కరోనా, ఈ బిజినెస్ మ్యాన్ మనసు మార్చింది, పేదల కోసం గొప్ప నిర్ణయం తీసుకున్నారు

  • Published By: naveen ,Published On : July 22, 2020 / 02:14 PM IST
కరోనా, ఈ బిజినెస్ మ్యాన్ మనసు మార్చింది, పేదల కోసం గొప్ప నిర్ణయం తీసుకున్నారు

కరోనా వైరస్ మమమ్మారి మనిషి ప్రాణాలను తియ్యడమే కాదు మానవత్వాన్ని చంపేస్తోందని, మానవ సంబంధాలను మంటగలుపుతోందని అంతా బాధపడుతున్నాం. మాయదారి కరోనా, పాడు కరోనా అని తిట్టుకుంటున్నాం. ఇప్పుడు అదే కరోనా వైరస్, మనిషిలో మార్పు తీసుకొస్తోంది. డబ్బే శాశ్వతం కాదని తెలిసేలా చేస్తోంది. మనిషిలో దయ, జాలి గుణాలు పెంచుతోంది. పేదలకు, కష్టాల్లో ఉన్నవారికి సాయం చేసేలా చేస్తోంది. కరోనా వైరస్ మమమ్మారి ఓ బిజినెస్ మ్యాన్ లో గణనీయమైన మార్పు తెచ్చింది. పేద కరోనా రోగులకు ఉచితంగా చికిత్స అందించేందుకు కొవిడ్ ఆసుపత్రిని నిర్మించేలా చేసింది.

బిజినెస్ మేన్ లో మార్పు తెచ్చిన కరోనా:
ఆయన పేరు ఖాదర్ షేక్. వయసు 63 ఏళ్లు. గుజరాత్ రాష్ట్రంలోని సూరత్ వాసి. రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తారు. నెల రోజుల క్రితం ఖాదర్ కరోనా బారిన పడ్డారు. ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో జాయిన్ అయ్యారు. చికిత్స తీసుకుని కరోనా నుంచి కోలుకున్నారు. కాగా, ఆ ఆసుపత్రి ట్రీట్ మెంట్ కు గాను లక్షల రూపాయల బిల్లు వేసింది. డబ్బున్న వాడే కాబట్టి బిల్లు కట్టేసి డిశ్చార్జి అయ్యారు. అయితే ఈ ఘటన ఆయన జీవితాన్ని మలుపు తిప్పింది. ఆయనను ఆలోచనలో పడేసింది. డబ్బున్న వారి సంగతి సరే, మరి పేదల పరిస్థితి ఏంటి? వారికి కరోనా వస్తే ప్రైవేట్ ఆసుపత్రిలో ట్రీట్ మెంట్ తీసుకోగలరా? లక్షల రూపాయల బిల్లు చెల్లించగలరా? అనే ప్రశ్నలు ఆయనను ఉక్కిరిబిక్కిరి చేశాయి. రెక్కాడితే కానీ డొక్కాడని పేదల దుస్థితి ఆయనను ఆలోచనలో పడేసింది.

పేద కరోనా రోగుల కోసం కొవిడ్ ఆసుపత్రి నిర్మాణం, ఉచితంగా చికిత్స:
వెంటనే ఖాదర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. కొవిడ్ ఆసుపత్రి నిర్మించాలని నిర్ణయించారు. అందులో పేద కరోనా రోగులకు ఉచితంగా ట్రీట్ మెంట్ ఇవ్వాలనుకున్నారు. ఇందుకోసం తనకు చెందిన శ్రేయమ్ కాంప్లెక్స్ లోని ఆఫీస్ స్థలాన్ని కొవిడ్ ఆసుపత్రిగా మార్చే పనిలో పడ్డారు. ఆ ఆఫీసు 30వేల స్వేర్ ఫీట్ల విస్తీర్ణంలో ఉంది. అందులో 85 బెడ్లు, ఆక్సిజన్ సదుపాయం ఏర్పాటు చేస్తున్నారు.

85 బెడ్లు , ఆక్సిజన్ సదుపాయం:
సూరత్ మున్సిపల్ కార్పొరేషన్ తో షేక్ ఖాదర్ ఒప్పందం చేసుకున్నారు. 15 ఐసీయూ బెడ్స్ తో కూడిన కొవిడ్ ఆసుపత్రికి అవసరమైన మెడికల్ స్టాఫ్ ని, పరికరాలను తాను అందజేస్తానన్నారు. ఈ కొవిడ్ ఆసుపత్రికి ఖాదర్ షేక్ మనవరాలు హిబా పేరు పెట్టారు. అధికారులు ఆసుపత్రికి వచ్చి ఏర్పాట్లను పరిశీలించారు. త్వరలో అన్ని పనులు పూర్తి చేసి, ఆసుపత్రిని ప్రారంభిస్తామన్నారు. పేద కరోనా రోగులకు ఉచితంగా ట్రీట్ మెంట్ ఇస్తామన్నారు. న్యూ సివిల్ హాస్పిటల్, సైమర్ హాస్పిటల్ రెఫర్ చేసే రోగులకు ఇక్కడ చికిత్స అందిస్తామన్నారు.

ఈ సంక్షోభ సమయంలో పేదలకు సాయం చేయాలి:
కొవిడ్ ఆసుపత్రి గురించి ఖాదర్ షేక్ మాట్లాడారు. ”ఈ ఆసుపత్రి అందరిది. కులం, మతం, ప్రాంతాలకు అతీతం. నేనేమీ నోట్లో వెండి స్పూన్ తో పుట్టలేదు. నేను కూడా నా జీవితంలో చాలా ఆర్థిక సమస్యలు ఎదుర్కొన్నా. నేను కష్టపడి పని చేశాను. ఇప్పుడు ఆర్థికంగా బాగానే ఉన్నా. బాగానే డబ్బు సంపాదించా. ప్రస్తుత కరోనా సంక్షోభ సమయంలో పేదలకు చేతనైన సాయం చేయాలని నిర్ణయించాను. నేను, నా ముగ్గురు కొడుకులు ఇప్పటికే అనేకసార్లు పేదలకు సాయం చేశాము. ఇప్పుడు అంతకు మించి ఇంకా ఏదైనా చేయాలని అనుకున్నా. కొవిడ్ ఆసుపత్రి ఆలోచన అందులో భాగమే” అని ఖాదర్ షేక్ చెప్పారు.

ఆదర్శంగా నిలిచిన వ్యాపారవేత్త:
ఈ కొవిడ్ ఆసుపత్రిలో డాక్టర్లు, నర్సుల కోసం ప్రత్యేక స్థలం కేటాయించారు. అలాగే కిచెన్, డైనింగ్ ఏరియా ఏర్పాటు చేశారు. అంతేకాదు ప్రతి రోజూ రోగులకు అవసరమైన ఆహారం వండి పెట్టేందుకు వంట మనుషులను కూడా నియమిస్తున్నట్టు ఖాదర్ చెప్పారు. పేదల కోసం ఈ బిజినెస్ మ్యాన్ తీసుకున్న నిర్ణయాన్ని అంతా ప్రశంసిస్తున్నారు. ఆయన పెద్ద మనసుకు హ్యాట్సాఫ్ చెబుతున్నారు. బాగా డబ్బున్న వ్యక్తులు అందరూ ఇలా చేతనైన సాయం చేయగలిగితే పేదలను ఆదుకోవడం పెద్ద కష్టమేమీ కాదంటున్నారు. మనసున్న మారాజు, మీరు రియల్లీ గ్రేట్ సర్ అని షేక్ ఖాదర్ ని కీర్తిస్తున్నారు. ఇలాంటి వ్యక్తులను ఆదర్శంగా తీసుకుని ఇతర సంపన్నులు కూడా పేదలకు తోచిన సాయం చేయాలని నెటిజన్లు కోరుతున్నారు.