రావయ్యా ట్రంప్…ఆగ్రా అందం పెరిగింది చూడవయ్యా

  • Published By: venkaiahnaidu ,Published On : February 20, 2020 / 11:49 AM IST
రావయ్యా ట్రంప్…ఆగ్రా అందం పెరిగింది చూడవయ్యా

అగ్రరాజ్యం అధ్యక్షుడి భారత పర్యటనకు సమయం ఆసన్నమయింది. రెండు రోజుల పాటు భారత్ లో పర్యటించేందుకు ఫిబ్రవరి-24,2020న ట్రంప్ ఢిల్లీలో అడుగుపెట్టనున్నారు.  భారత్‌ పర్యటన సందర్భంగా ట్రంప్ సందర్శించే ప్రాంతాల్లో విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు. అహ్మదాబాద్‌లో ట్రంప్‌నకు అపూర్వ స్వాగతం పలికేలా ఏర్పాట్లు జరుగుతుంటే ఆయన పర్యటించనున్న ఆగ్రాలోనూ యుద్ధప్రాతిపదికన ఏర్పాట్లు చేపడుతున్నారు.

ట్రంప్ రాకతో ఆగ్రా సరికొత్త అందాలను సంతరించుకుంటోంది. ఆగ్రా వీధులకు పెయింటింగ్‌లు వేసి తీర్చిదిద్దుతున్నారు. అయితే తాజ్ వెనుక భాగంలో ప్రవహించే యమునా నదిలో నీళ్లు లేక,జంతువులు తిరుగుతూ కొంచెం దుర్వాసన వస్తున్న సమయంలో…ట్రంప్ రాకతో  యమునా నదిలోకి పెద్ద ఎత్తున నీటిని విడుదల చేశారు.  అమెరికా నుంచి వచ్చిన సెక్యూరిటీ బృందం తాజ్‌మహల్‌ను సందర్శించి ఏర్పాట్లను పరిశీలించింది. మరోవైపు యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్‌ తాజ్ మహల్ ను సందర్శించి ట్రంప్‌ రాకకు జరుగుతున్న ఏర్పాట్లను అధికారులతో సమీక్షించారు. గత కొద్ది రోజులుగా 500 క్యూసెక్కుల నీటిని యుమనా నదిలోకి యూపీ ఇరిగేషన్‌ శాఖ విడుదల చేసింది. నదీ జలాల వ్యర్ధాల నుంచి వచ్చే దుర్వాసనను నియంత్రించేందుకు తాజా నీటిని అధికారులు విడుదల చేశారు.

తన భారత పర్యటనలో ట్రంప్ గుజరాత్ లో పర్యటించనున్నారు. అహ్మదాబాద్ లో నిర్మించిన ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియంను ఈ సందర్భంగా ట్రంప్ భారత ప్రధాని నరేంద్రమోడీతో కలిసి ప్రారంభిస్తారు. సబర్మతిలోని గాంధీ ఆశ్రమాన్ని కూడా ట్రంప్ సందర్శించే అవకాశం ఉంది.  డోనాల్డ్ ట్రంప్ కోసం గుజరాత్ ప్రభుత్వం ఇప్పటికే భారీ ఏర్పాట్లు చేస్తోంది. ఢిల్లీ నుంచి అహ్మదాబాద్ చేరుకోనున్న ఆయన అక్కడ మూడు గంటలు గడపనున్నారు. దీంతో ట్రంప్ 3గంటల పర్యటన కోసం గుజరాత్ సర్కార్ రూ. 100కోట్లు వెచ్చిస్తోంది. మోడీ, ట్రంప్ రోడ్ షో వెంబడి సాంస్కృతిక కార్యక్రమాలకు మరో రూ. 4 కోట్లు ఖర్చు చేస్తున్నారు. రోడ్ షోకు సుమారు 10 వేల మంది పోలీసులతో భద్రత ఏర్పాట్లు చేస్తున్నారు.

ట్రంప్ పర్యటన నేపథ్యంలో ఇప్పటికే అహ్మదాబాద్ లో పాన్ షాపులను బంద్ చేయాలని ఆదేశాలు జారీ చేశారు. రోడ్లపై ఎవ్వరూ పాన్ నమిలి ఊయకుండా,గోడలు,రోడ్లు శుభ్రంగా ఉండేలా ఈ నిర్ణయం తీసుకున్నారు. ట్రంప్-మోడీ రోడ్ షో మార్గంలో ట్రంప్ కు మురికివాడలు కనిపించకుండా ఎత్తైన గడను కూడా నిర్మించారు. మరోవైపు పలు విమానసర్వీసలును రీషెడ్యూల్ చేయడం,విమానాలను దారి మళ్లించడం చేస్తున్నారు. దాదాపు 60అంతర్జాతీయ,దేశీయ విమానాలను రీషెడ్యూల్ చేశారు. వీధి కుక్కలను ఎక్కడికక్కడ పట్టుకుని బంధించారు అధికారులు. సమ్ల్ లలో నివసించే 45కుటుంబాలు వెంటనే అక్కడి నుంచి వెళ్లిపోవాలంటూ అహ్మదాబాద్ మున్సిపల్ అధికారులు నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే.

	TR2_1.jpg

 

	Trump_0.jpg