Gautam Adani సిమెంట్‌ రంగంలో కీలక అడుగు వేసిన అదానీ గ్రూప్

గౌతమ్‌ అదానీ.. పరిచయం అవసరం లేని పేరు. ఒక్కడుగా మొదలై లక్షల మందికి తోడై.. ఎవరూ కనీసం టచ్‌ చేయలేని స్థాయిలో వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్మించారు. వంట నూనెల నుంచి విద్యుత్ వెలుగుల వరకు.. ప్రతీ రంగంలో ఆయన పట్టిందల్లా.. ముట్టిందల్లా బంగారం అవుతోంది. అలాంటి అదానీ గ్రూప్ ఇప్పుడు సిమెంట్‌ రంగంలో కీలక అడుగు వేసింది.

Gautam Adani సిమెంట్‌ రంగంలో కీలక అడుగు వేసిన అదానీ గ్రూప్

Adani Group Is Now A Key Player In The Cement Sector

ADANI : గౌతమ్‌ అదానీ.. పరిచయం అవసరం లేని పేరు. ఒక్కడుగా మొదలై లక్షల మందికి తోడై.. ఎవరూ కనీసం టచ్‌ చేయలేని స్థాయిలో వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్మించారు. వంట నూనెల నుంచి విద్యుత్ వెలుగుల వరకు.. ప్రతీ రంగంలో ఆయన పట్టిందల్లా.. ముట్టిందల్లా బంగారం అవుతోంది. అలాంటి అదానీ గ్రూప్ ఇప్పుడు సిమెంట్‌ రంగంలో కీలక అడుగు వేసింది. ఆ సిమెంట్‌తో తన వ్యాపార సామ్రాజ్యాన్ని మరింత స్ట్రాంగ్ చేసుకోవాలని భావిస్తోంది. ఏడాది నుంచి ప్రణాళిక రచిస్తే.. ఇన్నాళ్లకు నిజం అయింది. ఇంతలా అదానీ ఎందుకు దృష్టిసారించినట్లు.. ఆయన అడుగులు ఇకపై ఎలా ఉండబోతున్నాయ్ ?

గౌతమ్ అదానీ.. పరిచయం అవసరం లేని పేరు. కొందరు అవకాశాలు గుర్తిస్తారు.. కొందరు అందుకుంటారు. అదానీ మాత్రం సృష్టించుకుంటారు. పక్కాగా లెక్కలేసి.. అద్భుతాలు క్రియేట్ చేస్తారు. ఆ గుణమే ఆయనను భారత వ్యాపార రంగానికి మకుటం లేని మహారాజును చేసింది. భారతదేశ కుభేరుడిగా నిలిపింది. అదానీ పేరు మాత్రమే కాదు.. అదో బ్రాండ్ అంతే ! తన విజయాలు, ఆలోచనలే.. అదానీని ఆ స్థాయిలో కూర్చోబెట్టాయ్. పోర్టుల నిర్మాణం, బొగ్గు పరిశ్రమలతో ఆసియా కుబేరుడిగా అవతరించిన అదానీ…. ఇప్పుడు సిమెంట్ రంగంలోనూ సత్తా చాటేందుకు సిద్ధమయ్యారు. తన వ్యాపార సామ్రాజ్యానికి సిమెంట్ కోటింగ్‌ వేయబోతున్నారు. నిర్మాణం మరింత స్ట్రాంగ్‌గా ఉండేలా ప్లాన్ చేసుకుంటున్నారు.

అదానీ గ్రూప్ దేశంలో రెండో అతిపెద్ద సిమెంట్ తయారీ సంస్థగా మారబోతోంది. దేశంలోని రెండు అతిపెద్ద సిమెంట్ కంపెనీలు అంబుజా, ACC సిమెంట్స్ ఇప్పుడు గౌతమ్ అదానీ నేతృత్వంలోని అదానీ గ్రూప్‌లో చేరాయ్. ఈ రెండు కంపెనీలను స్విస్ కంపెనీ హోల్సిమ్ నుంచి అదానీ గ్రూప్ కొనుగోలు చేసింది. ఈ డీల్ విలువ ఓపెన్‌ ఆఫర్‌తో కలిపి 10.5 బిలియన్ డాలర్లు అంటే దాదాపు 81 వేల కోట్ల రూపాయలు. అదానీ గ్రూప్… విదేశీ అనుబంధ సంస్థ ద్వారా ఈ వాటాను కొనుగోలు చేస్తుంది. అంబుజా సిమెంట్స్‌లో 63.19శాతం వాటాను అదానీ గ్రూప్‌ కొనుగోలు చేసింది. అల్ట్రాటెక్, JSW గ్రూప్‌ను వెనక్కి నెట్టి.. అంబుజా వాటా కొనుగోలు రేసులో అదానీ గ్రూప్‌ ముందు నిలిచింది. ఈ ఒప్పందంతో… అదానీ గ్రూప్ దేశంలో సిమెంట్ తయారీ రంగంలో రెండో అతిపెద్ద సంస్థగా అవతరించనుంది.

హోల్సిమ్‌కు అంబుజా సిమెంట్స్‌లో 63.19శాతం వాటా ఉంది. ACC లో 54.53శాతం వాటా ఉంది. అందులో 50.05శాతం వాటా అంబుజా సిమెంట్స్‌ది. ఐతే ఇప్పుడీ లావాదేవీతో ఈ రెండు దిగ్గజ సంస్థల నియంత్రిత వాటా అదానీకి లభించినట్లే ! నౌకాశ్రయాలు, విమానాశ్రయాలు, విద్యుత్తుప్లాంట్లు, బొగ్గుగనులు, డేటాకేంద్రాలు, డిజిటల్‌ సేవలు, రిటైల్‌ విభాగాల్లో అగ్రగామిగా ఉన్న అదానీ… సిమెంటు రంగంలోనూ దూసుకెళ్లేందుకే ఈ భారీ ఒప్పందం కోసం తీవ్రంగా ప్రయత్నించింది. చివరికి సాధించింది. ఇప్పటికే అదానీ ఎంటర్‌ప్రైజెస్‌కు 2 సిమెంట్ అనుబంధ సంస్థలు ఉన్నాయ్. ఈ లావాదేవీతో దేశం నుంచి ఉపసంహరణకు గురైన అతిపెద్ద విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి హోల్సిమ్‌దే అవుతుంది.

అదానీ సిమెంట్ ఇండస్ట్రీస్ పేరుతో అదానీ గ్రూప్ గతేడాది సిమెంట్ రంగంలోకి ప్రవేశించింది. ఐతే ఇప్పుడీ ఒప్పందం తర్వాత, అదానీ గ్రూప్ భారతదేశంలో రెండవ అతిపెద్ద సిమెంట్ తయారీ సంస్థ కాబోతోంది. 1936ఆగస్టు ఒకటిన ముంబైలో ACC ప్రారంభమైంది. అంబుజా సిమెంట్‌ను 1983లో నరోత్తమ్ సెఖ్‌సారియా, సురేష్ నియోటియా స్థాపించారు. 17ఏళ్ల కింద హోల్సిమ్ సంస్థ భారతదేశంలో వ్యాపారం ప్రారంభించింది. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద సిమెంట్ కంపెనీగా లెక్కలేస్తారు. అంబుజా ప్రస్తుత ఉత్పత్తి సామర్థ్యం సంవత్సరానికి 31.5 మిలియన్ టన్నులుగా ఉంది. మరో 7మిలియన్ టన్నుల విస్తరణ ప్రణాళికపై పనిచేస్తోంది. ఏసీసీ అనేది అంబుజా సిమెంట్ అనుబంధ సంస్థగా ఉంది. ACC ప్రస్తుత ఉత్పత్తి సామర్థ్యం 34 మిలియన్ టన్నుల కాగా.. ఇది ప్రస్తుతం అనేక ప్రాజెక్ట్‌లలో పనిచేస్తోంది. ప్రస్తుతం ఈ రెండింటి ఉత్పత్తి సామర్థ్యం 66 మిలియన్ టన్నులు

దేశాభివృద్ధిలో కీలకపాత్ర పోషించేందుకు సిమెంట్‌ రంగంలో అడుగుపెడుతున్నామని గౌతమ్ గ్రూప్‌ ప్రకటించింది. ప్రపంచంలో రెండో అతిపెద్ద సిమెంట్ మార్కెట్‌గా భారత్ ఉంది. అయితే సిమెంట్ వినియోగం అంతర్జాతీయ సగటుతో పోలిస్తే తక్కువగా ఉంది. అంతర్జాతీయంగా మూలధన వినియోగం 525 కేజీలు ఉంటే భారత్‌లో 242 కేజీలు మాత్రమే. దేశంలో పట్టణీకరణ పెరుగుతుండడం… కరోనా తర్వాత నిర్మాణ, మౌలిక రంగాలు పుంజుకోవడం వంటి కారణాలతో రానున్న దశాబ్దాల్లో సిమెంట్ వినియోగం భారీ ఎత్తున ఉంటుందని భావిస్తున్నారు. దీన్ని అందిపుచ్చుకోవాలన్నదే అదానీ ప్లాన్. హోల్సిమ్‌తో ఒప్పందం మౌలిక సదుపాయాల రంగంలో అతి పెద్దది అని అదానీ గ్రూప్ అంటోంది. ఒప్పందంలో 48వేల 944కోట్లు నగదు రూపంలో తీసుకోవాలని హోల్సిమ్ భావిస్తోంది. సెబీ నిబంధనల ప్రకారం అంబుజా, ఏసీసీ కంపెనీల్లో నాన్ ప్రమోటర్ వాటాదారుల నుంచి 26శాతం వాటా కొనుగోలుకు అదానీ గ్రూప్ ఓపెన్ ఆఫర్ ప్రకటించాల్సి ఉంది. ఈ ఏడాది ద్వితీయార్థంలో ఒప్పందం పూర్తయ్యే అవకాశం ఉంది.

అంబుజా సిమెంట్స్, ఏసీసీకి… అద్భుతమైన తయారీ, స్లప్లయ్‌ చెయిన్, డిస్ట్రిబ్యూషన్ వ్యవస్థ ఉంది. దీంతో భారతదేశంలోని బలమైన బ్రాండ్‌లుగా నిలిచాయి. రెండు కంపెనీలకు ప్రస్తుతం 23 సిమెంట్ ప్లాంట్లు, 14 గ్రైండింగ్ స్టేషన్లు, 80 రెడీ-మిక్స్ కాంక్రీట్ ప్లాంట్లు, 50వేల కంటే ఎక్కువ ఛానెల్ భాగస్వాములు ఉన్నారు. ప్రస్తుతం సిమెంట్ రంగంలో 111.4 మిలియన్ టన్నుల ఉత్పత్తి సామర్థ్యంతో అల్ట్రాటెక్ మొదటిస్థానంలో ఉండగా… ఏసీసీ, అంబుజా సిమెంట్ సంయుక్తంగా 70 మిలియన్ టన్నులతో తర్వాత స్థానంలో ఉంది. అలాంటి రెండు సంస్థలను హోలిమ్స్‌ ఒప్పందంతో అదానీ గ్రూప్ సొంతం చేసుకుంది. నిజానికి కొన్నేళ్లుగా అదానీ ఏది పట్టుకున్నా బంగారంలా మారుతోంది. పోర్టుల నిర్వహణ, పవర్ ప్లాంట్లు, బొగ్గు గనులు, ఎయిర్‌పోర్టులు, డేటా సెంటర్లు, క్లీన్ ఎనర్జీ వంటి అన్ని రంగాల్లో పెట్టుబడులు పెడుతున్న అదానీ.. ఇప్పుడీ హోల్సిమ్ ఒప్పందంతో సిమెంట్ తయారీ రంగంలోనూ అడుగుపెడుతున్నారు. ఇక సిమెంట్ రంగంలో అద్భుతాలు చూడబోతున్నామన్న చర్చ వ్యాపారవర్గాల్లో మొదలైంది.