టెలికాం కంపెనీలకు ప్రభుత్వం బిగ్ షాక్…. అర్థరాత్రి 11:49 లోపు 90వేల కోట్లు కట్టాల్సిందే

  • Published By: venkaiahnaidu ,Published On : February 14, 2020 / 02:18 PM IST
టెలికాం కంపెనీలకు ప్రభుత్వం బిగ్ షాక్…. అర్థరాత్రి 11:49 లోపు 90వేల కోట్లు కట్టాల్సిందే

టెలికాం కంపెనీలకు కేంద్రప్రభుత్వం బిగ్ షాక్ ఇచ్చింది.  శుక్రవారం(ఫిబ్రవరి-14,2020)రాత్రి 11:59గంటల లోపు ప్రభుత్వానికి చెల్లించాల్సిన 92వేల కోట్ల రూపాయల అడ్జెసెంట్ గ్రాస్ రెవెన్యూ(AGR)బాకీలను చెల్లించాలని కేంద్రప్రభుత్వం సంచలన ఆదేశాలు జారీ చేసింది. భారతీ ఎయిర్ టెల్, వోడాఫోన్, ఐడియా,రిలయస్స్ కమ్యూనికేషన్స్,బీఎస్ఎన్ఎల్,ఎమ్ టీఎన్ఎల్ వంటి టెలికాం కంపెనీలకు టెలికాం డిపార్ట్మెంట్ ఈ మేరకు నోటీసులు జారీ చేసింది. కేంద్రప్రభుత్వానికి టెలికాం కంపెనీలు చెల్లించాల్సిన బకాయిల విషయంలో ఇవాళ(ఫిబ్రవరి-14,2020)సుప్రీంకోర్టు కీలక తీర్పు ఇచ్చిన కొన్ని గంటల్లోనే ప్రభుత్వం టెలికాం కంపెనీలకు షాక్ ఇస్తూ ఈ నిర్ణయం తీసుకుంది. 

అడ్జెసెంట్ గ్రాస్ రెవెన్యూ(ఏజీఆర్) కేసు సంబంధించి గతంలో ఇచ్చిన తీర్పుపై శుక్రవారం ఉదయం సుప్రీంకోర్టు మళ్లీ కీలక ఆదేశాలు జారీ చేసింది. తీర్పును రివ్యూ చేయాలంటూ కంపెనీలు దాఖలు చేసిన పిటిషన్ కొట్టేసి బకాయిలు చెల్లించాలంటూ తీర్పు ఇచ్చినా చెల్లించలేదంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. టెలికం సర్వీస్‌ ప్రొవైడర్లు ప్రభుత్వానికి చెల్లించాల్సిన మొత్తం చెల్లించకుండా కోర్టు దిక్కరణకు పాల్పడ్డాయంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది సుప్రీంకోర్టు. ఎన్ని ఆదేశాలు ఇచ్చినా.. టెలికాం కంపెనీలు చ‌లించట్లేద‌ని జ‌స్టిస్ అరుణ్ మిశ్రా ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. అబ్దుల్ న‌జీర్‌, ఎంఆర్ షాల‌తో,అరుణ్ మిశ్రాలతో కూడిన త్రిస‌భ్య‌ ధ‌ర్మాస‌నం ఈ కేసును విచారించింది.

ఇప్ప‌టి వ‌ర‌కు ఏజీఆర్‌కు సంబంధించిన బాకీల నుంచి టెలికాం కంపెనీలు న‌యా పైసా కూడా చెల్లించ‌లేద‌ని జ‌స్టిస్ మిశ్రా మండిపడ్డారు. మార్చి 17వ తేదీ నాటికి కచ్చితంగా బాకీలను చెల్లించాలని టెలికాం కంపెనీలకు సుప్రీం ఆదేశించింది. గ‌త ఏడాది అక్టోబ‌ర్‌లో…ప్రభుత్వానికి చెల్లించాల్సిన బాకీల‌ను 90 రోజుల్లో చెల్లించాల‌ని కోర్టు ఆదేశాలు ఇచ్చింది. జ‌న‌వ‌రి 24వ తేదీ వ‌ర‌కు ఆ ఆదేశాలు ముగిశాయి. కానీ టెలికాం కంపెనీలు బాకీ డ‌బ్బులు చెల్లించ‌కపోయేసరికి ఇవాళ సుప్రీం మరోసారి మార్చి-17,2020ని డెడ్ లైన్ గా విధించింది.

అయితే సుప్రీం ఈ తీర్పు ఇచ్చిన గంటల్లోనే టెలికాం కంపెనీలకు భారీ షాక్ ఇస్తూ కేంద్రం శుక్రవారం అర్థరాత్రిని డెడ్ లైన్ విధించింది. అయితే ఇవాళ రాత్రి లోగా టెలికాం కంపెనీలు ప్రభుత్వానికి చెల్లించాల్సిన బాకీలను చెల్లిస్తాయా లేదా అన్నది చూడాలి. ఒకవేళ అర్థరాత్రి గడువులోగా చెల్లించకపోతే ప్రభుత్వం వాటిపై సీరియస్ యాక్షన్ తీసుకునే అవకాశమున్నట్లు సమాచారం.