నందిగ్రామ్ లో తన అసలు గోత్రం గురించి చెప్పిన మమత

వెస్ట్ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు కోసం టీఎంసీ-బీజేపీ పార్టీలు తమ అమ్ములపొదిలోని అన్ని అస్త్రాలను ప్రయోగిస్తున్నాయి.

నందిగ్రామ్ లో తన అసలు గోత్రం గురించి చెప్పిన మమత

Mamata Banerjee

Mamata Banerjee వెస్ట్ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు కోసం టీఎంసీ-బీజేపీ పార్టీలు తమ అమ్ములపొదిలోని అన్ని అస్త్రాలను ప్రయోగిస్తున్నాయి. హిందుత్వ ఎజెండాతో బీజేపీ జనంలోకి దూకుడుగా వెళ్తుండగా… టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ కూడా తానూ హిందువునే అని పదేపదే చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు. తాను బ్రాహ్మణ మహిళను అని…హిందుత్వ గురించి తనకు బోధించాల్సిన అవసరం లేదని ఇటీవల ఎన్నికల ప్రచాంలో మమతా బెనర్జీ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. తాజాగా నందిగ్రామ్‌లో చివరి రోజు ప్రచారంలో మమతా తన గోత్రం గురించి కూడా చెప్పుకొచ్చారు.

మంగళవారం(మార్చి- 30,2021)తాను పోటీ చేస్తోన్న నందిగ్రామ్ నియోజకవర్గంలో చివరిరోజు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న మమత మాట్లాడుతూ…నందిగ్రామ్‌లో నేను రెండోసారి ప్రచారానికి వచ్చినప్పుడు స్థానిక దేవాలయానికి వెళ్లాను. అక్కడి పూజారి నా గోత్రం అడిగారు. అందుకు నేను “తల్లి,జన్మభూమి,ప్రజలు(2011ఎన్నికల్లో మమతని అధికారంలోకి తీసుకొచ్చిన నినాదం ఇదే)” అని బదులిచ్చాను. అదే నా గోత్రం అని చెప్పాను. గతంలో త్రిపురలో త్రిపురేశ్వరి ఆలయానికి వెళ్లినప్పుడు కూడా అక్కడి పూజారి గోత్రం అడిగితే ఇదే చెప్పాను. కానీ నా అసలు గోత్రం “శాండిల్య(బ్రాహ్మాణుల 8పెద్ద గోత్రాలలో ఒకటి)” అని మమతా బెనర్జీ చెప్పుకొచ్చారు.

మమత గోత్రం కార్డును ఉపయోగించడంపై బీజేపీ నుంచి తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఓటమి భయంతోనే మమత ఇలా గోత్రం కూడా చెప్పుకుంటున్నారని బీజేపీ విమర్శిస్తోంది. రోహింగ్యాలు,చొరబాటుదారులు కూడా శాండిల్య గోత్రంలోనే ఉన్నారా? కేంద్రమంత్రి గిరిరాజ్ సింగ్ ప్రశ్నించారు. మమత ఎన్ని చెప్పినా నందిగ్రామ్ లో ఆమె ఓటమి ఖాయమని,రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేది బీజేపీనేనని గిరిరాజ్ సింగ్ అన్నారు.

కాగా, రెండో దశలో భాగంగా ఏప్రిల్​-1,2021న బెంగాల్​లో 30అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరగనుంది.రెండో దశలో భాగంగా బెంగాల్​లోని దక్షిణ 24 పరగణాలు, బంకురా, పూర్వ మెద్నీపూర్ జిల్లాల్లోని నియోజకవర్గాలకు పోలింగ్ జరగనుంది. బెంగాల్​లో​ ప్రభుత్వ ఏర్పాటుకు రెండో దశలోని నియోజకవర్గాలే కీలకం కానున్నాయి. సీఎం మమతా బెనర్జీ, బీజేపీ నేత సువేందు అధికారి పోటీ చేస్తున్న నందిగ్రామ్​పైనే సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ నియోజవర్గానికి కూడా రేపే పోలింగ్ జరగనుంది.