విన్యాసాలు చేస్తున్న పాకిస్తాన్ పేల్చేశామని చెప్పిన విమానం

విన్యాసాలు చేస్తున్న పాకిస్తాన్ పేల్చేశామని చెప్పిన విమానం

భారత్ ఎయిర్ ఫోర్స్ 87వ వార్షికోత్సవ వేడులకలో భాగంగా గగనతలంలో విన్యాసాలు చేస్తున్నాయి. ఢిల్లీలో ఉన్న హిండాన్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్ నుంచి విశాల గగనంలో షికార్లు కొడుతూ కనువిందు చేశాయి. ఫిబ్రవరి 27న జరిగిన ఎయిర్ స్ట్రైక్ దాడుల్లో భారత యుద్ధ విమానం సుఖోయ్-30ఎమ్కేఐని ధ్వంసం చేసినట్లుగా పాకిస్తాన్ చెప్పుకుంది. అదే విమానం మంగళవారం జరిగిన ఎయిర్ ఫోర్స్ డే సెలబ్రేషన్‌లో ఎగురుతుండటం చూసి పాక్ వ్యాఖ్యలపై మండిపడుతున్నారు. 

వూల్ఫ్ ప్యాక్ కింద మూడు విమానాలు గాల్లోకి ఎగురుతుంటే వాటి కిందుగా ఎవేంజర్ 1, ఎవేంజర్ 2 చక్కర్లు కొడుతూ ఉన్నాయి. ఆ ఎవేంజర్ 1విమానమే సుఖోయ్-30ఎమ్కేఐ. ఫిబ్రవరి 27న జైషే మొహమ్మద్ ఉగ్రవాద క్యాంపుపై జరిపిన బాలాకోట్ దాడుల్లో ధ్వంసమైనట్లుగా పాకిస్తాన్ చెప్పుకొంటుంది. 

‘బాలాకోట్ దాడిలో, ఎయిర్ స్ట్రైక్‌లో పాల్గొన్న కమాండోలు, స్టేషన్లు, యూనిట్లకు తెర వెనుక ఉండి దాడికి సహకరించిన వారందరికీ ఈ విజయాన్ని అంకితం ఇస్తున్నాం’ అని ఎయిర్ చీఫ్ మార్షల్ ఆర్కేఎస్ భాదౌరియా వెల్లడించారు. పాకిస్తాన్ తమకు జరిగిన నష్టాన్ని కప్పి పుచ్చుకోవడానికి సుఖోయ్-30ఎమ్కేఐ యుద్ధ విమానాన్ని కూల్చి వేశామని చెప్పుకుంటోందని ఐఏఎఫ్ అధికారులు వివరించారు.