మోడీ ఒప్పందంతోనే అంబానీకి రూ. 1121 కోట్లు లాభమా..

  • Published By: raju ,Published On : April 13, 2019 / 03:44 PM IST
మోడీ ఒప్పందంతోనే అంబానీకి రూ. 1121 కోట్లు లాభమా..

అంబానీపై మరో పిడుగు పడింది. రాఫెల్ ఒప్పందంలో అనిల్ అంబానీ పాత్ర ఉందని ప్రతిపక్షాలు విమర్శిస్తుండగా.. ఫ్రాన్స్ మీడియా మరో వార్తతో సంచలనం రేపింది. ఆ ఒప్పందానికి అంబానీకి సంబంధాలున్నాయనే అర్థం వచ్చేలా పరోక్షంగా కథనాన్ని ప్రచురించింది. ఇందులో నరేంద్ర మోడీ పాత్ర కూడా ఉందా అనే అనుమానం వచ్చేట్లు వెల్లడించింది. ఫ్రాన్స్ దేశానికి చెల్లించాల్సి ఉన్న 143.7మిలియన్‌ యూరోల పన్ను(రూ. 1,121కోట్లు)ను మాఫీ చేశారంటూ ‘లీ మోండే’ అనే ఫ్రెంచ్ పత్రిక ప్రచురించింది. ఫ్రాన్స్ దేశంలో ‘రిలయన్స్‌ అట్లాంటిక్‌ ఫ్లాగ్‌ ఫ్రాన్స్‌’ అనే సంస్థకు అనిల్ అంబానీ యజమానిగా ఉన్నారు.

లీ మోండే కథనం ప్రకారం.. ‘ఆ సంస్థ ఆర్థిక పరిస్థితులు బాగుండకపోవడంతో 2007 నుంచి పన్నులు ఎగ్గొడుతుంది. దాంతో సంస్థపై పన్ను అధికారులు తీవ్రంగా ఒత్తిడి తెచ్చారు. దాంతో పలుమార్లు పన్నును తగ్గించాలని కోరుతూ.. అంబానీకి చెందిన కంపెనీ రిక్వెస్ట్ చేసింది. దీనికి నిరాకరించిన పన్ను అధికారులు నరేంద్ర మోడీ ఫ్రాన్స్‌తో రాఫెల్ ఒప్పందం కుదుర్చుకున్న కొన్ని నెలలకే మొత్తం మాఫీ చేసేశారు. 2015 ఏప్రిల్‌లో భారత ప్రధాని మోడీ ఫ్రాన్స్‌‌లో పర్యటించారు. ఆ సమయంలోనే 36 రాఫెల్‌ యుద్ధ విమానాల ఒప్పందం కుదుర్చుకున్నారు. అదే సంవత్సరం అక్టోబరులో అనిల్‌ అంబానీకి చెందిన పన్నులు మొత్తం మాఫీ చేసిందని ఆ పత్రిక వెల్లడించింది.

అస్సలు పట్టించుకోలేదు: యుద్ధ విమానాల ఒప్పందం కుదుర్చుకోక ముందు అంబానీ కంపెనీ పన్నులో మినహాయింపు ఇవ్వమని వేడుకున్నా పట్టించుకోలేదు. ఆ పన్ను వివరాలు సంవత్సరాల వారీగా పెరుగుతూనే ఉంది. 2007-10 మధ్య 60మిలియన్‌ యూరోలు ఉండగా దానిని తగ్గించాలని 7.6మిలియన్‌ యూరోలు చెల్లిస్తామని వేడుకుంది. మరోసారి 2010-12 సమయంలో 91మిలియన్‌ యూరోలు చెల్లించాలని లెక్కతేలింది. అదీ నిర్లక్ష్యం చేయడంతో 2015 నాటికి 151 మిలియన్‌ యూరోలకు చేరింది.

తగ్గించి.. మాఫీ చేసేశారు: 2015లో రాఫెల్ ఒప్పందం కుదిరిన కొన్ని నెలలకే ఆ సంస్థ పన్నును 7.6మిలియన్‌ యూరోలను పన్నుగా చెల్లించింది. అప్పటికీ 143.7మిలియన్ యూరోల ట్యాక్స్ బాకీ ఉన్నా.. ఫ్రాన్స్‌ దేశం రద్దు చేసినట్లు ఆ పత్రికలో వివరించింది.