ఐదేళ్లలో 10లక్షల ఉద్యోగాలు

ఐదేళ్లలో 10లక్షల ఉద్యోగాలు

విమర్శలు ఎన్నొచ్చినా.. పెట్టుబడి పెడతాం ఉద్యోగాలు కల్పిస్తాం అంటున్నాడు అమెజాన్ సీఈఓ జెఫ్ బెజోస్. ఆన్‌లైన్‌ షాపింగ్‌ దిగ్గజం అమెజాన్‌ భారత్‌లో కార్యకలాపాలను గణనీయంగా విస్తరించాలనే యోచనలో భాగమే ఈ ఉద్యోగాల కల్పన. ఇందులో భాగంగా భారత పర్యటనకు వచ్చి భారీ ప్రణాళికలను భారత్ ముందుంచారు. రాబోయే ఐదేళ్లలో 10 లక్షల ఉద్యోగాలు కల్పించనున్నట్లు వెల్లడించారు. 

ఐటీ, టెక్నికల్ డెవలప్‌మెంట్, కంటెంట్‌ క్రియేషన్, రిటైల్, తయారీ తదితర విభాగాల్లో ఉపాధి కల్పించనున్నట్లు శుక్రవారం ఒక ప్రకటనలో తెలియజేశారు. ఆరేళ్లుగా భారత్‌లో పెట్టుబడులు పెట్టి ఏడు లక్షల ఉద్యోగాలు ఇచ్చామని బెజోస్‌ పేర్కొన్నారు. 

చిన్న, మధ్య తరహా సంస్థ(ఎస్‌ఎంఈ)లు ఆన్‌లైన్‌ బాట పట్టేలా తోడ్పాటు అందించేందుకు సుమారు రూ. 7వేల కోట్ల మేర ఇన్వెస్ట్‌ చేయనున్నట్లు, 2025 నాటికి 10 బిలియన్‌ డాలర్ల విలువ చేసే మేడిన్‌ ఇండియా ఉత్పత్తులను ఎగుమతి చేయనున్నట్లు బెజోస్‌ ఇప్పటికే ప్రకటించారు. 

‘ఇక్కడికి వచ్చిన ప్రతిసారీ భారత్‌పై నాకున్న ఇష్టం రెట్టింపవుతూ వస్తోంది. అపరిమితమైన ఉత్సాహం, కొత్త ఆవిష్కరణలు, భారతీయుల మొక్కవోని దీక్ష నాకు స్ఫూర్తినిస్తుంటాయి‘ అని ఆయన రాశారు. అనుచిత వ్యాపార విధానాలు పాటిస్తున్నాయంటూ అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లపై కాంపిటీషన్‌ కమిషన్‌ విచారణకు ఆదేశించిన తరుణంలో బెజోస్‌ పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది. శుక్రవారంతో ముగిసిన 3రోజుల భారత పర్యటనలో బెజోస్‌ పలువురు వ్యాపార దిగ్గజాలతో భేటీ అయ్యారు.