వ్యాక్సిన్ వేయకుంటే స్ట్రైక్ చేస్తాం..ఎయిరిండియా పైలట్లు హెచ్చరిక

ఎయిర్ ఇండియా సిబ్బంది అంద‌రికీ త‌క్ష‌ణ‌మే వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ చేప‌ట్ట‌ని ప‌క్షంలో స్ట్రైక్ చేస్తామని ఎయిర్ ఇండియా పైల‌ట్ల సంఘం ప్రభుత్వాన్ని హెచ్చ‌రించింది.

వ్యాక్సిన్ వేయకుంటే స్ట్రైక్ చేస్తాం..ఎయిరిండియా పైలట్లు హెచ్చరిక

Air India Pilots Union Threatens Strike If Not Vaccinated On Priority

ICPA ఎయిర్ ఇండియా సిబ్బంది అంద‌రికీ త‌క్ష‌ణ‌మే వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ చేప‌ట్ట‌ని ప‌క్షంలో స్ట్రైక్ చేస్తామని ఎయిర్ ఇండియా పైల‌ట్ల సంఘం ప్రభుత్వాన్నిహెచ్చ‌రించింది. సంస్థ‌కు చెందిన 18 ఏళ్లకు పైబ‌డిన విమాన సిబ్బందికి వ్యాక్సిన్ వేసేందుకు జాతీయ స్థాయిలో ప్రథమ ప్రాథాన్యంగా కొవిడ్ వ్యాక్సినేషన్ క్యాంపులు నిర్వహించాలని,లేకుంటే తాము విధులు ఆపేస్తామ‌ని భార‌త వాణిజ్య పైల‌ట్ల సంఘం (ICPA) తేల్చిచెప్పింది.

ఈ మేరకు కేంద్ర పౌర‌విమానయాన మంత్రి హ‌ర్దీప్ సింగ్ పూరికి ఐసీపీఏ లేఖ రాసింది. చాలామంది విమాన సిబ్బంది ఇప్పటికే కరోనా బారినపడ్డారని ఆ లేఖలో ఆందోళన వ్యక్తం చేసింది. కరోనా మహమ్మారి సమయంలో సిబ్బంది తమ ప్రాణాలను పణంగా పెట్టి పనిచేస్తున్నారని పేర్కొంది. విపత్కర పరిస్థితి వేళ దేశం వెంట ఉన్న విమాన సిబ్బందిని, వారి కుటుంబాలను ప్రభుత్వం పట్టించుకోకుండా ఉంటుందని తాము అనుకోవడం లేదని, అయితే మేనేజ్‌మెంట్ తీరు తమను తీవ్ర నిరాశకు గురిచేస్తోందని ఆవేదన వ్యక్తం చేసింది. వర్క్ ఫ్రమ్ హోం చేస్తున్న వారికి, డెస్క్‌లో ఉండి పనిచేస్తున్న వారికి వ్యాక్సిన్ వేస్తున్నారని, కానీ ఫ్లైయింగ్ సిబ్బందికి మాత్రం ఇప్పటి వరకు వేయలేదని ఆందోళన వ్యక్తం చేసింది. త‌మ‌కు కొవిడ్-19 ముప్పు అధికంగా ఉన్నందున త‌క్ష‌ణ‌మే దేశ‌వ్యాప్తంగా ఎయిర్ ఇండియా పైల‌ట్ల కోసం వ్యాక్సినేష‌న్ కేంద్రాల‌ను ఏర్పాటు చేయాల‌ని ఐసీపీఏ ఆ లేఖలో కోరింది.

అదేవిధంగా,కోవిడ్-19కు ముందున్న వేత‌నాల‌ను త‌మ‌కు పున‌రుద్ధ‌రించాల‌ని ఈ లేఖ‌లో మంత్రిని కోరింది. గ‌తంలో మంత్రి హామీ ఇచ్చినా వేత‌న కోత‌ల‌పై ఎయిర్ ఇండియా యాజ‌మాన్యం పైల‌ట్ల ప‌ట్ల క‌టువుగా వ్య‌వ‌హ‌రిస్తోంద‌ని వాపోయింది. క‌రోనా మహ‌మ్మారి సాకుతో పైల‌ట్ల వేత‌నాల‌ను ఎయిర్ ఇండియా 55 శాతం త‌గ్గించింద‌ని డిసెంబ‌ర్ లో ఐదు శాతం మేర‌కు తిరిగి జోడించినా క‌రోనాకు ముందున్న వేత‌నాల‌తో పోలిస్తే పైల‌ట్ల వేత‌నాలు 50 శాతం త‌క్కువ‌గా ఉన్నాయ‌ని గుర్తుచేసింది.