Air India sale: ఎయిరిండియా అమ్మకానికి బ్రేక్.. ఈ ఏడాది లేనట్లే!

Air India sale: ఎయిరిండియా అమ్మకానికి బ్రేక్.. ఈ ఏడాది లేనట్లే!

Air India Sale

ఎయిరిండియా ప్రైవేటీకరణకు బ్రేక్ పడింది. కరోనా కారణంగా ఈ ఏడాది కూడా ప్రైవేటీకరణ లేనట్లే అన్నట్లుగా తెలుస్తుంది. ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం ఎయిర్ ఇండియా ఫైనల్ బిడ్డర్ పేరు ఖరారు కావాల్సి ఉండగా.. మరోసారి ప్రైవేటీకరణలో జాప్యం ఏర్పడింది. కరోనా సెకండ్ వేవ్, వ్యాక్సినేషన్ ప్రక్రియలో ఉండగా.. ప‌రిస్థితులు అనుకూలంగా లేవని, ప్ర‌స్తుత ఆర్థిక సంవ‌త్స‌రంలో ప్రైవేటీకరణ అనుమాన‌మేన‌ని నిపుణులు చెబుతున్నారు.

ఎయిరిండియాను కొనుగోలు చేసే ఫైనల్ బిడ్డర్ పేరును సెప్టెంబర్ లేదా అక్టోబర్ నాటికి ఫైనల్ చేయాల్సి ఉంది.. అయితే, ఆర్థిక సంవ‌త్స‌రంలో ప్ర‌భుత్వ రంగ సంస్థ‌ల్లో వాటాల ఉప‌సంహ‌ర‌ణ‌, పూర్తిగా ప్రైవేటీక‌ర‌ణ ద్వారా కేంద్రం రూ.1.75 ల‌క్ష‌ల కోట్ల నిధుల‌ను స‌మ‌కూర్చుకోవాల‌ని టార్గెట్ పెట్టుకుంది. కేంద్రప్ర‌భుత్వ రంగ బీమా సంస్థ.. భార‌తీయ జీవిత బీమా సంస్థ(ఎల్ఐసీ)లో ఐపీవో ద్వారా రూ. ల‌క్ష కోట్లు సేక‌రించాల‌ని కేంద్రం ప్లాన్ చేసుకుంటుంది.

టాటా స‌న్స్ ఎయిరిండియాను టేకోవర్ చేసుకునేందుకు ముందు వ‌రుస‌లో ఉంది. ఈ మేరకు అధికార వ‌ర్గాలు చెబుతుండగా.. స్పైస్ జెట్ ప్ర‌మోట‌ర్ అజ‌య్ సింగ్‌తోపాటు ఇత‌ర సంస్థ‌లు బిడ్లు దాఖ‌లు చేశాయి. కానీ టాటా స‌న్స్‌, అజ‌య్ సింగ్ బిడ్లు మాత్ర‌మే కేంద్రం ఓకే చేసినట్లు తెలుస్తుంది.

ఇప్ప‌టికైతే ఎయిర్ ఇండియాను టేకోవ‌ర్ చేసే విష‌య‌మై టాటా స‌న్స్ ఆశాభావంతో ఉంది. కేంద్ర ప్ర‌భుత్వ ప్ర‌ణాళిక‌లో భాగంగా కొవిడ్‌-19 మ‌హ‌మ్మారిని నియంత్రించ‌డంలో టాటా స‌న్స్ స‌హ‌క‌రిస్తుంది. ఈ విష‌య‌మై తాము ఇప్ప‌టికైతే ద్రుష్టిని కేంద్రీక‌రించ‌లేద‌ని టాటా స‌న్స్ చెబుతుంది. ప్ర‌భుత్వం నుంచి వ‌చ్చే సూచ‌న‌ల‌ను అనుస‌రిస్తామ‌ని అంటున్నారు.

మ‌రో మూడు నెల‌ల్లో ఎయిర్ ఇండియా ఫైన‌ల్ బిడ్ల‌ను వెల్ల‌డిస్తామ‌ని కేంద్ర ప్ర‌భుత్వ అధికారి ఒకరు చెప్పినట్లుగా జాతీయ మీడియా చెబుతుంది. ప్రస్తుత ఆర్థిక సంవ‌త్స‌రంలో ఎయిర్ ఇండియా కొనుగోలు దారును ప్రకటించి, దానిని స‌ద‌రు సంస్థ‌కు హ్యాండోవ‌ర్ చేయాలని యోచిస్తోన్నారు.