ఆప్ నిర్ణయంతో చైల్డ్ పోర్నోగ్రఫీకి అవకాశం…ఢిల్లీ హైకోర్టులో పిటిషన్

  • Published By: venkaiahnaidu ,Published On : February 25, 2020 / 02:16 PM IST
ఆప్ నిర్ణయంతో చైల్డ్ పోర్నోగ్రఫీకి అవకాశం…ఢిల్లీ హైకోర్టులో పిటిషన్

ఢిల్లీ ప్రభుత్వ పాఠశాలల్లోని తరగతి గదుల్లో సీసీటీవీ కెమెరాలు పెట్టాలని నిర్ణయించిన ఢిల్లీ ప్రభుత్వానికి మెట్టికాయలు వేయాలని, తరగతి గదుల్లో సీసీటీవీ కెమెరాలు పెట్టడాన్ని వ్యతిరేకిస్తూ ఢిల్లీ హైకోర్టులో ఓ పిటిషన్ దాఖలు అయింది. క్లాస్ రూమ్ లో సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేయడం విద్యార్థులు,టీచర్ల ప్రైవసీ(ఏకాంతం)ను ఉల్లంఘించడమేనని,ఆప్ ప్రభుత్వ నిర్ణయాన్ని తోసిపుచ్చాలంటూ పిటిషన్ లో కోరారు. 

గవర్నమెంట్ స్కూల్స్ లో టీచర్లు,విద్యార్థుల తల్లిదండ్రులకు ప్రాతినిధ్యం వహిస్తున్న రెండు అసోసియేషన్లు కలిసి ఈ పిటిషన్ దాఖలు చేశాయి. ఇప్పటికే తరగతి గదుల్లో కేజ్రీవాల్ సర్కార్ ఏర్పాటు చేసిన సీసీటీవీ కెమెరాలను తొలగించాలని,వాటిలో రికార్డ్ అయిన ఫుటేజీని డిలీట్ చేయాలని ఆ పిటిషన్ లో కోరారు. తరగతి గదుల్లో సీసీటీవీ కెమెరాల ఏర్పాటు,తల్లిదండ్రులకు, థర్డ్ పార్టీలకు ఆ ఫుటేజీ లైవ్ స్ట్రీమింగ్ ను దృవీకరిస్తూ 2017లో ఆప్ తీసుకున్న రెండు కేబినెట్ నిర్ణయాలు,2019లో విడుదల చేసిన రెండు సర్క్యులర్స్ ను కొట్టివేయాలని పిటిషన్ లో కోరారు. 

శాసనం ప్రకారం డేటా ప్రొటెక్షన్ ఫ్రేమ్‌వర్క్ లేనప్పుడు, ప్రైవేట్ కంప్యూటర్ సర్వర్‌లలో పిల్లల డేటాను స్టోర్ చేయడం “ప్రమాదంతో నిండి ఉంది” అని కూడా పిటిషన్ పేర్కొంది. రికార్డ్ చేసిన ఫుటేజీ యాక్సెస్ కలిగి ఉన్న వ్యక్తుల దగ్గరున్న వీడియోల ద్వితీయ కాపీలను నిరోధించే యంత్రాంగం లేనప్పుడు, అది చైల్డ్ పోర్నోగ్రఫీ కోసం దుర్వినియోగం చేయబడే ప్రమాదముందని పిటిషన్ లో వాదించారు. అంతేకాకుండా తరచుగా మనిటరింగ్ కూడా మొత్తంగా పిల్లవాడి అభివృద్ధిపై మానసిక ప్రభావం చూపే అవకాశముందని ఆరోపించారు.