సుప్రీం తీర్పుపై ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ అసంతృప్తి

  • Published By: chvmurthy ,Published On : November 9, 2019 / 09:30 AM IST
సుప్రీం తీర్పుపై ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ అసంతృప్తి

అయోధ్య అంశంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపట్ల ఎంఐఎం అధ్యక్షుడు, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈవిషయంలో ముస్లిం పర్సనల్ లా బోర్డు ప్రకటనను సమర్థిస్తున్నట్లు ఆయన చెప్పారు. మసీదు కోసం ప్రత్యేకంగా 5 ఎకరాల స్ధలం మాకొద్దు అని, ఆ ఆఫర్ ను తిరస్కరిస్తున్నామని చెప్పారు. 

రామజన్మభూమి- బాబ్రీ మసీదు వివాదంలో భారత సర్వోన్నత న్యాయస్థానం శనివారం తీర్పు వెలువరించింది. రామజన్మ న్యాస్‌కే వివాదాస్పద స్థలాన్ని అప్పగించాలని కోర్టు ఆదేశించింది. అదే విధంగా అయోధ్యలోనే మసీదు నిర్మాణానికి సున్నీ వక్ఫ్‌ బోర్డుకు ప్రత్యామ్నాయంగా ఐదు ఎకరాల స్థలం కేటాయించాలని ఆదేశాలు జారీ చేసింది.

బాబ్రీ మసీదు నిర్మాణానికై సున్ని వక్ఫ్‌ బోర్డు న్యాయవాదులు తమ వాదనలు బలంగా వినిపించారని ఒవైసీ తెలిపారు. ‘అక్కడ బాబ్రీ మసీదు ఉందన్న విషయం శాస్త్రీయంగా తేలింది. సుప్రీం తీర్పు అసంపూర్తిగా ఉంది. ఈ విషయంలో ముస్లిం వర్గానికి అన్యాయం జరిగింది. తీర్పు పట్ల అసంతృప్తిగా ఉన్నానని చెప్పడం తనహక్కు అని ఆయన అన్నారు.  దానంగా ఇచ్చే ఐదెకరాల భూమి మాకు అక్కర్లేదు. భారత రాజ్యాంగంపై మాకు పూర్తి విశ్వాసం ఉంది. మా హక్కుల కోసం చివరిదాకా పోరాడతాం. మా మీద సానుభూతి, అభిమానం చూపాల్సిన అవసరం లేదు’ అని పేర్కొన్నారు. మాజీ ప్రధాని పీవీ నరసింహా రావు తన విధులను సక్రమంగా నిర్వర్తించి ఉంటే అక్కడ మసీదు ఉండేదని ఆవేదన వ్యక్తంచేశారు.