అన్నాడీఎంకే-బీజేపీ కూటమికి విజయకాంత్ గుడ్ బై

అన్నాడీఎంకే-బీజేపీ కూటమికి విజయకాంత్ గుడ్ బై

Actor Vijayakanth అసెంబ్లీ ఎన్నికల వేళ తమిళనాడులో కీలక పరిణామాం చోటుచేసుకుంది. తమిళనాడులో వరుసగా మూడోసారి అధికారాన్ని కైవసం చేసుకోవాలని భావిస్తున్న అధికార అన్నాడీఎంకే కూటమికి ఊహించని షాక్ తగిలింది. సినీ నటుడు విజయకాంత్​ నేతృత్వంలోని దేశీయ ముర్​పొక్కు ద్రవిడ కళగం(డీఎండీకే) పార్టీ.. అన్నాడీంకే-బీజేపీ కూటమి నుంచి తప్పుకుంటున్నట్లు మంగళవారం ప్రకటించింది.

ఎన్నికల్లో తమకు తగినన్ని సీట్లు కేటాయించలేదని..సీట్ల పంపకాల్లో అభిప్రాయభేదాలే కూటమి నుంచి తప్పుకోవడానికి కారణంగా డీఎండీకే పేర్కొంది. 23 అసెంబ్లీ, ఒక రాజ్యసభ సీటు కోసం విజయ్ కాంత్ అన్నాడీఎంకేను కోరారు. అయితే కేవలం 13 అసెంబ్లీ సీట్లు మాత్రమే ఇస్తామని అధికార పార్టీ చెప్పడంతో విజయ్‌కాంత్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో పార్టీల నేతలతో సమావేశమైన విజయ్‌కాంత్..కూటమి నుంచి వైదొలుగుతున్నట్లు స్పష్టం చేశారు.

2019లో ఎన్​డీఏలో చేరిన డీఎండీకే పరిస్థితి మొదటినుంచి అగమ్యగోచరంగా ఉంది. ఇటు అన్నాడీఎంకే కూటమిలో ప్రాధాన్యం లేక, డీఎంకేతో కలవలేక ఒంటరిగా మిగిలిపోయే స్థితికి చేరింది. 2016 అసెంబ్లీ ఎన్నికల్లో జయలలిత వెంటే విజయకాంత్ నడిచారు. అన్నాడీఎంకే, డీఎండీకే కలసి పోటీ చేశాయి. ఎన్నికల తర్వాత మళ్లీ విడిపోయాయి.

అయితే, తిరిగి 2019 లోక్ సభ ఎన్నికల్లో అన్నాడీఎంకే-బీజేపీ కూటమిలో డీఎండీకే చేరింది. ఆ ఎన్నికల్లో డీఎండీకే నాలుగు స్థానాల్లో పోటీచేసింది. చివరి నిమిషంలో విజయ్ కాంత్‌ చేరినా సీట్లు సర్దుబాటు చేశారు. అయితే, ఈ కూటమి ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. ఒక్క స్థానంలో మాత్రమే కూటమి విజయం సాధించింది. ఇక, 2014 లోక్‌సభ ఎన్నికల్లో తమిళనాడులోని మొత్తం 39 ఎంపీ స్థానాలకుగానూ అన్నాడీఎంకే 37 చోట్ల గెలుపొందింది. ఒక్క స్థానంలో పోటీచేసిన విజయ్ కాంత్ పార్టీ డీఎండీకే ఓటమిపాలయ్యింది. కేవలం 5.1 శాతం ఓట్లు మాత్రమే సాధించింది.