.. ప్ర‌ధాని న‌రేంద్ర మోడీతో స‌న్నిడియోల్‌, దీప్ సిద్దూ క‌లిసి దిగిన ఫోటోలు కూడా బయటికొచ్చాయి. దీంతో సిద్దూ బీజేపీ నేత‌నే అన్న వార్త‌ల‌కు బ‌లం చేకూరిన‌ట్లు అయింది.

సిద్దూకు ఎన్ఐఏ నోటీసులు
దీప్ సిద్దూకు జాతీయ ద‌ర్యాప్తు సంస్థ‌(ఎన్ఐఏ) ఇటీవ‌లే నోటీసులు జారీ చేసింది. సిక్కు ఫర్ జస్టిస్ అనే వేర్పాటువాద సంస్థతో సిద్దూకు సంబంధాలున్నాయనే ఆరోపణలు ఉన్నాయి. సిక్ ఫ‌ర్ జ‌స్టిస్ కేసులో సిద్దూతో పాటు అత‌ని సోద‌రుడు మ‌న్‌దీప్ సింగ్‌కు కూడా ఎన్ఐఏ నోటీసులు ఇచ్చింది. ఇదే కాకుండా సిద్దూ క్రూర‌మైన నేరాల‌కు పాల్ప‌డిన‌ట్లు కేసులు న‌మోదైన‌ప్ప‌టికీ, అన్ని కేసుల్లో నిర్దోషిగా బ‌య‌ట‌ప‌డ్డాడు.