గోద్రాలో బీజేపీని గద్దె దించిన ఎంఐఎం..2002 తర్వాత తొలిసారి కాషాయేతర జెండా

గోద్రాలో బీజేపీని గద్దె దించిన ఎంఐఎం..2002 తర్వాత తొలిసారి కాషాయేతర జెండా

Godhra Mim

Godhra హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ నేతృత్వంలోని ఏఐఎంఐఎం పార్టీ గుజరాత్ రాష్ట్రంలో అధికార బీజేపీకి షాకిచ్చింది. గోద్రా మున్సిపాలిటీ పీఠాన్ని బీజేపీ తిరిగి దక్కించుకోకుండా అడ్డుకుంది. అంతేకాకుండా తమ పార్టీ అభ్యర్థి మేయర్ పీఠాన్ని దక్కించుకునేలా పావులు కదిపింది. దీంతో.. 2002 తర్వాత తొలిసారి ఈ మున్సిపాలిటీని బీజేపీ కోల్పోయినట్లైంది.

గోద్రా మున్సిపాలిటీలో మొత్తం 44 స్థానాలు ఉన్నాయి. ఇటీవల జరిగిన ఎన్నికల్లో 18 స్థానాలను బీజేపీ గెలుచుకుంది. తొలిసారి బరిలోకి దిగిన ఎంఐఎం ఏడు చోట్ల విజయం సాధించింది. 17 మంది స్వతంత్రులు గెలుపొందారు. అయితే స్వతంత్రుల బృందానికి ఎంఐఎం మద్దతు ప్రకటించింది. స్వతంత్రులకు.. తమ పార్టీ నుంచి గెలిచిన ఏడుగురు సభ్యుల మద్దతు ఉంటుందని ప్రకటించింది. దీంతో గోద్రా మున్సిపాలిటీ పీఠాన్ని తిరిగి చేజిక్కించుకునేందుకు బీజేపీకి దారులు మూసుకుపోయాయి. కాగా,17మంది స్వతంత్రులలో 5గురు ముస్లిమేతరులు కావడం విశేషం. మరోవైపు,అహ్మదాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌లో ఏడు స్థానాల్లో,మొదసా మున్సిపాలిటీలో 12 స్థానాల్లో పోటీ చేసి 9 స్థానాలను ఎంఐఎం కైవసం చేసుకుంది.

ఎంఐఎం గుజరాత్ అధ్యక్షుడు సాబిర్ కబ్లివాలా మాట్లాడుతూ..గోద్రాలో బీజేపీ అధికారంలోకి రాకుండా విజయవంతంగా అడ్డుకున్నామని తెలిపారు. గోద్రా ప్రజలు భాజపా పాలన పట్ల విసుగుచెందారన్నారు. తమ మద్దతుతో స్వతంత్రులకు అధికారం చేపట్టేందుకు కావాల్సిన ఆధిక్యం లభించిందని సాబిర్ కబ్లివాలా తెలిపారు. స్వతంత్ర అభ్యర్థులు సంజయ్ సోనీని అధ్యక్షుడిగా, అక్రమ్ పటేల్​ను ఉపాధ్యక్షుడిగా ఎన్నుకున్నట్లు తెలిపారు. 2022లో జరగనున్న గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలకు సైతం కసరత్తు ప్రారంభించినట్లు సాబిర్ తెలిపారు.

కాగా, గోద్రా పట్టణం 2002లో మత ఘర్షణలకు ప్రధాన కేంద్రంగా నిలిచిన విషయం తెలిసిందే. 2002 ఫిబ్రవరి 27న గోద్రా రైల్వే స్టేషన్‌లో…సబర్మతి ఎక్స్‌ప్రెస్ రైలు ఎస్-6 బోగీకి దుండగులు నిప్పు పెట్టడంతో కాలి బూడిదైంది. ఈ ఘటనలో 59 మంది మరణించారు. వీరిలో ఎక్కువ మంది అయోధ్య పర్యటనకు వెళ్లి తిరిగొస్తున్న వారే కావడం గమనార్హం. ఈ ఘటన తర్వాత గుజరాత్ అట్టుడికిపోయింది. రెండు వర్గాల మధ్య చిచ్చు రేగింది. ఆ తర్వాత జరిగిన అల్లర్లలో వందలాది మంది మరణించారు. వీరిలో ఎక్కువ మంది ముస్లింలు ఉండగా.. కొంత మంది హిందువులు కూడా ఉన్నారు. ఇప్పటివరకు బీజేపీకి పెట్టని కోటలా ఉన్న గోద్రా ప్రాంతంలో తొలిసారిగా కాషాయేతర జెండా ఎగురనుండటం సంచలన విషయమే. మరోవైపు.. సూరత్ మున్సిపాలిటీలో ఆమ్ ఆద్మీ పార్టీ తన సత్తా చాటిన విషయం తెలిసిందే. తొలిసారిగా గుజరాత్ ఎన్నికల్లో పోటీ చేసిన ఆప్.. సూరత్‌ మున్సిపాలిటీలో ప్రతిపక్ష పార్టీగా అవతరించింది.