ఈసారి రైతులతో చర్చలు విఫలమైతే రంగంలోకి దిగుతాం..కేంద్రానికి పవార్ వార్నింగ్

ఈసారి రైతులతో చర్చలు విఫలమైతే రంగంలోకి దిగుతాం..కేంద్రానికి పవార్ వార్నింగ్

Sharad Pawar Faults Centre నూతన వ్యవసాయ చట్టాలకు దేశరాజధాని సరిహద్దుల్లో రైతులు ఉద్రిక్తంగా ఆందోళన కొనసాగిస్తున్న నేపథ్యంలో కేంద్రంపై NCP అధినేత శరద్​ పవార్ విమర్శలు గుప్పించారు. రాష్ట్రాలను సంప్రదించకుండా మూడు వ్యవసాయ చట్టాలను తీసుకొచ్చారని.. అందువల్లే ఈ సమస్యలు తలెత్తాయని అన్నారు. గ్రామాల్లో వ్యవసాయం చేసుకోవాల్సిన రైతులను ఢిల్లీలో కూర్చోబెట్టడం తగదని.. దీని వల్ల వ్యవసాయ పనులు ఆగిపోతాయన్నారు.

మన్మోహన్​ సింగ్​ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం వ్యవసాయ రంగంలో సంస్కరణలు చేయాలనుకుంది. అయితే ఈ విధంగా కాదు అని కేంద్రమంత్రి నరేంద్ర సింగ్​ చేసిన వ్యాఖ్యలపై పవార్ స్పందించారు ప్రస్తుత పరిస్థితులను అర్థం చేసుకుని రాష్ట్ర ప్రభుత్వాలు, ఆ రంగంలోని నిపుణులతో చర్చించి అన్ని సమస్యలను పరిష్కరిస్తూ సంస్కరణలు చేపట్టాలన్నారు. అయితే ఇవేమి లేకుండా సొంత మెజారిటీతో చట్టాలు తీసుకొచ్చారని.. దీంతో సమస్యలు మొదలయ్యాయన్నారు.

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ.. అన్నదాతల ఆందోళనలపై ప్రతిపక్షాలను తప్పుబట్టడం మానేసి.. నిరసనలను తీవ్రంగా పరిగణించాల్సిన అవసరం ఉందని పవార్ సూచించారు​. రైతు సంఘాలతో కేంద్రం మరోసారి జరపనున్న చర్చలు విఫలమైతే.. 40 కర్షక సంఘాల ప్రతినిధులతో భేటీ అవుతామని హెచ్చరించారు. రైతు సంఘాలతో చర్చలు జరుపుతున్న మంత్రుల బృందానికి పవార్​ ప్రశ్నలు సంధించారు. అధికార పార్టీ.. వ్యవసాయం, రైతుల సమస్యలపై లోతైన అవగాహనతో చర్చలు జరపాలని హితవు పిలికారు.

కాగా, మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా వారి ఆందోళనను పెంచడానికి యుపిఎ మిత్రపక్షాలను ఏకం చేస్తామని నిరసన వ్యక్తం చేస్తున్న రైతులకు ఎన్‌సిపి అధినేత శరద్ పవార్ హామీ ఇచ్చారు. డిసెంబర్ 30 న జరిగే తదుపరి రౌండ్ చర్చలలో ప్రభుత్వ ప్రతిపాదన కోసం వేచి ఉండమని పవార్ ఇవాళ ఢిల్లీలోని తన నివాసంలో జరిగిన సమావేశంలో రైతు నాయకులను కోరారు. ప్రభుత్వం రైతుల డిమాండ్లను నెరవేర్చకపోతే, తాను ముందుండి వారి హక్కు కోసం పోరాడటానికి అన్ని యుపిఎ పార్టీలను ఏకం చేస్తానని పవార్ రైతులకు చెప్పారు.

మరోవైపు, బుధవారం(డిసెంబర్-30,2020)మధ్యాహ్నాం ఢిల్లీలోని విజ్ణాన్ భవన్ లో ఆరోసారి చర్చలకు ఆహ్వానించిన కేంద్రంతో భేటీ కావడానికి అంగీకరించారు రైతు సంఘాల నాయకులు. ఈ మేరకు అంగీకారం తెలుపుతూ కేంద్ర వ్యవసాయ శాఖ కార్యదర్శికి సంయుక్త కిసాన్ మోర్చా బుధవారం లేఖ రాసింది. నాలుగు అంశాలే అజెండాగా చర్చలకు హాజరవుతున్నట్లు రైతు నేతలు తెలిపారు. కేంద్ర వ్యవసాయ శాఖకు రాసిన లేఖలో ఈ విషయాన్ని పేర్కొన్నారు.