అతిపెద్ద ఆపరేషన్ కు ఎయిరిండియా రెడీ ..విదేశాలకు వెళ్లేందుకు బుకింగ్స్ ప్రారంభం

  • Published By: venkaiahnaidu ,Published On : May 7, 2020 / 07:33 AM IST
అతిపెద్ద ఆపరేషన్ కు ఎయిరిండియా రెడీ ..విదేశాలకు వెళ్లేందుకు బుకింగ్స్ ప్రారంభం

ప్రభుత్వరంగ విమానయాన సంస్థ ఎయిరిండియా… విమాన ప్రయాణికులకు గుడ్ న్యూస్ చెప్పింది. వందే భారత్ మిషన్ కింద విదేశాలలో చిక్కుకుపోయిన భారతీయులను స్వదేశానికి తీసుకొచ్చేందుకు, స్వదేశంలో ఉన్న వారు లండన్, సింగపూర్,అమెరికాలోని సెలెక్టెడ్ డెస్టినేషన్స్ కు వెళ్లేందుకు ప్రత్యేక విమాన సర్వీసులను ప్రారంభిస్తున్నట్లు తెలిపింది. ఈ మేరకు టికెట్ బుకింగ్స్‌ను ఓపెన్ చేసింది.

భారత్ నుంచి అమెరికా, లండన్, సింగపూర్, ఇతరత్రా విదేశాలకు వెళ్లాలనుకున్న వారి కోసం మే 8వ తేదీ నుంచి 14 వరకు ఈ ప్రత్యేక విమాన సర్వీసులను ఎయిరిండియా కల్పిస్తోంది.  అయితే ప్రయాణానికి అర్హులైన వారికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాలకు ఎయిరిండియా అనుసరించనుందని తెలిసిందే. ఇప్పటికే ఆసక్తి గల ప్రయాణికులు స్వదేశానికి తిరిగి వచ్చేందుకు విమాన టికెట్లు బుక్ చేసుకుంటున్నారు.

మరోవైపు భారత్‌లో చిక్కుకున్న విదేశీయుులు, విదేశాలకు అత్యవసరంగా వెళ్లవలసిన వారి కోసం ప్రత్యేక విమాన సర్వీసులు నడపనున్నట్లు ఎయిరిండియా అధికారులు వివరించారు. అదే విధంగా అమెరికా నుంచి భారత్‌కు రావాలనుకున్న వారి కోసం నాన్ షెడ్యూల్ కమర్షియల్ విమాన సర్వీసులను తొలి దశలో మే 9 నుంచి 15 తేదీల మధ్య నడపనున్నారు. అయితే ప్రయాణికులే ఈ టికెట్ ధరలు చెల్లించాల్సి ఉంటుందని ఎయిరిండియా స్పష్టం చేసింది. భారత విదేశాంగశాఖ అధికారులు దీనిపై అన్ని సిద్ధం చేశారు. 

వందే భారత్ మిషన్
వందేభారత్ మిషన్ పేరుతో లాక్ డౌన్ కారణంగా విదేశాలలో చిక్కుకుపోయిన స్వదేశీయులను తిరిగి దేశానికి తీసుకొచ్చే అతిపెద్ద ఆపరేషన్ కు భారత్ రెడీ అయింది. మొదటి గల్ఫ్ యుద్ధం తర్వాత మళ్లీ ప్రపంచంలోనే ఇదే అతిపెద్ద తరలింపు కార్యక్రమం కానుందని భారత ప్రభుత్వం తెలిపింది. ఇప్పటి వరకు.. వివిధ దేశాల్లో ఉన్న 1,90,000 మంది భారతీయులు.. ఇండియాకు తిరిగి వచ్చేందుకు ఆయా దేశాల్లో ఉన్న రాయబార, హైకమిషన్ కార్యాలయాల్లో దరఖాస్తు చేసుకున్నట్లు కేంద్రం తెలిపింది. విదేశాల్లో చిక్కుకున్న వారిని తరలించే కార్యక్రమం మే 7 నుంచి మొదలవనున్నట్లు తెలిపారు. ఇందుకోసం విమానాలు, నౌకలను ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు.

అయితే మొదటి దశలో వాయు మార్గం ద్వారా 12 దేశాల నుంచి 14,800 మంది భారతీయులను 64 విమానాల్లో భారత్‌కు తీసుకురానున్నట్లు తెలిపారు. మొదటి దశలో అమెరికా, బ్రిటన్, సింగపూర్, ఫిలిప్పిన్స్, బంగ్లాదేశ్, యూకే, యూఏఈ, సౌదీ, ఖతార్, ఒమన్, బహ్రెయిన్ వంటి 12 దేశాలకు విమానాలు చేరుకుని అక్కడున్న భారతీయులను ఇండియాకు తరలిస్తాయని కేంద్రసహాయశాఖ మంత్రి కిషన్ రెడ్డి చెప్పారు. భౌతిక దూరం పాటించే విధంగా ఒక్కో విమానంలో 200-300 మందిని మాత్రమే తరలించనున్నట్టు పేర్కొన్నారు.

అయితే భారత్‌కు రాదల్చుకున్న వారు కరోనా నిర్ధారణ పరీక్షల సర్టిఫికెట్ పొంది ఉండాలని సూచించారు. విదేశాల నుంచి తరలించిన వారికి భారత్‌ వచ్చాక కూడా కరోనా పరీక్షలు నిర్వహించనున్నట్లు చెప్పారు. అంతేకాకుండా విదేశాల నుంచి వచ్చిన ప్రతి వ్యక్తి రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహిస్తున్న క్వారెంటైన్ కేంద్రాల్లో 14 రోజులపాటు ఉండాల్సిందే అని తేల్చి చెప్పారు. 

Also Read | త్వరలోనే బస్సులు,రైళ్లు నడుపుతాం..గడ్కరీ