Free Vaccine : సుప్రీంకోర్టు మందలింపుతోనే ఉచిత వ్యాక్సిన్

దేశ ప్రజలకు కోవిడ్ వ్యాక్సిన్ అందించే బాధ్యత కేంద్రానిదేనని ఇవాళ ప్రధాని మోడీ ప్రకటించిన విషయం తెలిసిందే.

Free Vaccine : సుప్రీంకోర్టు మందలింపుతోనే ఉచిత వ్యాక్సిన్

Free Vaccine

Free Vaccine దేశ ప్రజలకు కోవిడ్ వ్యాక్సిన్ అందించే బాధ్యత కేంద్రానిదేనని ఇవాళ ప్రధాని మోడీ ప్రకటించిన విషయం తెలిసిందే. వ్యాక్సిన్ ఉత్పత్తిదారుల నుంచి కేంద్రమే డోసులు కొనుగోలు చేసి రాష్ట్రాలకు అందిస్తుందని, దేశంలో అన్ని వర్గాల ప్రజలకు వ్యాక్సిన్ ను ఉచితంగానే అందిస్తామని ప్రకటించారు. ఈ నెల 21 నుంచి 18 ఏళ్లకు పైబడిన అందరికీ కేంద్రం ఉచితంగా వ్యాక్సిన్ డోసులు అందిస్తుందని ప్రధాని తెలిపారు. ఎవరైనా ఉచిత టీకా వద్దనుకుంటే సొంతఖర్చుతో ప్రైవేటుగా టీకా వేయించుకోవచ్చని పేర్కొన్నారు. రూ.150 సర్వీస్ చార్జితో ప్రైవేటుగా వ్యాక్సిన్ పొందవచ్చని పేర్కొన్నారు. వ్యాక్సిన్లలో 25 శాతాన్ని ప్రైవేటు రంగానికి అందుబాటులో ఉంచుతామని తెలిపారు.

అయితే, ప్రధాని మోడీ ఇవాళ చేసిన కొత్త వ్యాక్సిన్ పాలసీపై విపక్షాలు పెదవి విరిచాయి. సుప్రీంకోర్టు మంద‌లించ‌డంతోనే ఆల‌స్యంగా ప్రధాని ఈ ప్ర‌క‌ట‌న చేశార‌ని విప‌క్షాలు దుయ్య‌బ‌ట్టాయి. ఉచిత వ్యాక్సినేష‌న్ పై సుప్రీంకోర్టు ఉత్త‌ర్వుల‌తోనే ప్ర‌ధాని స్పందించార‌ని, ఈ నిర్ణ‌యం ప్ర‌క‌టించేందుకు ఇంత స‌మ‌యం ఎందుకు తీసుకున్నార‌ని విప‌క్షాలు ప్ర‌శ్నించాయి. వ్యాక్సిన్ స‌ర‌ఫ‌రాల్లో తీవ్ర జాప్యం ద్వారా దేశానికి మీరు చేసిన గాయం పూడ్చ‌లేనిద‌ని కాంగ్రెస్ పేర్కొంది. ఉచిత వ్యాక్సినేష‌న్ తో పాటు కేంద్ర‌మే వ్యాక్సిన్ల‌ను సేక‌రించాల‌ని రాహుల్ గాంధీ డిమాండ్ చేసిన అనంత‌రం ప్ర‌ధాని మోదీ దిగివ‌చ్చార‌ని ఆ పార్టీ వ్యాఖ్యానించింది.

వ్యాక్సిన్ల స‌మీక‌ర‌ణ బాధ్య‌త‌ను కేంద్ర‌మే చేప‌ట్టాల‌ని, 18-44 ఏళ్ల వ‌య‌సు వారికి ఉచిత వ్యాక్సిన్ అందించాల‌న్న ప్ర‌తిప‌క్షాల డిమాండ్ ను ఆమోదించేందుకు ప్ర‌జ‌ల‌పై పెను భారం మోపే వ‌ర‌కూ స‌మ‌యం తీసుకున్నార‌ని కాంగ్రెస్ నేత జైరాం ర‌మేష్ ట్వీట్ చేశారు. సుప్రీం కోర్టు ఉత్తర్వుల‌కు త‌లొగ్గి కేంద్రం ఈ నిర్ణ‌యం తీసుకుంద‌ని, జాతీయ వ్యాక్సినేష‌న్ కార్య‌క్ర‌మం చేప‌ట్టాల‌ని తాము డిమాండ్ చేశామ‌ని ఆప్ పార్టీ తెలిపింది. సుప్రీం కోర్టు మంద‌లింపుతో ఇప్ప‌టికైనా కేంద్ర ప్ర‌భుత్వం మేలుకొంద‌ని ఆప్ ఎమ్మెల్యే రాఘ‌వ్ చ‌ద్దా అన్నారు. ఇక, కొత్త వ్యాక్సిన్ పాలసీపై మోడీ ప్రకటనను బీజేపీ పాలిత రాష్ట్రాల సీఎంలు, కేంద్రమంత్రులు, కాషాయ పార్టీ నేత‌లు స్వాగ‌తించారు.