ఆగ్రా పేరు మార్చే యోచనలో యోగీ ఆదిత్యనాధ్ ?

  • Published By: chvmurthy ,Published On : November 18, 2019 / 06:09 AM IST
ఆగ్రా పేరు మార్చే యోచనలో యోగీ ఆదిత్యనాధ్ ?

ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా యోగి ఆదిత్యనాధ్ బాధ్యతలు  చేపట్టాక రాష్ట్రంలోని ప్రముఖ నగరాల పేర్లు మార్చుకుంటూ వస్తున్నారు. అలహాబాద్, ఫైజాబాద్, మొఘల్ సరాయ్ పేర్లు మార్చిన తర్వాత ఇప్పుడు ఆగ్రా పేరు మార్చే పనిలో పడ్డారు. ఇందుకు సంబంధించి ఆగ్రాకు ఆ పేరు కాకుండా మరోక పేరు ఏమైనా ఉందా? పరిశోధించి చెప్పాలని బీఆర్ అంబేద్కర్ యూనివర్సిటీ  చరిత్ర విభాగానికి లేఖ రాశారు. ఇప్పడు ఈ విషయంపై చరిత్ర విభాగానికి చెందిన ప్రోఫెసర్లు ప్రోఫెసర్ సుగమ్ ఆనంద్  నేతృత్వంలో పరిశోధనలు చేస్తున్నారు. ఆగ్రాకు అగ్రవాన్ అనేపేరు  మార్చటానికి ప్రతిపాదనలు సిధ్దం చేస్తున్నారు. 

మహారాజా అగ్రసేన్ తర్వాత ఆగ్రాకు అగ్రవాన్ అనే పేరు పెట్టాలనే డిమాండ్ వచ్చినట్లు గుర్తించారు.  ఇక్కడ ఆధిపత్యం ఉన్న అగర్వాల్ సమాజం కూడా ఆ పేరును అంగీకరించింది.  ఆగ్రా నార్త్  అసెంబ్లీ స్ధానం నుంచి ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన దివంగత జగన్ ప్రసాద్ గార్గ్ కూడా గతంలో యూపీ ప్రభుత్వానికి ఆగ్రా పేరును అగ్రవాన్ గా మార్చాలని కోరుతూ లేఖ కూడా రాశారు. ఆగ్రా నగరానికి మరేదైనా పేరు ఉంటే దానికి సంబంధించిన చారిత్రక ఆధారాలు ఇవ్వాలని తమకు ప్రభుత్వం నుంచి లేఖ వచ్చిందని అందుకు మేము పరిశోధన చేస్తున్నామని యూనివర్సిటీ ప్రోఫెసర్ సుగం ఆనంద్ తేల్చి చెప్పారు. మహాభారత కాలంలో ఆగ్రా నగరాన్ని అగ్రవాన్‌, అగ్రబాణ్‌ అని పిలిచేవారని ఆయన తెలిపారు.

అయితే, ఆగ్రా పేరు మార్చాలనేది పాత డిమాండే కాబట్టి ఇది కొత్తది కాదని కొందరు కొట్టి పారేస్తున్నారు. దీనికి ‘అగర్వన్’ అని పేరు పెట్టాలనుకునే వారు చాలాకాలంగా తమ వాదనను సమర్థిస్తూనే ఉన్నారు, అయితే మొఘల్ సామ్రాజ్యానికి రాజధానిగా మారిన అక్బర్ చక్రవర్తి తర్వాత చాలా మంది ఆగ్రాను అక్బరాబాద్ అని పిలుస్తారు.  ఆగ్రాలో తాజ్ మహల్ ఉండటం.. ప్రపంచ వ్యాప్తంగా పర్యాటక,వాణిజ్య రంగాలకు పేరు పొందింది కాబట్టి దీనిపై పునరాలోచన చేయమని టూరిస్టు గైడ్ లు కోరుతున్నారు.