కరోనా యోధులకు వైరస్ సోకకుండా రక్షణ కవచం.. ఆవిష్కరించిన ఎయిమ్స్

  • Published By: venkaiahnaidu ,Published On : July 8, 2020 / 05:48 PM IST
కరోనా యోధులకు వైరస్ సోకకుండా రక్షణ కవచం.. ఆవిష్కరించిన ఎయిమ్స్

కోవిడ్-19 మహమ్మారితో వైద్యులు, ఆరోగ్య సిబ్బంది ముందు వరసలో నిల్చొని పోరాడుతున్నారు. ఈ క్రమంలో వారు కూడా వైరస్ బారినపడి ప్రాణాలు కోల్పోతుండటం ఆందోళన కలిగిస్తోంది. ఈ సమయంలో రిస్క్ కండిషన్లలో పనిచేస్తున్న కొవిడ్ యోధులు ఇన్‌ఫెక్షన్ బారిన పడకుండా ఉండేందుకు జోధ్‌పూర్ ఎయిమ్స్ సరికొత్త రక్షణ కవచాన్ని రూపొందించింది.

ఇస్కాన్ సర్జికల్స్ లిమిటెడ్‌తో కలిసి ఎయిమ్స్ జోధ్‌పూర్ ఈ కొత్త రక్షణ కవచాన్ని తయారు చేసింది. ఒక పెట్టె మాదిరిగా ఉండే రక్షణ కవచానికి ‘అభే‌ద్యా’ అని పేరు పెట్టారు. ఈ పరికరాన్ని మంగళవారం (జులై 7) ఆవిష్కరించారు. రిస్క్ కండిషన్లలో పనిచేస్తున్న కొవిడ్ యోధులు ఇన్‌ఫెక్షన్ బారిన పడకుండా ఉండేందుకు ఈ రక్షణ కవచం ఉపకరిస్తుందని ఎయిమ్స్ వైద్య నిపుణులు తెలిపారు.

కరోనా రోగులకు అనస్థీషియా ఇచ్చేటప్పుడు, లేదా వారి నుంచి నమూనాలు, ఇతర స్రవాలను బయటకు తీసేటప్పుడు డాక్టర్లు, వైద్య సిబ్బందికి ఇది ఎంతో ఉపయోగపడుతుందని ఎయిమ్స్, జోధ్‌పూర్ డైరెక్టర్ డాక్టర్ సంజీవ్ మిశ్రా తెలిపారు. పెట్టె మాదిరిగా ఉండే దీనిలో పలు పరికరాలు ఉంటాయని తెలిపారు. చికిత్స సమయంలో పేషెంట్లను ఆ పెట్టెలో ఉంచితే ఆయా విధులు నిర్వహించే వైద్య సిబ్బందికి వైరస్ సోకకుండా రక్షణ కల్పిస్తుందని ఆయన వివరించారు.