ఎన్నికల కోడ్ కు కొద్ది సేపటి ముందే ఆ సీఎంల వరాల జల్లు

ఎన్నికల కోడ్ కు కొద్ది సేపటి ముందే ఆ సీఎంల వరాల జల్లు

poll schedule శుక్రవారం సాయంత్రం భారత ఎన్నికల సంఘం.. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదల చేయడంతో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినట్లయింది. అయితే ఎలక్షన్ కమిషన్.. ఎన్నికల షెడ్యూల్‌ ప్రకటించడానికి కాసేపటి ముందు వెస్ట్ బెంగాల్, తమిళనాడు సీఎంలు ప్రజలపై వరాల జల్లు కురిపించారు. జనాభాలో అత్యధికంగా ఉండే కార్మికులు, రైతులను దృష్టిలో పెట్టుకుని వీటిని ప్రకటించడం విశేషం.

అదను చూసి అస్త్రాలు విసరడంలో ప్రధాని మోడీ కంటే తానేమీ తక్కువ తినలేదని మరోసారి నిరూపించుకున్నారు మమతా బెనర్జీ. ఈసారి బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో హోరాహోరీ పోరు తప్పని పరిస్థితుల్లో జనాన్ని ఆకట్టుకునేందుకు బీజేపీ, టీఎంసీ పోటాపోటీగా వ్యవహరిస్తుండటం, మోడీ, అమిత్ షా పర్యటనల్లో కేంద్రం తరఫున బెంగాల్ కు భారీ ప్రాజెక్టులెన్నో ప్రకటిస్తుండగా, ఇప్పుడు మమత రోజు కూలీలపై కరుణ కురిపించారు. ఇంకాసేపట్లో ఎన్నికల కోడ్ అమల్లోకి వస్తుందనగా.. పశ్చిమ బెంగాల్ లో కూలీల కనీస వేతనాలను పెంచుతున్నట్లు సీఎం మమత సంచలన ప్రకటన చేశారు.

ఎన్నికల షెడ్యూల్ ప్రకటించడానికి కొద్ది సేపటి ముందే సీఎం మమతా బెనర్జీ కొత్తగా​ ‘పశ్చిమ బెంగాల్ పట్టణ ఉపాధి‌ పథకాన్ని’ ప్రవేశపెట్టారు. సాధారణ (అన్ స్కిల్డ్) కూలీకి రోజువారీ కనీస వేతనం రూ.144 రూపాలు ఉండగా దాన్నిప్పుడు రూ.202కు పెంచారు. మధ్యస్థాయి నైపుణ్యాలు(సెమీ స్కిల్డ్) ఉన్న కూలీ రోజువారీ భృతి రూ. 172 నుంచి రూ.303కు పెంచారు. స్కిల్డ్ లేబర్ (నైపుణ్యం కలిగిన కార్మికులకు)కు రోజుకు రూ .404 కనీస వేతంగా అందించాల్సి ఉంది. ఈ పథకం ద్వారా మొత్తంగా వివిధ స్థాయుల్లో నైపుణ్యం కలిగిన 56,500(40,500 నైపుణ్యం లేనివారు, 8000 మంది సెమీ స్కిల్డ్, 8000 మంది నైపుణ్యం కలిగినవారు)మంది కార్మికులకు లబ్ధి చేకూరనుందని మమతా బెనర్జీ తెలిపారు. 294 స్థానాలున్న వెస్ట్ బెంగాల్ అసెంబ్లీకి మార్చి-27నుంచి ఏప్రిల్-29వరకు ఎనిమిది దశల్లో ఎన్నికలు జరుగనున్నాయి. మే-2న ఫలితాలు వెలువడనున్నాయి.

మరోవైపు, పళనిస్వామి నేతృత్వంలోని తమిళనాడు ప్రభుత్వం..సహకార సంఘాలు, సహకార బ్యాంకుల్లో ఆభరణాలు తాకట్టు పెట్టి పేదలు, కార్మికులు, మహిళలు తీసుకున్న రుణాలను మాఫీ చేస్తున్నట్లు ప్రకటించింది. కరోనా సంక్షోభ సమయంలో అప్పులు తిరిగి చెల్లించడం వారికి కష్టమని, అందుకే మాఫీ చేసినట్లు సీఎం పళనిస్వామి ప్రకటించారు. కరోనా కష్టకాలంలో ఆర్థిక వృద్ధిని పెంచేందుకంటూ సహకార బ్యాంకులు 6 శాతం వడ్డీకే బంగారు రుణాలు ఇస్తాయని సీఎం ప్రకటించారు. 234స్థానాలున్న తమిళనాడు అసెంబ్లీకి ఏప్రిల్-6న ఒకే దశలో పోలింగ్ జరగనుంది. మే-2న ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి